*20% కుటుంబాలకు ఇళ్ల స్థలాలు* *రిజిస్ట్రేషన్ చేసి అక్కాచెల్లెళ్లకు ఆస్తిగా ఇస్తాం*
*ఇంకా రాని వారు ఉంటే 90 రోజుల్లోనే స్థలమిస్తాం*
*85% కరోనా కేసులు ఇళ్లలోనే నయమవుతున్నాయి..*
*‘స్పందన’లో ముఖ్యమంత్రి జగన్ వెల్లడి* రాష్ట్రంలో ఉన్న కుటుంబాల్లో 20శాతం.. అంటే 30 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలను రిజిస్ట్రేషన్ చేసి ఒక ఆస్తిగా ఇవ్వనున్నామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు.
ఈ నెల 8న స్థలాలు ఇవ్వాలని ఎంతో ఆశపడ్డామని, కొందరు తెలుగుదేశం నాయకులు కోర్టుకు వెళ్లడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని వివరించారు. డి పట్టాలుగా, అసైన్డు భూమిగా ఇవ్వాలనుకుంటే ఇప్పుడైనా ఇవ్వవచ్చని..
అలాకాకుండా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలనుకున్నామని అన్నారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన స్పందన కార్యక్రమాన్ని సమీక్షించారు.
ఈ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో సీఎం మాట్లాడారు. సుప్రీంకోర్టులో సానుకూల నిర్ణయం వచ్చి ఆగస్టు15 నాటికి ఇళ్ల పట్టాలు అందిస్తామనే నమ్మకంతో ఉన్నామని సీఎం చెప్పారు.
*ప్రైవేటు భూముల కోసం రూ.7,500 కోట్లు*
ఇళ్ల పట్టాలనిచ్చేందుకు 62వేల ఎకరాలను సేకరించామని, ప్రైవేటు భూముల కొనుగోలుకు రూ.7,500 కోట్లు వెచ్చించామని జగన్ తెలిపారు.
మొత్తం రూ.20వేల కోట్ల విలువైన ఆస్తిని 30 లక్షల కుటుంబాలకు ఇవ్వనున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో 3.5 లక్షల ఇళ్లు మాత్రమే కట్టారని, రూ.1300 కోట్ల బకాయిలు పెట్టారని అన్నారు.
‘పట్టణ గృహనిర్మాణంలో 7 లక్షల ఇళ్లు కట్టాలనుకున్నారట.. అందులోనూ 3 లక్షల ఇళ్లే కట్టారట. అవీ సగంలోనే ఆగిపోయాయి.
రూ.3000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది’ అని పేర్కొన్నారు. ఇప్పుడు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తూ అందులో 15 లక్షల మందికి ఇళ్ల నిర్మాణం నెలలోనే ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. లేఅవుట్లలో మొక్కలను నాటించాలని, ఇళ్ల స్థలాల పట్టాల డాక్యుమెంట్లలో ఫొటోలు, ప్లాట్ల నెంబర్ల నమోదుతోపాటు సరిహద్దులు స్పష్టంగా పేర్కొనాలని, అవన్నీ సిద్ధంగా ఉంటేనే రిజిస్ట్రేషన్ సులభమవుతుందని వివరించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి రూ.2వేల కోట్లు పెండింగు బిల్లులు ఈ నెలలో చెల్లించేద్దామన్నారు. ఎవరికైనా అర్హత ఉండి ఇంటి స్థలం రాకపోతే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లో రేషన్ కార్డు, పింఛను కార్డు, 90 రోజుల్లో ఇంటి స్థలం ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని అన్నారు.
*అవసరమైన ఇసుక నిల్వ చేయాలి* ఇప్పటికే వర్షాలు కురుస్తున్నందున వచ్చే వారం, పది రోజులకు కావాల్సిన ఇసుకను నిల్వ చేసేలా జేసీలు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారు.
సాగునీటి ప్రాజెక్టులు, నాడు-నేడు పనులకు ఇసుక కొరత ఉండకూడదని అన్నారు.
కరోనా సమయంలోనూ ఉపాధి హామీ పనులు భేషుగ్గా జరుగుతున్నాయని కలెక్టర్లను అభినందించారు. కరోనా చికిత్స కేంద్రాల్లో పడకలు, వైద్యం, ఆహారం, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా చూడాలని, ప్రజల్లోని భయాందోళనలు పోగొట్టాలని సూచించారు.
రోజుకు 2,3 కరోనా పరీక్షలు చేసేందుకు ఇబ్బందిపడ్డ రోజుల నుంచి ఇప్పుడు 22 వేల నుంచి 25వేల వరకు కరోనా పరీక్షలు చేయగలిగే స్థాయికి వచ్చామని అన్నారు. 85శాతం కేసులు ఇంట్లోనే నయమవుతున్నాయని వివరించారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.