*పసిడి కాంతులు వెదజల్లేనా?*
*10 గ్రాములు రూ.52000 పైనే మేలిమి బంగారం*
*వెంటాడుతున్న ఆర్థిక మందగమనం*
*పాత ఆభరణాల మార్పిడికి వీలు*
*ధరలు మండిపోతుండటంతో, పసిడి, వెండి కొనుగోలుకు శుభప్రదంగా భావించే ధన త్రయోదశి (శుక్రవారం) ఈసారి ఎలా ఉంటుందోనని విక్రేతలు ఎదురు చూస్తున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ సమర్థతపై ఫైజర్ ప్రకటన నేపథ్యంలో, సోమవారం అంతర్జాతీయ, దేశీయ ఫ్యూచర్ విపణుల ధరల్లో భారీగా దిద్దుబాటు చోటుచేసుకోవడమూ ప్రభావం చూపుతోంది.
కొనుగోలుదార్లను ఆకర్షించి, అమ్మకాలు పెంచుకునేందుకు తరుగు, మజూరు ఛార్జీలలో రాయితీ, పాత ఆభరణాల మార్పిడికి ప్రోత్సాహకాలను సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. బంగారం ధర బాగా పెరిగినందున, తక్కువ బరువులోనే, ఆకర్షణీయ రూపుల్లో ఆభరణాలను చేయించడంపై సంస్థలన్నీ దృష్టి సారించాయి.*
దీపావళి, ధన త్రయోదశి సందర్భంగా సొంత అవసరాలతో పాటు బహుమతులుగా ఇచ్చేందుకు జరిపే కొనుగోళ్లు అధికంగా ఉంటాయి. వ్యక్తులతో పాటు కార్పొరేట్ సంస్థలూ ఇందులో ముందుంటాయి. ఉన్నతోద్యోగులకు బంగారం, వెండి నాణేలు గతంలో ఎక్కువగ ఇచ్చేవారు. ఉత్తర భారతీయుల కంపెనీలు, వాణిజ్య సంస్థల్లో దీపావళికి బోనస్‌లు ఇస్తుంటారు కనుక, ఆ మొత్తంతో భార్యాపిల్లల కోసం పసిడి కొనుగోలు చేయడమూ ఎక్కువే. కాకపోతే కొవిడ్-19 నేపథ్యంలో, ఇటీవలి వరకు పలు సంస్థలు వేతన కోతలు అమలు చేశాయి. బోనస్‌లు మాత్రం 2019-20కి సంబంధించిన ఆర్థిక అంశాలకు సంబంధించనది కావడం, ఈ నవంబరులోపు పంపిణీ చేయాల్సి ఉన్నందున, లాభాల్లో ఉన్న సంస్థలు జారీ చేస్తున్నాయి. అయితే మేలిమి బంగారం ధర గతేడాదితో పోలిస్తే గ్రాముకు రూ.1350 పెరిగి రూ.5250కి చేరింది. వెండి ధర కూడా కిలో రూ.64000పైన ఉంది. గతేడాది దీపావళి సమయానికి మేలిమిబంగారం గ్రాము ధర రూ.3900 మాత్రమే కావడం గమనార్హం. గతేడాది ఈ పండుగకు కొనుగోలు చేసిన వారి ఆభరణాల విలువ పెరగడంతో, వారు సంతోషిస్తుంటారు. ఈసారీ కొనుగోలు చేస్తే మరింత లాభపడతాం అనే భావనలోనూ ఉంటారు. అయితే ధర మరీ ఎక్కువగా ఉండటం, ఆర్థిక మందగమన ప్రభావం ఉండొచ్చని విక్రేతలు భావిస్తున్నారు. అందుకే పాత బంగారం మార్పిడితో అయినా కొత్తవి కొనుగోలు చేసేలా ఆఫర్లతో ఆకర్షిస్తున్నారు. ఆర్థిక మందగమన ప్రభావం అంతగా లేని సంపన్నులు మాత్రం ఖరీదైన ఆభరణాలు కొనుగోలు చేస్తారనే ఆశిస్తున్నారు. *పాత ఆభరణాల మార్పిడి పెరుగుతోంది* పాత ఆభరణాలు తీసుకొస్తే, నాణ్యత పరీక్షించి, అదే బరువుకు సమానమైన కొత్త ఆభరణాలు తీసుకెళ్లొచ్చని విక్రయసంస్థలు పేర్కొంటున్నాయి. ఎందుకూ అంటే, పాత ఆభరణాల బంగారం బదులు కొత్తది ఇస్తారు. కాకపోతే కొత్త ఆభరణాల తరుగు, మజూరి ఛార్జీల రూపంలో వారికి ఆదాయం వస్తుంది. తరుగు కింద ఆభరణం డిజైన్‌కు అనుగుణంగా 4-30 శాతం వరకు కూడా ఉంటోంది. కంటికి ఇంపుగా కనిపించే అత్యధిక ఆభరణాలకు 18-28 శాతం తరుగు కింద వేస్తున్నారు. అంటే 10 గ్రాముల గొలుసు కొన్నా 1.8-2.8 గ్రాముల బంగారం విలువకు సమానమైన మొత్తాన్ని అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఆభరణాల (22 క్యారెట్లు) బంగారం గ్రాము రూ.4700పైన ఉంది. అంటే 50 గ్రాముల ఆభరణానికి 18 శాతం తరుగు అనుకుంటే 9 గ్రాముల బంగారం విలువ మొత్తాన్ని (రూ.42000 పైన) అదనంగా చెల్లించాల్సి వస్తుంది. బిస్కెట్ రూపంలో కొనుగోలు చేసే మేలిమి బంగారానికి మాత్రమే ఇలాంటివి ఉండవు. * పాత ఆభరణాలు మార్చుకుని, అంతే బరువైన కొత్త ఆభరణాలు తీసుకుంటే మినహా, పసిడి ఏ రూపంలో కొన్నా 3 శాతం జీఎస్‌టీ (వస్తు సేవల పన్ను) చెల్లించాలి. * వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు తదుపరి 4-5 నెలల్లో తక్కువగా ఉన్నాయి. అయితే కొవిడ్ వల్ల భారీసంఖ్యలో అతిథులను ఆహ్వానించడం లేదు కనుక, అలా మిగిలే మొత్తాన్ని బంగారం కొనుగోలుకు వెచ్చిస్తారనే భావనలో వ్యాపారులున్నారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.