2020-21 రుణ లక్ష్యం రూ.2.51 లక్షల కోట్లు

Spread the love

*వ్యవసాయానికి రూ.1.29 లక్షల కోట్లు* *కౌలు రైతులకు రూ.6,500 కోట్ల పంటరుణం*

*2020-21 రుణ లక్ష్యం రూ.2.51 లక్షల కోట్లు*

*బ్యాంకర్ల సమితి సమావేశంలో రుణ ప్రణాళికను ఆవిష్కరించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్‌*

అమరావతి: వ్యవసాయ రంగానికి ఈ ఏడాది రూ.1.29 లక్షల కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో కౌలు రైతులకు రూ.6,500 కోట్లు పంటరుణంగా ఇవ్వాలని నిర్దేశించారు. గతేడాదితో పోలిస్తే సాగుకు రుణ లక్ష్యం 11.90% పెంచారు. పాడి పరిశ్రమాభివృద్ధికి, వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట వేయబోతున్నారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకూ 10% మేర కేటాయింపులు పెరిగాయి. 2019-20 రుణ ప్రణాళిక కేటాయింపులతో పోలిస్తే.. విద్యకు 30.48%, గృహనిర్మాణానికి 9.90%, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు 12.97% చొప్పున తగ్గించారు. బుధవారం రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో.. 2020-21 రుణ ప్రణాళికను సీఎం జగన్‌ విడుదల చేశారు. వివిధ రంగాలకు మొత్తం రూ.2.51 లక్షల కోట్ల (2019-20 కంటే 9.78% అధికంగా) రుణాలివ్వాలని ప్రణాళికలో ప్రతిపాదించారు. గతేడాది కంటే ప్రాధాన్య రంగానికి 10.88%, ప్రాధాన్యేతర రంగాలకు 6.75% అధికంగా రుణ లక్ష్యాలను నిర్దేశించారు. 2019-20 రుణ లక్ష్యంలో 99.42% సాధించామని బ్యాంకర్లు ఈ సందర్భంగా వివరించారు.

సమావేశంలో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈడీ దినేశ్‌ కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ వి.బ్రహ్మానందరెడ్డి, నాబార్డు సీజీఎం సుధీర్‌కుమార్‌, ఎస్‌ఎల్‌బీసీ సీజీఎం కె.అజయ్‌పాల్‌ తదితరులు పాల్గొన్నారు.

* వ్యవసాయ రంగంలో పాడి పరిశ్రమకు రూ.6,820 కోట్లు రుణ లక్ష్యంగా ప్రతిపాదించారు. యాంత్రీకరణకు రూ.3,400 కోట్లు, ఉద్యాన పంటలకు రూ.1,837 కోట్లు, అటవీ, బంజరుభూముల అభివృద్ధికి రూ.724 కోట్లు, కోళ్ల పరిశ్రమకు రూ.1,860 కోట్లు, గొర్రెలు, మేకలు, పందుల పెంపకానికి రూ.1,335 కోట్లు, మత్స్యరంగానికి రూ.1,747 కోట్లు, చిన్న నీటిపారుదలకు 1,947 కోట్లు రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించారు.

* విద్యకు రూ.1,901 కోట్లు, గృహ నిర్మాణానికి రూ.9,710 కోట్లు, సామాజిక మౌలిక వసతులకు రూ.410 కోట్లు, పునరుత్పాదక ఇంధన వనరులకు రూ.454 కోట్లు, ఇతర అవసరాలకు రూ.5,905 కోట్లు కేటాయించారు.

* సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటుకు రూ.18,674 కోట్లు, చిన్న పరిశ్రమలకు రూ.14,559 కోట్లు, మధ్య తరహా పరిశ్రమలకు రూ.6,367 కోట్లు రుణాలుగా ఇవ్వనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *