2014-29 కాలం ఓ సువర్ణాధ్యాయం

Spread the love

*2014-29 కాలం ఓ సువర్ణాధ్యాయం

* *16, 17, 18వ లోక్‌సభలు దేశ చరిత్రలో నిలిచిపోతాయి*  

*ఎంపీల నూతన వసతి ప్రారంభోత్సవంలో మోదీ*

దిల్లీ: భారత్‌ వంటి యువ ప్రజాస్వామ్యానికి 16, 17, 18 లోక్‌సభలు అత్యంత కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వీటికి సంబంధించి 2014-29 మధ్య కాలం అనేక చరిత్రాత్మక ఘట్టాలకు, అభివృద్ధికి నిదర్శనంగా నిలిచిపోతుందని చెప్పారు. గడచిన ఆరేళ్ల కాలంలో దేశం ఎన్నో కార్యక్రమాలను చూసిందని, మిగిలిన వ్యవధిలో ఇంకా చాలా జరగాల్సి ఉందని తెలిపారు. 16, 17, 18 ఏళ్ల ప్రాయం యువతకు ఎంత ముఖ్యమో..

16 నుంచి 18వ లోక్‌సభలు దేశానికి అంత ముఖ్యమని చెప్పారు. దిల్లీలో ఎంపీల కోసం నూతనంగా బహుళ అంతస్తుల్లో నిర్మించిన 76 ఫ్లాట్లను సోమవారం ఆయన డిజిటల్‌ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. అనంతరం ఎంపీలను, మంత్రులను ఉద్దేశించి ప్రసంగించారు.

*ఆ నమ్మకం నాకుంది..* ‘‘16వ లోక్‌సభ (2014-19) చారిత్రకమైనది. వ్యవసాయ సంస్కరణలు, కార్మిక రంగంలో నూతన చట్టాల రూపకల్పన, పౌరసత్వ చట్ట సవరణ, జమ్మూ-కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి రద్దు వంటి నిర్ణయాలతో 17వ లోక్‌సభ (2019-24) ఇప్పటికే చరిత్ర సృష్టించింది. తదుపరి సభ (2024-29) కూడా నూతన దశాబ్దిలో దేశాన్ని మలుపు తిప్పడంలో ముఖ్య భూమిక వహిస్తుందన్న నమ్మకం నాకుంది. చరిత్రను మదించినప్పుడు ఈ 15 ఏళ్ల కాలం దేశానికి సువర్ణాధ్యాయంగా నిలిచిపోయేలా చూడడం మన బాధ్యత’’ అని ప్రధాని చెప్పారు.

*ఓం బిర్లా పనితీరుకు కితాబు* కార్యక్రమంలో పాల్గొన్న లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా 58వ జన్మదినాన్ని పురస్కరించుకుని మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. సభను చక్కగా నడపడంతో పాటు, చర్చల్లో నాణ్యత పెరిగేలా చూస్తున్నారని కితాబిచ్చారు.

* 80 ఏళ్లక్రితం నాటి భవనాల స్థానంలో కొత్త ఫ్లాట్లు

* ఒక్కో టవర్‌లో అంతస్తుకు 2 చొప్పున 4 పడక గదుల ఇళ్లు

* 27నెలల్లో ప్రీఫ్యాబ్రికేటెడ్‌ పద్ధతిలో నిర్మాణం

* రూ.218 కోట్ల ముందస్తు అంచనా వ్యయం కంటే రూ.30 కోట్ల (-13.76%) తక్కువకే నిర్మాణం పూర్తి

* ఒక్కో ఇంటి నిర్మాణానికి సగటు వ్యయం రూ.2.47 కోట్లు

* నిర్మాణం కోసం ఫ్లైయాష్‌, నిర్మాణ వ్యర్థాలతో రూపొందించిన ఇటుకల వాడకం * వేడిని తగ్గించడానికి, ఇంధనాన్ని సమర్థంగా ఉపయోగించడానికి వీలుగా ప్రత్యేక అద్దాల కిటికీలు

* భవనాల పైన ఏర్పాటు చేసిన సౌర ఫలకాలతో విద్యుదుత్పత్తి

* తక్కువ విద్యుత్తును ఉపయోగించే ఎల్‌ఈడీ బల్బుల వినియోగం

* మనుషులు లేనిచోట దీపాలు వాటంతట అవే ఆగిపోయేలా సెన్సర్లు

* గది ఉష్ణోగ్రతలకు అనుగుణంగా తక్కువ విద్యుత్తును ఉపయోగించుకుంటూ గాలి విడుదల చేసేలా ఏసీల ఏర్పాటు.

* తక్కువ నీటితోనే సాధారణ అవసరాలు తీర్చుకొనేలా కొళాయిలు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading