*ప్రభుత్వ ఉద్యోగులకు డ్రెస్‌కోడ్: జీన్స్, టీషర్ట్‌కు నో!*
ముంబయి: ప్రభుత్వ ఉద్యోగం.. అందులోనూ వేలల్లో జీతం.. అలాగని చెప్పి నచ్చిన దుస్తులు వేసుకెళ్తానంటే ఇకపై మహారాష్ట్రలో కుదరదు. తాజాగా అక్కడి ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి కొత్త డ్రెస్‌కోడ్‌ను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఇకపై ఉద్యోగులెవరూ జీన్స్, టీషర్ట్ ధరించకూడదు.
రెగ్యులర్ ఉద్యోగులతో పాటు, కాంట్రాక్ట్ ఉద్యోగులకూ ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల వేషధారణకు సంబంధించి ఈ నెల 8న ఓ సర్క్యులర్ జారీ చేసింది. కొందరు ఉద్యోగులు, సిబ్బంది తాము చేస్తున్న పనికి తగ్గ దుస్తులు ధరించడం లేదని, దీనివల్ల ప్రజల్లో ఉద్యోగుల పట్ల చులకన భావం ఏర్పడుతోందని సర్క్యులర్ పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వ్యక్తిత్వం, మంచి ప్రవర్తనను ప్రజలు ఆశిస్తారని తెలిపింది.
ఉద్యోగులు అనువుకాని, శుభ్రతలేని దుస్తులు ధరించడం వల్ల దాని ప్రభావం పనిపైనా ప్రభావం చూపుతోందని అభిప్రాయపడింది. అందుకే పరిశుభ్రమైన, యోగ్యమైన వేషధారణలో కనిపించాల్సి ఉంటుందని సర్క్యులర్ పేర్కొంది. మహిళా ఉద్యోగులైతే చీరలు, సల్వార్/ చుడిదార్స్ కుర్తాస్, ట్రౌజర్ ప్యాంట్స్ ధరించొచ్చని పేర్కొంది. పురుష ఉద్యోగులు మాత్రం షర్ట్, ప్యాంట్స్ ధరించాలంది.
వేసుకునే చెప్పులు సైతం హుందాగా ఉండాలని సూచించింది. బొమ్మలు, ఎంబ్రాయిడరీ వర్క్స్ ఉన్నవి, మరీ ముదురు రంగు ఉన్న చొక్కాలు కూడా ధరించరాదని.. మరీ ముఖ్యంగా జీన్స్, టీషర్ట్‌కు దూరంగా ఉండాలని పేర్కొంది. అలాగే చేనేతను ప్రోత్సహించేందుకు వారంలో ఒకరోజు ఖాదీ దుస్తులు ధరించాలని సర్క్యులర్ జారీ చేసింది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.