*ఆమె అగుపించట్లేదు*
*భారత్‌లో 4.5 కోట్ల మంది మహిళల ఆచూకీ లేదు*
*ప్రపంచవ్యాప్తంగా 14.26 కోట్లు*
*లింగ వివక్ష కారణం: ఐక్యరాజ్యసమితి* ఐక్యరాజ్యసమితి: లింగ వివక్ష, భ్రూణహత్యల కారణంగా గత యాభై ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 14.26 కోట్ల మంది మహిళలు జనాభా లెక్కల్లోంచి అదృశ్యమయ్యారని.. అందులో భారత్ నుంచే 4.58 కోట్ల మంది ఉన్నారని ఐక్యరాజ్య సమితి మంగళవారం విడుదల చేసిన ప్రపంచ జనాభా నివేదిక-2020 పేర్కొంది. ఈ విషయంలో చైనా అగ్రస్థానంలో ఉంది. ఆ దేశంలో 7.23 కోట్ల మంది మహిళలు మాయమయ్యారు. ఈ అదృశ్యమైన మహిళంతా భ్రూణహత్యలకు, లింగ వివక్షకు గురై జనాభాల లెక్కల్లో లేకుండా పోయారని నివేదిక తెలిపింది. ‘‘2013 నుంచి 2017 మధ్య కాలంలో పుట్టిన సమయంలోనే 4 లక్షల 60 వేలమంది ఆడపిల్లలు మాయమయ్యారు.. అందులో మూడొంతుల మంది లింగ వివక్ష కారణంగానే అదృశ్యమయ్యారు. మిగతావారు ప్రసవ సమయంలో చనిపోయారు’’ అని నివేదిక తెలిపింది. 2014లో లాన్సెట్ గ్లోబల్ హెల్త్ నివేదికను ఐక్యరాజ్యసమితి ఈ సందర్భంగా ఉటంకించింది.
ఆ నివేదిక ప్రకారం.. భారత్‌లో భ్రూణహత్యల రేటు విపరీతంగా ఉంది. పుట్టిన ప్రతి వెయ్యిమంది ఆడపిల్లల్లో 13.5 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రసవానికి ముందో.. తర్వాతో వీరంతా జనాభా లెక్కల్లోంచి మాయమవుతున్నారు. భారత్ అమలు పరుస్తున్న ‘అప్నీ బేటీ- అప్నా ధన్’ కార్యక్రమాన్ని నివేదిక ప్రశంసించింది. ఇలాంటి కార్యక్రమాలు భ్రూణహత్యలకు అడ్డుకట్ట వేస్తాయని అభిప్రాయపడింది. *వివాహవ్యవస్థపైనా ప్రభావం*
నివేదిక ప్రకారం.. మహిళా శిశు మరణాలు భవిష్యత్తులో వివాహ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. జోడీ దొరకక చాలా మంది పురుషుల వివాహాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లోని యువకులు దీని ప్రభావానికి ఎక్కువ లోనవుతారు. బాల్య వివాహాలు పెరిగిపోతాయి. స్త్రీ-పురుషుల జనాభా అంతరం 2055కి ఉచ్ఛస్థాయికి చేరుకుంటుందని… 50 ఏళ్ల వరకు ఒంటరిగా ఉండే పురుషుల సంఖ్య జనాభాలో పది శాతం ఉంటుందని నివేదిక అంచనా వేసింది. మహిళలపై వివక్ష పోవాలంటే..
బాల్య వివాహాలు, భ్రూణహత్యలు నివారించాలంటే.. మహిళలు వీలైనంత ఎక్కువ సమయాన్ని పాఠశాలలో గడిపేలా చూడాలని…వారికి జీవన నైపుణ్యాలని నేర్పించాలని నివేదికలో నిపుణులు సూచించారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.