ఏడాది లో కోటి రూపాయిల సంపాదన. వినేందుకే నోరు ఊరిపోయే మాట. అలాంటిది ఏడాదిలో ఏకంగా రూ.25 కోట్ల సంపాదన. ఏం వ్యాపారం చేస్తే వస్తుందన్న మాటకు.. వ్యవసాయం అంటే మీరు నమ్ముతారా? నో అంటే నో అనేస్తారు. ఇలాంటి మాటలు అయితే గియితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి రావొచ్చేమో కానీ.. ప్రాక్టికల్ గా మాత్రం సాధ్యం కాదని కొట్టేయటం ఖాయం. అప్పట్లో తాము ఎకరానికి కోటి రూపాయిల వరకూ సంపాదిస్తున్నట్లు గా చెప్పి సీఎం కేసీఆర్ మాటలు సంచలనంగా మారాయి. అయితే.. ప్రణాళికబద్ధంగా వ్యవహరించటంతో పాటు.. వ్యూహాత్మకంగా పని చేయాలే కానీ.. ఇదేమీ అసాధ్యం కాదని చెబుతున్నారు. అంతకూ నమ్మక పోతే.. లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి తాజాగా ప్రస్తావిస్తున్నారు.
గుజరాత్ కు చెందిన ఒక కుటుంబం కేవలం బంగాళ దుంపల్ని పండిస్తూ.. ఏడాదిలో రూ.25 కోట్లు సంపాదించిన వైనం ఇప్పుడు సంచలనంగానే కాదు.. హాట్ టాపిక్ గా మారింది. వ్యవసాయం తో అన్నేసి కోట్లు సాధిస్తున్న వారెవరు? వారెక్కడ ఉంటారు? ఇంతకూ అంత భారీ మొత్తాన్ని వారెలా సంపాదిస్తున్నారు? లాంటి ప్రశ్నలకు సమాధానం వెతికితే ఆసక్తికర విషయాలు బయటకు వస్తాయి. గుజరాత్ కు చెందిన అరవల్లి జిల్లా దోల్ పూర్ కంపాకు చెందిన జితేష్ పటేల్ అనే రైతు బంగాళ దుంపల్ని పండిస్తుంటాడు. దేశంలోని రైతులకు ఆదర్శంగా ఆయన నిలుస్తుంటారు. ఆయన కుటుంబం గడిచిన పాతికేళ్లుగా బంగాళదుంపల్ని పండిస్తుంటారు.
తాజాగా గ్లోబల్ పొటాలో కాంక్లేవ్ 2020లో పాల్గొన్న జితీశ్ మీడియాతో మాట్లాడుతూ.. షాకింగ్ నిజాల్ని చెప్పుకొచ్చారు. ఎమ్మెసీ అగ్రికల్చర్ చదివానని.. కోర్సులో నేర్చుకున్న మెళుకువలను తాను పంట పండించేందుకు ఉపయోగించానని చెప్పారు. 2007లో తాము 10 ఎకరాల్లో ఎల్ ఆర్ బంగాళాదుంప పంటను పండిచటం స్టార్ట్ చేసి ప్రస్తుతం వెయ్యి ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నట్లు చెప్పారు.
ఎల్ ఆర్ రకానికి చెందిన ప్రత్యేక బంగాళాదుంప తయారీదారులకు విపరీతమైన డిమాండ్ ఉందన్న ఆయన..ఈ రకం ఆలూను ఇండోనేషియా.. కువైట్.. ఒమన్.. సౌదీ ఆరేబియా తదితర దేశాలు కొనుగోళ్లు చేస్తున్నాయని చెప్పారు. తాము పండించిన బంగాళదుంపల్ని ప్రముఖ కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయని చెప్పారు. తమ కుటుంబంలో పాథాలజీ.. మైక్రోబయాలజీ.. హార్టికల్చర్ తదితర రంగాల్లో నైపుణ్యం ఉందని.. తామంతా కలిసి వ్యవసాయం చేస్తూ ఇంత భారీ మొత్తాన్ని సంపాదిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు అర్థమైందా? బంగాళ దుంపలు పండించి కూడా ఏడాదికి పాతిక కోట్ల వరకూ సంపాదించొచ్చని.
Source:https://www.tupaki.com/politicalnews/article/Rs-25-crores-In-a-year-the-family-earned-with-an-Potato-crop/235840