చైనా సంస్థల గుప్పిట్లో 25 లక్షల మంది వివరాలు

Spread the love

ఆట మనది.. వేట వారిది!

చైనా సంస్థల గుప్పిట్లో 25 లక్షల మంది వివరాలు

ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడిన వారి ఫొటోలు, ఈ-మెయిల్‌ ఐడీలు

ఈనాడు – హైదరాబాద్‌: ‘‘రంగులు చెప్పండి.. రూ.లక్షల్లో బహుమతులు పొందండి’’ అంటూ ప్రచారంతో యువతీ యువకులు, విద్యార్థులను ఆకర్షించి రూ.వందల కోట్లు కొల్లగొట్టిన చైనా కంపెనీల అసలు వ్యూహం వేరే ఉందని సైబర్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. డోకీపే, లింక్‌యున్‌ సహా 30 చైనా సంస్థల గుప్పిట్లో ఆన్‌లైన్‌ గేమ్‌లు ఆడిన 25 లక్షల మంది ఫొటోలు, ఈ-మెయిల్‌ చిరునామాలు ఉన్నాయని.. వారి వ్యక్తిగత వివరాల సేకరించి, ఫోన్లు, మెయిళ్లు, సామాజిక మాధ్యమాల ద్వారా వారి కార్యకలాపాలపై కన్నేశారని అంచనా వేస్తున్నారు. దీనిపై సైబర్‌ క్రైం ఎస్సై మదన్‌ నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందాన్ని ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు.

బహుమతులిస్తామంటూ మాయాజాలం

రెండేళ్ల క్రితం చైనా కంపెనీలు ‘కలర్‌ ప్రిడిక్షన్‌’ పేరుతో ఆన్‌లైన్‌ ఆటలకు తెరతీశాయి. విజేతలకు నగదుతో పాటు అదనంగా బహుమతులిస్తామంటూ ఆకట్టుకుని.. వారి ఫొటోలు, వివరాలను వెబ్‌సైట్లలో ఉంచుతామంటూ పందెంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి ఫొటో, ఈ-మెయిల్‌ ఐడీని చైనా కంపెనీలు సేకరించాయి.

ఇలా ఫొటోలు, మెయిల్‌ చిరునామాలు, వివరాల సేకరణ ఎందుకనే అంశంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఓ పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నారు.

తెరవెనుక చైనా ఈ-కామర్స్‌ దిగ్గజం!

ఆన్‌లైన్‌ ఆటల కంపెనీలకు ప్రపంచంలోనే అతిపెద్దదిగా పేరొందిన చైనాకు చెందిన ఓ ఈ-కామర్స్‌ సంస్థ వెన్నుదన్నుగా ఉందని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు.

ఈ సంస్థ దిల్లీలోని వేర్వేరు చైనా కంపెనీల మధ్య లావాదేవీలు కొనసాగించినట్టు పోలీసులకు ఎలక్ట్రానిక్‌ సాక్ష్యాలు లభించాయి. దిల్లీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న చైనా కంపెనీలు హవాలా మార్గం ద్వారా రూ.వందల కోట్లు హాంకాంగ్‌కు తరలించాయని తెలుసుకున్న పోలీసులు ఆరా తీయగా..ఈ-కామర్స్‌ దిగ్గజ సంస్థ పేరు తెరపైకి వచ్చింది.

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కేసులో కీలక ఆధారాల సేకరణ

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ద్వారా దాదాపు రూ.వెయ్యి కోట్లు ఆర్జించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ (ఈడీ) అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం.

స్థానికంగా ఆర్జించిన మొత్తాన్ని నకిలీ ఇన్‌వాయిస్‌ల ద్వారా విదేశాలకు మళ్లించినట్లు తెలుస్తోంది. వివిధ యాప్‌ల ద్వారా ఆన్‌లైన్‌ ఆటలు నిర్వహిస్తూ పెద్దమొత్తంలో ఆర్జించిన చైనాకు చెందిన యాన్‌హో, అతనితో జట్టుకట్టిన దిల్లీకి చెందిన ధీరజ్‌ సర్కార్‌, అంకిత్‌ కపూర్‌ల బండారాన్ని హైదరాబాద్‌ పోలీసులు బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే.

సీసీఎస్‌లోని సైబర్‌ నేరాల విభాగం వీరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. రూ.కోట్లాది సొమ్మును అక్రమ మార్గంలో దారిమళ్లినట్లు తేలడంతో రంగంలోకి దిగిన ఈడీ.. న్యాయస్థానం అనుమతితో ఈ ముగ్గురు నిందితులను తదుపరి విచారణ కోసం మంగళవారం అదుపులోకి తీసుకుంది.

ఆన్‌లైన్‌ ఆటల ద్వారా ఆర్జించిన మొత్తాన్ని విదేశాలకు మళ్లించేందుకు నిందితులు వివిధ దేశాల నుంచి సాఫ్ట్‌వేర్‌ కొనుగోలు చేసినట్లు, దాన్ని ఆన్‌లైన్‌లో దిగుమతి చేసుకున్నట్లు చూపించారని, దీనికోసం నకిలీ ఇన్‌వాయిస్‌లు సృష్టించారని ఈడీ గుర్తించింది. విచారణలో భాగంగా ముగ్గురు నిందితులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading