Teluguwonders:
ఏదైనా రాజకీయ పార్టీ నడవాలంటే దానికొచ్చే విరాళాలతోనే ఆర్ధికంగా ముందుకెళుతుంది. పార్టీ కార్యకర్తలు, నేతలు విరాళాలు ఇస్తూ పార్టీని నడిపిస్తారు. పేరున్న అన్నీ రాజకీయ పార్టీలకి విరాళాలు ఎక్కువ స్థాయిలోనే వస్తుంటాయి. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి 2018-19లో విరాళాలు బాగానే వచ్చాయి. ఆ ఒక్క సంవత్సరంలోనే టీడీపీకి 26.17 కోట్లు విరాళాలు వచ్చాయి. ఈ మేరకు వివరాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్.నర్సిరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి అందించారు.అలాగే గత ఆర్థిక సంవత్సరంలో రూ.20 వేలకు మించి విరాళంగా అందించిన వారి వివరాలతో కూడిన నివేదికను కూడా ఇచ్చారు. ఇక 26.17 కోట్లలో అత్యధికంగా రూ.25 కోట్లు ఫ్రూడెంట్ ఎన్నికల ట్రస్టు విరాళంగా ఇచ్చింది. అలాగే ప్రస్తుతం వైసీపీ ఎంపీలుగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి రూ.25 లక్షలు, రఘురామ కృష్ణంరాజు రూ.20 లక్షలు టీడీపీలో ఉన్నప్పుడు విరాళంగా ఇచ్చారు.
అటు టీడీపీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే బూర్గుపల్లి శేషారావు, సీనియర్ నేత వేగేశన నరేంద్రవర్మ రాజు రూ.5 లక్షలు చొప్పున ఇచ్చారని నివేదికలో చెప్పారు.అంతకముందు టీడీపీలో ఉన్న ప్రస్తుత వైసీపీ నాయకురాలు షేక్ నూర్‌జాన్ (ఏలూరు తాజా మాజీ మేయర్) రూ.4.20 లక్షలు ఇచ్చారు. టీడీపీ నేతలు కొండూరు అశోక రాజు, దేవినేని అవినాశ్ రూ.3 లక్షలు చొప్పున ఇచ్చారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే యామినీబాల, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, ప్రస్తుత వైసీపీ నేత బుట్టా రేణుకకు చెందిన బుట్టా ఫౌండేషన్ రూ.1 లక్ష చొప్పున విరాళం ఇచ్చారు. మొత్తం మీద 56 మంది రూ.20 వేలకుపైగా విరాళం ఇచ్చిన వారిలో ఉన్నారు.అయితే ఎన్నికల సంఘం టీడీపీతో పాటు మరో నాలుగు పార్టీలకి చెందిన విరాళాల వివరాలని మాత్రమే ప్రకటించింది. మిగిలిన నాలుగు పార్టీల్లో తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే 2018-19లో ఒక్క రూపాయి కూడా విరాళం తీసుకోలేదు. శిరోమణి అకాలీదళ్ రూ.1.75 కోట్లు, ఐఎన్ఎల్‌డీ రూ.1.75 కోట్లు, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన రూ.79 లక్షలు విరాళాలు తీసుకుంది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.