రెండుసార్లు అధ్యక్ష పదవి వెక్కిరింతలు:జో బైడెన్‌జో బైడెన్‌

Spread the love

*మధ్య తరగతి మహారేణువు!* *వికసించిన కృష్ణకమలం*

*మధ్య తరగతి మహారేణువు!*

*నత్తితో మాటలు సరిగ్గా వచ్చేవి కావు…

* *నట్టుగాడని దోస్తులంతా ఎగతాళి చేసేవారు!*

*రెండుసార్లు అధ్యక్ష పదవి వెక్కిరింతలు…!*

*పెళ్ళయిన కొన్నాళ్ళకే భార్య… చేతికొచ్చాక కొడుకు మరణాలు!…* *కింకర్తవ్యం?*

*ఇలా ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని…జీవితాన్ని నిలబెట్టుకొని చరమాంకంలో… 77 ఏళ్ళ వయసులో ప్రపంచ పెద్దన్నలాంటి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తున్న _జో బైడెన్‌…._ జీవన ప్రస్థానంలో ఎన్నో ఆదర్శాలు… అవమానాలు…*

*ఆనందాలు… వెరసి బలమైన  కుటుంబ అనుబంధాలు!*

50 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, రెండుసార్లు అమెరికా ఉపాధ్యక్షుడిగా చేసినా జో బైడెన్‌ ఎంత పేరు సంపాదించారో తెలియదుగానీ… ట్రంప్‌ను ఎదుర్కొని దేశ విదేశాల్లో ఇప్పుడందరి దృష్టిలో పడ్డారు! 77 ఏళ్ళ బైడెన్‌ అమెరికాకు అత్యంత పెద్దవయస్కుడైన అధ్యక్షుడిగా రికార్డు సృష్టించబోతున్నారు._

*ముచ్చటగా మూడోసారికి…*

నిజానికి అధ్యక్ష పదవిపై బైడెన్‌ మనసు పడటం ఇదే తొలిసారి కాదు. ఇప్పుడు ఘనవిజయం సాధించిన బైడెన్‌ తొలి రెండు ప్రయత్నాల్లో అవమానాలే ఎదుర్కొన్నారు. 1988లో తొలిసారి 40 ఏళ్ళ కుర్రతనం ఉరకలెత్తుతుంటే.. బైడెన్‌ అధ్యక్షుడు కావాలనుకున్నారు. కానీ తన ఉపన్యాసాల్లో వేరేవాళ్ళను కాపీకొట్టినట్లు తేలటంతో ఆ ప్రయత్నం విఫలమైంది. 2008లో మరోమారు బరిలోకి దిగాలనుకుంటే… డెమొక్రాటిక్‌ ప్రాథమిక అభ్యర్థిత్వానికే పెద్దగా మద్దతు లభించలేదు. కానీ… అదే సంవత్సరం ఒబామా తనను ఉపాధ్యక్ష పదవికి ఎంచుకున్నారు. విదేశాంగ వ్యవహారాల్లో ఒబామాకు పరిష్కారకర్తగా, సలహాదారుగా వ్యవహరించారు.

*కష్టాల కడలిలోంచి….* ఐరిష్‌ కాథలిక్‌ కుటుంబంలో 1942 నవంబరు 20న పుట్టారు. బైడెన్‌కు ముగ్గురు తోబుట్టువులు. ఆర్థికంగా తొలుత కుటుంబం బాగానే ఉన్నా… బైడెన్‌ పుట్టే సమయానికి ఆర్థిక పరిస్థితి దిగజారింది. దీంతో తాతమ్మల వద్దే కుటుంబం గడపాల్సి వచ్చింది. తండ్రి తర్వాత సెకండ్‌హ్యాండ్‌ కార్ల అమ్మకాల్లో స్థిరపడ్డారు. బైడెన్‌ చదువుల్లో అంతంతే గానీ… క్లాసులీడర్‌గా ఉండేవారు. ఫుట్‌బాల్‌, బేస్‌బాల్‌ ఆడేవారు. సిరక్యూస్‌ యూనివర్సిటీ నుంచి 1968లో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.

*ఉపన్యాసానికి లక్ష డాలర్లు…* మధ్యతరగతి నుంచి వచ్చిన బైడెన్‌ తన స్వయంకృషితో అమెరికాలోని మిలియనీర్ల జాబితాలో చేరారు. పుస్తకాలు, ఉపన్యాసాల ద్వారా చాలా సంపాదించారు. 2019లో విడుదల చేసిన లెక్కల ప్రకారం భార్యాభర్తలిద్దరూ పుస్తకాలు, ఉపన్యాసాల ద్వారా 15లక్షల డాలర్లు సంపాదించారు. 2017లో తన కుమారుడు బ్యూ క్యాన్సర్‌పై రాసిన పుస్తకం కొద్దికాలం పాటు అత్యధిక ప్రాచుర్యంగల పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది. విదేశాంగనీతిలో నిపుణుడైన బైడెన్‌  విశ్వవిద్యాలయాలు, కాలేజీల్లో ఉపన్యాసాలిస్తుంటారు. ఒక్కో ఉపన్యాసానికి సుమారు లక్ష డాలర్లు ఫీజుకింద తీసుకుంటారు. న్యూజెర్సీ యూనివర్సిటీలో ఇచ్చిన ఓ ఉపన్యాసానికైతే దాదాపు రెండు లక్షల డాలర్లు వచ్చిందని సమాచారం. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని పెన్‌బైడెన్‌ సెంటర్‌ ఫర్‌ డిప్లమసీ అండ్‌ గ్లోబల్‌ ఎంగేజ్‌మెంట్‌లో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా బైడెన్‌ దాదాపు 5.5 లక్షల డాలర్లు సంపాదించారు. మొత్తానికి భార్యాభర్తలిద్దరూ కలసి 2019లో దాదాపు 10 లక్షల డాలర్లు అమెరికా ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లించారు.

* ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒసామా బిన్‌ లాడెన్‌ను చంపాలని నిర్ణయించుకుంటే… అది రిస్క్‌తో కూడుకున్నదని ఉపాధ్యక్షుడైన బైడెన్‌ వారించారట. అయినా ఒబామా తన నిర్ణయంతోనే ముందుకు వెళ్ళారు! *ప్రమాదాలు విషాదాలు* బైడెన్‌ జీవితంలో ప్రమాదాలు విషాదాన్ని నింపాయి. 1972లో తన తొలిభార్య నెలియా, ఏడాది పాప… కిస్మస్‌ షాపింగ్‌ నుంచి వస్తూ కారు ప్రమాదంలో మరణించారు. ఇద్దరు కుమారులు గాయపడ్డారు. ఇద్దరు అబ్బాయిలకు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలో కుమారుడి పక్కన నిలబడే తొలిసారి సెనెటర్‌గా ప్రమాణం స్వీకారం చేశారు. కుమారుడు బ్యూ తండ్రి బాటలో పయనించి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. డెలావర్‌ రాష్ట్రానికి అటార్నీ జనరల్‌ అయ్యాడు. తండ్రి వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టే దశలో… 2015లో 46 ఏళ్ళ వయసులో బ్రెయిన్‌ క్యాన్సర్‌తో మరణించాడు. ఇది బైడెన్‌కు రెండో షాక్‌!

*ఆమెతో జీవితం మారింది…* 1975లో జిల్‌ బైడెన్‌ను కలిశారు. రెండేళ్ళ తర్వాత ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు. అప్పటికే జిల్‌ తన మొదటి భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. జిల్‌ కంటే బైడెన్‌ 8 సంవత్సరాలు పెద్ద! బైడెన్‌కు మొదటి భార్య ద్వారా పుట్టిన పిల్లలకు జిల్‌ మంచి తల్లయింది. వీరిద్దరికి 1981లో కూతురు (ఆష్లే) పుట్టింది. తానిప్పుడు సామాజిక కార్యకర్త. ప్రస్తుతం బైడెన్‌-జిల్‌లకు ఐదుగురు మనువలు మనువరాళ్ళు! జిల్‌ ప్రోత్సాహంతోనే బైడెన్‌ రాజకీయాల్లో చురుగ్గా ముందుకు కదిలానంటారు. *పోతాడని పాస్టర్‌ను పిలిపించారు…* ఆరోగ్యం విషయంలో బైడెన్‌ చాలా జాగ్రత్తగా ఉంటారు. 77 ఏళ్ళ వయసులోనూ పరుగులాంటి వేగంతో నడవగలుగుతున్నారు. మందు, సిగరెట్లలాంటి అలవాట్లు లేవు. మందుకు పూర్తిగా దూరం. 80 కిలోల బరువుతో.. వారానికి ఐదు రోజులు వ్యాయామం చేస్తారు. 1988లో ఓసారి మాత్రం బైడెన్‌కు తీవ్ర అనారోగ్యం చేసింది. మెదడుకు శస్త్రచికిత్స కూడా చేశారు. ఇక పోతాడనుకొని… చర్చి పాస్టర్‌ను కూడా పిలిపించారు. బైడెన్‌ మరో కుమారుడు హంటర్‌ మందు, డ్రగ్స్‌కు బానిసై… డోప్‌ టెస్టులో పట్టుబడటంతో  2014లో అమెరికా నౌకాదళం రిజర్వ్‌ నుంచి బయటికొచ్చాడు.

బైడెన్‌ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఉక్రెయిన్‌ గ్యాస్‌ కంపెనీ బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌లో ఒకరిగా హంటర్‌ ఉన్నాడు. ఈ సందర్భంగానే… అవినీతి, అధికార దుర్వినియోగం జరిగిందంటూ… ట్రంప్‌ ఇటీవల ఎన్నికల్లో బైడెన్‌పై ఆరోపణలు గుప్పించారు. హంటర్‌ ప్రస్తుతం లాస్‌ ఏంజిల్స్‌లో పెయింటర్‌గా జీవితం గడుపుతున్నారు. 2008లో పాకిస్థాన్‌ బైడెన్‌కు రెండో అత్యున్నత పౌర పురస్కారమైన హిలాల్‌ ఎ పాకిస్థాన్‌ను బహూకరించింది. 1.5 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.10వేల కోట్లు) సైనికేతర ఆర్థిక సహాయం వచ్చేలా చేసినందుకు దీనిని ప్రదానం చేసింది.

*కలిసొచ్చినవి…* * డెమొక్రాట్లలో మితవాదిగా పేరుతెచ్చుకోవటం * ఒబామా హయాంలో రెండుసార్లూ ఉపాధ్యక్షుడిగా చేసిన పేరు. అమెరికా చరిత్రలో అత్యంత సమర్థుడైన ఉపాధ్యక్షుడంటూ ఒబామా ఇచ్చిన కితాబు * అందరికీ అందుబాటులోకి ఆరోగ్యం అనేది బైడెన్‌ నినాదం. వ్యక్తిగతంగా పిల్లల్ని కోల్పోయిన బాధ ఆయన్ను ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చేలా చేస్తోంది.

* ఎన్నికల సమయంలో ఎలా ఉన్నా… కీలకాంశాల్లో రిపబ్లికన్‌, డెమొక్రాటిక్‌ పార్టీలు కలసి పనిచేయాలన్నది బైడెన్‌ విశ్వాసం. అందుకే రిపబ్లికన్‌లలోని మితవాదులు కూడా బైడెన్‌కు మద్దతు ఇస్తారని అనుకుంటున్నారు.

*భరోసా కలిగించినవి* * కరోనాను బైడెన్‌ విజయవంతంగా కట్టడి చేస్తారని ప్రతి 10 మంది ఓటర్లలో నలుగురు విశ్వసించారు. * జాతి వివక్షకు తావు లేకుండా పోలీసు వ్యవస్థలో సమూల మార్పులు   చేస్తానన్న హామీ.

* భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసుకోవడం. * పారిస్‌ ఒప్పందంలో తిరిగి చేరుతామని ప్రకటించడం. * ఇరాన్‌తో అణు ఒప్పంద పునరుద్ధరణపై పునరాలోచన చేస్తామనడం.

*నత్తితో…* *నత్తి ఉండేది…. చిన్నప్పుడు నత్తికారణంగా… తోటిపిల్లలు గేలిచేసేవారు. ‘డాష్‌’ అంటూ తనను ఆటపట్టించేవారు. ఆత్మన్యూనతతో బాధపడకుండా గంటల తరబడి అద్దం ముందు నిలబడి కవితలు చదువుతూ… క్రమంగా దాన్ని అధిగమించారు. అయినా… ఇప్పటికీ బైడెన్‌కు మాట తడబడుతూనే ఉంటుంది. ఇప్పటికీ… నత్తితో బాధపడేవారికి బైడెన్‌ సలహాలు సూచనలిస్తూ ధైర్యాన్ని నూరిపోస్తుంటారు. *పిల్లల కోసం రోజూ ప్రయాణం…* సుదీర్ఘకాలం రాజకీయాల్లో మునిగితేలుతున్నా బైడెన్‌ ఎన్నడూ కుటుంబాన్ని, పిల్లల్ని నిర్లక్ష్యం చేయలేదు.  రాజకీయాల కారణంగా వాషింగ్టన్‌ డీసీలో ఉన్నా… పిల్లలతో గడిపేందుకు ప్రతి రోజూ రైలు పట్టుకొని గంటన్నర ప్రయాణం చేసి రాత్రికల్లా డెలావర్‌లోని ఇంటికి చేరుకునేవారు. ఈ అలవాటును తాను సెనేటర్‌గా ఉన్న   36 సంవత్సరాల పాటు అలాగే కొనసాగించటం విశేషం.

*తొలుత రిపబ్లికన్‌…* ప్రస్తుతం డెమొక్రాటిక్‌ అభ్యర్థిగా అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తున్న బైడెన్‌ నిజానికి తన రాజకీయ అరంగేట్రం రిపబ్లికన్‌గానే చేశారు. 1968లో విలియం ప్రికెట్‌ వద్ద లాయర్‌గా పనిచేసేవారు. ఆయన రిపబ్లికన్‌. తాను కూడా అప్పటికి రిపబ్లికన్‌ నేతలకు మద్దతిచ్చేవారు. స్థానిక రిపబ్లికన్‌లు బైడెన్‌ను కూడా రిజిస్టర్‌ చేయించారు. కానీ అప్పటి అధ్యక్ష అభ్యర్థి నిక్సన్‌ అంటే ఇష్టం లేని బైడెన్‌ తర్వాత తన రిజిస్ట్రేషన్‌ను స్వతంత్రంగా మార్చుకున్నారు. తర్వాత డెమొక్రాటిక్‌ పార్టీలో చేరారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading