*ప్రపంచ అగ్రగామి 100 కంపెనీల్లో రిలయన్స్‌

Spread the love

*ప్రపంచ అగ్రగామి 100 కంపెనీల్లో రిలయన్స్‌*

*ఫార్చూన్‌ జాబితాలో 96వ ర్యాంకు కైవసం*

*ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ*

దిల్లీ: ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఫార్చూన్‌ గ్లోబల్‌ 500 జాబితాలో అగ్రగామి 100 కంపెనీల్లోకి చేరింది. మంగళవారం విడుదల చేసిన 2020 ర్యాంకుల్లో కంపెనీ 96వ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. ఫార్చూన్‌ గ్లోబల్‌ 500 జాబితాలో ఏ భారత కంపెనీకైనా ఇదే అత్యుత్తమ ర్యాంకు కావడం గమనార్హం.

* 2012లో రిలయన్స్‌ తొలి సారిగా టాప్‌-100లోకి చేరింది. అపుడు కంపెనీ 99వ ర్యాంకు సాధించింది. అయితే 2016 నాటికి 215 స్థానానికి పరిమితమైంది. అప్పటి నుంచి ర్యాంకును మెరుగుపరచుకుంటూ వచ్చింది. తాజాగా 8620 కోట్ల డాలర్ల (సుమారు రూ.6.46 లక్షల కోట్ల) ఆదాయంతో 96వ స్థానానికి చేరింది.

* ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ) 34 స్థానాలు తగ్గి 151వ ర్యాంకుకు; ఓఎన్‌జీసీ 30 ర్యాంకులు కోల్పోయి 190వ స్థానానికి పరిమితమయ్యాయి.

* ఇక ఎస్‌బీఐ మాత్రం 21 స్థానాలు మెరుగుపరచుకుని 221వ ర్యాంకును సాధించింది.

*రిలయన్స్‌ ఓ2సీలో వాటాపై సాధ్యాసాధ్యాల పరిశీలన: ఆరామ్‌కో
* దిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిఫైనింగ్‌, పెట్రో రసాయనాల వ్యాపారంలో వాటాను 1500 కోట్ల డాలర్లతో కొనుగోలు చేయడానికి సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నట్లు ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారు సౌదీ ఆరామ్‌కో ప్రకటించింది. రిలయన్స్‌కు చెందిన ఆయిల్‌-టు-కెమికల్‌ (ఓ2సీ) వ్యాపారంలో 20 శాతం వాటాను ఆరామ్‌కోకు విక్రయించాలని భావిస్తున్నట్లు గతేడాది ఆగస్టులో ముకేశ్‌ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ‘రిలయన్స్‌ ఒప్పందంపై మాట్లాడాలంటే.. ప్రస్తుతానికి సాధాసాధ్యాలు పరిశీలిస్తున్నామని మాత్రమే చెప్పగలను. అది ఒక పెద్ద ఒప్పందం. కాబట్టి మేం సమీక్షించుకోవడానికి సమయం తీసుకుంటాం. సాధ్యాసాధ్యాల నివేదికను బట్టి ఒప్పందంపై నిర్ణయం తీసుకుంటామ’ని మదుపర్లతో జూన్‌ త్రైమాసిక ఫలితాల సందర్భంగా సౌదీ ఆరామ్‌కో సీఈఓ ఆమిన్‌ నాజర్‌ పేర్కొన్నారు. కరోనా కారణంగా ఒప్పందం ఆలస్యమవుతోందని గత నెలలో జరిగిన ఆర్‌ఐఎల్‌ వార్షిక సమావేశంలో ముకేశ్‌ పేర్కొన్నారు. ఆమిన్‌ కూడా ఈ ఒప్పందంపై ఎటువంటి గడువునూ పేర్కొనలేదు. *ఎవరికి ఏం లాభం:* ఈ ఒప్పందం జరిగితే.. ఆరామ్‌కో తన ముడి చమురును రసాయనాలుగా మార్చే సామర్థ్యం పెంచుకున్నట్లు అవుతుంది. ఆర్‌ఐఎల్‌కు సౌదీ బేసిక్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌ నుంచి సాంకేతిక నైపుణ్యం లభిస్తుంది. దీని వల్ల చమురు తవ్వకం మరింత సులభమవుతుంది.


Discover more from Telugu Wonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from Telugu Wonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading