*భూముల రీ-సర్వేకు నోటిఫికేషన్‌ జారీ

Spread the love

*భూముల రీ-సర్వేకు నోటిఫికేషన్‌ జారీ* *ఈ నెల 21న ప్రారంభించనున్న సీఎం జగన్‌*

అమరావతి: రాష్ట్రంలో భూములను రీ-సర్వే చేసేందుకు వీలుగా రాష్ట్ర సర్వే శాఖ నోటిఫికేషన్‌ జారీచేసింది. దీనిని అనుసరించి జిల్లాల కలెక్టర్లు రీ-సర్వే జరిగే గ్రామాల్లో నోటిఫికేషన్‌ ఇస్తారు. తేదీల వారీగా ఏయే గ్రామాల్లో సర్వే జరుగుతుందన్నది  ప్రకటిస్తారు. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ఈ నెల 21న కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్లపాడు, రామచంద్రునిపేటలో లాంఛనంగా ప్రారంభిస్తారు. తొలి విడత కింద ఎంపిక చేసిన జిల్లాలు, గ్రామాల్లో నోటిఫికేషన్లను వెంటనే జారీచేయనున్నారు.

భూమి రికార్డుల స్వచ్ఛీకరణ పూర్తైన గ్రామాల్లో ఈ రీ-సర్వే జరగనుంది. తొలి విడతలో 5,000, మలివిడతలో 6,500, మూడో విడతలో 5,500 గ్రామాల్లో నిర్వహిస్తారు.

*ప్రయోగాత్మక రీ-సర్వేతో పెరిగిన సర్వే నెంబర్లు!*

కృష్ణా జిల్లా జగయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో నోటిఫికేషన్‌లు జారీచేసి రీ-సర్వే చేపట్టారు. ఈ గ్రామంలో గతంలో 150 సర్వే నెంబర్లు ఉండగా రీ-సర్వే తరవాత వీటి సంఖ్య 640కి చేరింది. మొదటి నుంచి వస్తున్న సర్వే నెంబర్లకు అనుబంధంగా మ్యూటేషన్‌ చేయించుకున్న రైతులు 1, 2 లేదా ఎ లేదా బీ పేర్లతో పట్టాలు పొందారు. దీనివల్ల సర్వే నెంబర్లు పెరిగాయి.

ఈ గ్రామంలో 157 ల్యాండ్‌ పార్సిళ్ళలో సర్వే చేస్తే 112 సర్వే నెంబర్ల మధ్య అంగీకారం కుదిరింది. మిగిలిన ల్యాండ్‌ పార్శిళ్లపై సంబంధితుల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రీ-సర్వేలో తమ వద్ద ఉన్న భూమి కంటే తక్కువ చూపిస్తున్నారన్న ఉద్దేశంతో వాటి యజమానులు అంగీకారం తెలిపేందుకు నిరాకరిస్తున్నారు.

*ఫీల్డ్‌ మ్యాపులు, గ్రామ పటాలు సిద్ధం!* రీ-సర్వేకు అనుగుణంగా గ్రామాల్లో ఫీల్డ్‌ మ్యాపులు, గ్రామ పటాలు సిద్ధం చేస్తున్నారు. భూముల రీ-సర్వేను కార్స్‌ ద్వారా, డ్రోన్ల సాయంతో చేపట్టనున్నారు. విజయవాడ, పెడన, జగ్గయ్యపేట, తిరువూరు, పెదవేగి(ప.గో.జిల్లా)ల్లో బేస్‌స్టేషన్లు ఏర్పాటుచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 బేస్‌స్టేషన్లను వచ్చేనెల 15వ తేదీ నాటికి ఏర్పాటుచేయాలని సర్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెల 14 నుంచి 19వ తేదీల మధ్య గ్రామ సభలను నిర్వహించి స్థానికులకు భూముల రీ-సర్వేపై అవగాహన కల్పిస్తారు. 2,000మంది పంచాయతీ కార్యదర్శులు, 4,500 మంది వీఆర్వోలు, 9,500 మంది గ్రామ సర్వేయర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

*650 మొబైల్‌ మేజిస్ట్రేట్‌ బృందాల ఏర్పాటు*

రీ-సర్వే నిర్వహణకు రాష్ట్రంలో 650 మొబైల్‌ మేజిస్ట్రేట్‌ బృందాలు ఏర్పడనున్నాయి. తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే లేదా మండల సర్వేయర్‌  బృందంలో సభ్యులుగా ఉంటారు. రీ-సర్వేలో వచ్చే సమస్యలను ప్రాథమికంగా ఈ బృందాలు పరిష్కరించాల్సి ఉంటుంది. సరిహద్దు రాళ్ల పంపిణీని ఫిబ్రవరి 15నాటికి పూర్తి చేయనుంది.

*స్థూలంగా… రాష్ట్రంలో రీసర్వే ఇలా!* * 1.26 లక్షల చ.కి.మీ. మేర సర్వే జరగుతుంది. ఇందులో గ్రామ కంఠాల భూములతోసహా వ్యవసాయ, పట్టణ ప్రాంతాల భూములు ఉన్నాయి.

* 90 లక్షల మంది భూ యజమానుల వద్ద 2.26 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి.

* 2023 జనవరి నాటికి 17,640 గ్రామాల్లో దశల వారీగా సర్వే పూర్తిచేస్తారు.

* 47,861 గ్రామీణ నివాస ప్రాంతాల్లో 85 లక్షల ఆస్తులు ఉన్నాయి.

* 3,345.93 చ.కి.మీ. పరిధిలో విస్తరించి ఉన్న పట్టణాల్లో 10లక్షల ఖాళీ స్థలాలు, 40 లక్షల ఇళ్లు ఉన్నాయి. వీటిలో 1.5 కోట్ల జనాభా ఉన్నారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading