ఆంధ్రప్రదేశ్ రైతులకు జగన్ ప్రభుత్వం సోమవారం గుడ్ న్యూస్ చెప్పింది. రైతు భరోసా కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. ఇదివరకు పెట్టుబడి సాయంగా కేంద్రం రూ.6,000కు తోడు ఏపీ ప్రభుత్వం రూ.6500 కలిపి మొత్తం రూ.12,500 ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పుడు మరో రూ.1,000 అదనంగా ఇవ్వనున్నారు. దీంతో రైతుకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.13,500 కానుంది. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో అమలు అందిస్తారు. రైతుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా పథకాన్ని అక్టోబర్ 15న (నేడు) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కాకుటూరులో ముఖ్యమంత్రి జగన్ ప్రారంభిస్తారు. 15వ తేదీ ఉదయం గం.10.30లకు విక్రమసింహపురి యూనివర్సిటీకి చేరుకుంటారు. అనంతరం కౌలు రైతులకు కార్డులను పంపిణీ చేస్తారు. రైతు భరోసా కింద వ్యవసాయ పెట్టుబడి సాయంగా చెక్కులు పంపిణీ చేస్తారు.
రూ.13,500… ఎప్పుడెప్పుడు ఎంత ఇస్తారంటే?
రైతు భరోసా పథకానికి రూ.5,510 కోట్లను విడుదల చేస్తూ ఇప్పటికే ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ఆయా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. రైతు భరోసా డబ్బులను బ్యాంకులు పాత బకాయిలు లేదా ఇతర బకాయిల కింద జమ చేసుకోవడానికి వీల్లేదు. రైతు భరోసా కింద ఏడాదికి రూ.13,500 ఇస్తారు. ఇందులో రూ.7,500 మే నెలలో ఇస్తారు. రబీలో రూ.4,000, సంక్రాంతికి రూ.2,000 రైతుల అకౌంట్లలో జమ చేస్తారు.
రైతు భరోసా నాలుగేళ్ల నుంచి ఐదేళ్లకు పెంపు..
రైతులకు, కౌలు రైతులకు నాలుగేళ్ల పాటు.. ఏడాదికి రూ.12,500 ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తొలుత నిర్ణయించింది. అయితే ఇప్పుడు ఏడాదికి రూ.13,500తో పాటు మరో గుడ్ న్యూస్ చెప్పింది. నాలుగేళ్లకు బదులు అయిదేళ్ల పాటు దీనిని ఇవ్వనున్నట్లు చెప్పింది.
నేతల్లో రైతు భరోసాకు అర్హులు..
అర్హులు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చే రూ.6,000కు తోడు ఏపీ ప్రభుత్వం రూ.7,500 జత చేసి రైతు భరోసాను ఇస్తుంది. అయితే ఈ రైతు భరోసా పొందేందుకు కొంతమంది అనర్హులు. వారిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలకు రైతు భరోసా వర్తించదు. అదే సమయంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు అర్హులు. పిల్లలు ఉద్యోగులుగా ఉండి వ్యవసాయం చేస్తున్న తల్లిదండ్రులు కూడా రైతు భరోసాకు అర్హులు.
రైతుకు పెరగనున్న భరోసా..
రైతులకు రూ.1,000 అదనంగా పెంచడంతో పాటు నాలుగేళ్ల నుంచి అయిదేళ్లకు పెంచిన నేపథ్యంలో రైతు భరోసా పొందే వారికి అయిదేళ్లలో రూ.50,000కు బదులు రూ.67,500 లబ్ధి చేకూరనుంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ కంటే రూ.17,500 మొత్తాన్ని ఎక్కువగా ఇస్తోంది. అయితే ఇందులో కేంద్రం సహకారం కూడా ఉంది.