*ప్రేమ్‌జీ.. దాతృత్వంలో గురూజీ* *రోజుకు రూ.22 కోట్ల వితరణ*
*ఈ ఏడాదిలో రూ.7,904 కోట్ల విరాళం* *ఎడెల్‌గివ్ హురున్ దాతృత్వ జాబితాలో అగ్రస్థానం*
*తర్వాతి స్థానాల్లో నాడార్, ముకేశ్ అంబానీ*
ముంబయి: విప్రో వ్యవస్థాపక ఛైర్మన్ ప్రేమ్‌జీ చేతికి ఎముక లేదని మరోసారి రుజువైంది. ఆయన గత ఆర్థిక సంవత్సరం (2019-20)లో రూ.7,904 కోట్ల వితరణ చేశారు. అంటే రోజుకు రూ.22 కోట్ల చొప్పున దానమిచ్చారన్నమాట. ఈ ఉదారతతో ఎడెల్‌గివ్ హూరన్ ఇండియా దాతృత్వ జాబితా-2020లో ఎవరూ అందలేనంత ఎత్తుకు చేరారు. 2018-19లో అగ్రస్థానంలో ఉన్న హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపక ఛైర్మన్ శివ్‌నాడార్‌ను తోసిరాజని మొదటి స్థానంలో నిలిచారు. నాడార్ విరాళాలు రూ.795 కోట్లుగా నిలిచాయి. 2018-19లో ఈయన రూ.826 కోట్లు సమాజానికిచ్చారు. అప్పుడు ప్రేమ్‌జీ రూ.426 కోట్లు వితరణ చేశారు. ఇక దేశంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచిన ముకేశ్ అంబానీ, రూ.458 కోట్ల వితరణతో దాతృత్వ జాబితాలో మూడోస్థానంలో కొనసాగారు. అంతక్రితం ఏడాది ముకేశ్ రూ.402 కోట్లు ఇచ్చారు. * కుమార మంగళం బిర్లా(4), అనిల్ అగర్వాల్(5)లు టాప్-5లో నిలిచారు. ఏప్రిల్ 1, 2019 నుంచి మార్చి 31, 2020 వరకు నగదు, నగదు సమానాలను చట్టబద్ధంగా చేసిన వితరణలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన ఈ జాబితా ముఖ్యాంశాలు.. * ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని(రూ.159 కోట్లు), క్రిస్ గోపాలకృష్ణన్(రూ.50 కోట్లు), ఎస్.డి. శిబూలాల్(రూ.32 కోట్లు) ఈ జాబితాలో ఉన్నారు. * రూ.47 కోట్లతో రోహిణి నీలేకని(61) జాబితాలో అత్యంత వితరణశీలి అయిన మహిళగా అగ్రస్థానంలో నిలిచారు. రూ.5 కోట్ల కంటే ఎక్కువ ఇచ్చిన వారు 109 మంది ఉండగా.. అందులో ఏడుగురు మహిళలున్నారు. జాబితాలో సగటు వయసు 66 ఏళ్లు కావడం గమనార్హం. * రూ.27 కోట్ల దానంతో ఏటీఈ చంద్ర ఫౌండేషన్‌కు చెందిన అమిత్ చంద్ర(52), అర్చన చంద్ర(49)లు జాబితాలోకెక్కిన మొట్టమొదటి ప్రొఫెషనల్ మేనేజర్స్‌గా నిలిచారు. * 37 ఏళ్ల బిన్నీ బన్సాల్ (రూ.5.3 కోట్లు) ఈ జాబితాలో అత్యంత పిన్న వయస్కుడు. * 90 మంది దానశీలురు విద్య కోసం అత్యధికంగా రూ.9324 కోట్లు ఇవ్వడం విశేషం.(ప్రేమ్‌జీ, నాడార్‌లు ఇందులో ముందున్నారు.) * మొత్తం వితరణలు 175 శాతం వృద్ధి చెంది రూ.12,050 కోట్లకు చేరాయి. 28 మంది కొత్తగా జాబితాలోకెక్కారు. * రూ.10 కోట్ల కంటే ఎక్కువ ఇచ్చిన వ్యక్తుల సంఖ్య 37 నుంచి 78కి చేరింది. * 36 మందితో ముంబయి అత్యంత ఎక్కువ వితరణశీలురున్న నగరంగా నిలిచింది. ఆ తర్వాతి జాబితాలో దిల్లీ(20), బెంగళూరు(10)లున్నాయి.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.