*నవంబరు వరకు ఉచిత రేషన్* *జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ వెల్లడి*
*అన్‌లాక్-1 నుంచి ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగిందని ఆవేదన*
దిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని దేశంలోని 80 కోట్ల మంది నిరుపేదలకు నవంబరు నెలాఖరు వరకు ఉచితంగా ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. దీనికోసం కేంద్రం రూ.90,000 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు వెల్లడించారు.
గత మూడు నెలలుగా ఉచిత రేషన్‌పై చేసిన వ్యయాన్ని కలిపితే పేదల ఆహార భద్రత కోసం తమ ప్రభుత్వం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లవుతుందని స్పష్టంచేశారు.
రాబోయే పండగ రోజుల్లో దేశంలోని ఏ నిరుపేదా ఖాళీ కడుపుతో ఉండరాదన్న ఉద్దేశంతో ఈ మహత్తర నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రకటన చేశారు.
*చేతులు కలిపాం… పేదల ఆకలి తీర్చాం…*
‘‘లాక్‌డౌన్ సమయంలో పేదల ఆకలి తీర్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు పౌర సమాజంలోని వివిధ వర్గాలు చేయూతనివ్వడంవల్ల పేదల ఇంట్లో పొయ్యి వెలగని పరిస్థితి రాలేదు. దేశమైనా, వ్యక్తి అయినా తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే సంక్షోభాలను ఎదుర్కొనే శక్తి అనేక రెట్లు పెరుగుతుంది.
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా మూడు నెలల్లో 20 లక్షల మంది నిరుపేదలు, 9 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశాం. ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ ద్వారా 3 నెలలపాటు 80 కోట్ల మందికి ఉచిత రేషన్‌ను పంపిణీ చేసి భారత ప్రభుత్వం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది.
ఆ పథకాన్ని మరో ఐదు నెలలపాటు పెంచుతున్నాం. వర్షాకాలం తర్వాత వ్యవసాయ రంగంలో పనులు పెరిగి, మిగతా రంగాల్లో తగ్గుముఖం పడతాయి. దీనికితోడు రాబోయేది పండగల సీజన్. పేదలకు ఆహారధాన్యాలు ఉచితంగా అందించే పథకం మరో ఐదు నెలలు కొనసాగుతుంది.
దీనిద్వారా ప్రతి ఒక్కరికీ నెలకు 5 కేజీల బియ్యం, కుటుంబానికి కిలో చొప్పున కందిపప్పు అందిస్తాం’’ అని ప్రధానమంత్రి ప్రకటించారు. ‘ఒకే దేశం- ఒకే రేషన్‌కార్డు’ పద్ధతి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
*రైతులు, పన్ను చెల్లింపుదారులకు ధన్యవాదాలు*
పేదలకు ఈరోజు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించడం రైతులు, పన్ను చెల్లింపుదారుల ద్వారానే సాధ్యమైందని మోదీ చెప్పారు.
రైతులు కష్టించి పంటలు పండించి ధాన్యాగారాలను, పన్ను చెల్లింపుదారులు బాధ్యతాయుతంగా పన్నులు చెల్లించి ఖజానాను నింపడం వల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోగలిగిందని చెప్పారు. వారిద్దరి చేయూతవల్లే పేదలు ఇంతటి సంక్షోభాన్ని ఎదిరించి పోరాడగలుగుతున్నారన్నారు. స్థానిక వస్తువుల కోసం గళం వినిపిస్తూ 130 కోట్ల మంది ప్రజలు ఇదే సంకల్పంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. *నవంబరు వరకు ఉచిత రేషన్* నిబంధనలపై కఠినంగా వ్యహరించాలి లాక్‌డౌన్ సమయంలో నియమ నిబంధనలు పాటించిన ప్రజల్లో అన్‌లాక్-1 తర్వాత నిర్లక్ష్యం పెరిగిందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు.
మరింత జాగ్రత్తగా ఉండాల్సిన తరుణంలో ఇది ఏమాత్రం మంచిది కాదని హెచ్చరించారు. ‘‘కరోనాపై పోరాడుతూ బుధవారం నుంచి అన్‌లాక్-2లో ప్రవేశిస్తున్నాం. దగ్గు, జలుబు, జ్వరాలు ప్రబలే వాతావరణంలోకీ అడుగు పెట్టాం. కరోనా మరణాల విషయంలో ప్రపంచంలోని చాలా దేశాల కంటే భారత్ కొంత మెరుగైన స్థితిలో ఉంది.
సరైన సమయంలో అమలుచేసిన లాక్‌డౌన్, ఇతర నిర్ణయాల వల్ల లక్షల మంది ప్రాణాలు కాపాడగలిగాం. ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, దేశ ప్రజలు మునుపటిలా అప్రమత్తతను పాటించాల్సిన సమయం ఆసన్నమైంది. కంటెయిన్‌మెంట్ జోన్లపై మరింత దృష్టి సారించాల్సి ఉంది.
మాస్క్ ధరించకుండా బహిరంగ ప్రదేశంలోకి వెళ్లిన ఓ దేశ ప్రధానికి అక్కడి అధికారులు రూ.13వేల జరిమానా విధించారు. భారత్‌లోనూ స్థానిక ప్రభుత్వాలు అలాగే కఠినంగా వ్యవహరించాలి. గ్రామ ప్రధాన్ (సర్పంచి) నుంచి దేశ ప్రధాని వరకు ఎవరూ నిబంధనలకు అతీతులేం కాదు’’ అని మోదీ పేర్కొన్నారు.
*వ్యాక్సిన్ తొలుత ఆరోగ్య సిబ్బందికే* దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే దానిని తొలుత ఆరోగ్య సిబ్బందికే అందించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారులకు సూచించారు. వారంతా కరోనాపై ముందుండి పోరాడుతున్నారని గుర్తుచేశారు.
వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ఎవరెవరికి దాన్ని ప్రాధాన్య క్రమంలో అందించాలన్న అంశంపై ఆయన మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. భారత్‌లాంటి అధిక జనాభా ఉన్న దేశంలో విభిన్న అంశాలను పరిగణనలోకి తీసుకొని వ్యాక్సిన్ అందించాలని సూచించారు.
వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా దాన్ని అందరికంటే ఎక్కువ ముప్పు ఉన్న వారికి తొలుత అందించాలని సూచించారు. డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి, వైద్యేతర పోరాట యోధులకు (నాన్‌మెడికల్ ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కి), సాధారణ ప్రజల్లో ఎక్కువ దుర్బల స్థితిలో ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. స్థానికత అనే నిబంధన విధించకుండా ఎవరికి ఎక్కడైనా వ్యాక్సిన్ అందేలా చూడాలని సూచించారు. అది అందుబాటు ధరల్లో అందరికీ అందేలా ఉండాలన్నారు.
వ్యాక్సిన్ ఉత్పత్తి నుంచి అది అందరికీ సరైన సమయంలో అందించడానికి అనువైన సాంకేతిక పరిజ్ఞానం గురించి ఆలోచించాలని నిర్దేశించారు. విస్తృత స్థాయిలో వ్యాక్సినేషన్ చేపట్టడానికి అనువైన సవివర ప్రణాళికను తక్షణం రూపొందించాలని ఆదేశించారు.
*తెలుగు సహా వేర్వేరు భాషల్లోకి అనువాదం* ప్రధాని ప్రసంగాన్ని వివిధ భాషల్లోకి అనువదించారు. తెలుగు, బెంగాలీ, మరాఠీ, పంజాబీ, గుజరాతీ, కశ్మీరీ, అస్సామీ, భోజ్‌పురీ, లద్దాఖీ భాషల్లోకి అనువదించిన ప్రసంగం యూట్యూబ్ లింకులను ప్రధాని ట్వీట్ చేశారు. ముఖ్యాంశాలను దూరదర్శన్ ప్రాంతీయ ఛానళ్లు కూడా వేర్వేరు భాషల్లో ప్రసారం చేశాయి.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.