నేడు శ్రీకాకుళంలో జగన్ పర్యటన..

Jagan tour in Srikakulam today
Spread the love

Teluguwonders:

ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తొలిసారిగా శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. మూడు నియోజకవర్గాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఇచ్చిన హామీలను నేరవేర్చే క్రమంలో పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. పలాస, శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజకవర్గాల్లో నిర్వహించే పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు.

👉పలాసలో తొలుత అడుగుపెట్టనున్న సీఎం, ఇప్పటికే ఆ ప్రాంత వాసులకు ఇచ్చిన హామీల పరిష్కారానికి జీవోలను విడుదల చేశారు. పలాసలో 200 పడకల సూపర్‌స్పెషాల్టీ కిడ్నీ హాస్పిటల్, రిసెర్చ్ సెంటర్, డయాలసిస్‌ కేంద్రాల ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందు కోసం రూ.50 కోట్ల నిధులను కూడా మంజూరుచేశారు. మంచినీళ్లపేటలో జెట్టీ నిర్మాణానికి రూ.11.95 కోట్లతో అనుమతులు ఇచ్చారు. డయాలసిస్‌ చేయించుకుంటున్న వారికి నెలకు రూ.10వేల వంతున పింఛను మంజూరు చేసి ఆర్థిక చేయూత అందిస్తున్నారు.

💥పలు అభివృద్ది పథకాలకు శంకుస్థాపన :

పలాస– కాశీబుగ్గలో పలు అభివృద్ది పథకాలకు శంకుస్థాపన చేసి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడ నుంచి ఎచ్చెర్లలో ట్రిపుల్‌ ఐటీలోని పలు భవనాలను ప్రారంభించనున్నారు. అనంతరం శ్రీకాకుళం రూరల్‌ సింగుపురం వద్ద గల అక్షయ పాత్ర వంటశాలను ప్రారంభిస్తారు.
ముఖ్యమంత్రి జగన్ గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఉదయం 9.30 గంటలకు బయలుదేరి 10.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో 11 గంటలకు కాశీబుగ్గ చేరుకోనున్నారు. ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు, వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట వద్ద గల ఫిషింగ్‌ జెట్టీ నిర్మాణానికి, పలాసలో 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రి, రిసెర్చి సెంటర్‌ భవనాల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. సన్న బియ్యాన్ని ఇంటింటికీ సరఫరా చేసే పథకాన్ని కూడా సీఎం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు హెలికాప్టర్‌లో ఎచ్చెర్ల ఏఆర్‌ పోలీస్‌ గ్రౌండ్‌కి చేరుకుంటారు. ఎస్‌ఎంపురం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌కు చేరుకుని భవనాలను ప్రారంభించనున్నారు.

అకడమిక్, హస్టల్ బ్లాక్‌ను ప్రారంభించి, విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం రోడ్డు మార్గంలో శ్రీకాకుళం మండలంలోని సింగుపురం వద్ద గల అక్షయపాత్ర వంట కేంద్రానికి బయిలుదేరుతారు. 3.55 నుంచి 4.30 గంటల వరకు సింగుపురంలోని అక్షయపాత్ర సెంట్రల్‌ కిచెన్‌ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.

💥 ముఖ్యమంత్రి నిర్ణయం కోసం సిక్కోలు ప్రజల ఎదురుచూపు :

పాదయాత్ర సమయంలో జగన్ ఇచ్చిన హామీలను సిక్కోలు వాసులు గుర్తుచేసుకుంటున్నారు. ముఖ్యంగా వంశధార నిర్వాసితులకు 2013 ఆర్‌.ఆర్‌.చట్టం అమలు చేస్తానని జగన్‌ మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. భూమి లేని పేదలకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. దీంతో ఆ ప్రాంతంలోని వేలాది మంది ముఖ్యమంత్రి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే, ఆముదాలవలస షుగర్ ఫ్యాకర్టీని తిరిగి తెరిపిస్తామని చెప్పారు. మడ్డువలస రెండో దశ విస్తరణ పనులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తోటపల్లి ఎడమ కాలువను ఆధునికీకరించడంతోపాటు పిల్ల కాలువలనూ ఆధునికీకరిస్తానని వీరఘట్టంలో రైతులకు హామీ ఇచ్చారు. పైడిభీమవరంలో స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని ఏర్పాటుచేసి యువతకు శిక్షణ ఇచ్చి, స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. వీటితోపాటు పలు హామీలను జగన్ ఇచ్చారని, వాటి గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని ఆశగా చూస్తున్నారు.

👉ఈ సాయంత్రం విజయవాడకు :

సాయంత్రం 4.30కు తిరిగి ఎచ్చెర్లఏఆర్‌ పోలీస్‌ క్వార్టర్సు గ్రౌండ్‌కు చేరుకుని హెలికాప్టర్‌లో విశాఖపట్నం తిరుగుపయనమవుతారు. అక్కడి నుంచి విమానంలో విజయవాడ వెళతారు.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading