*ఇంటి అనుమతులకు బేఫికర్..* *టీఎస్-బీపాస్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం* *నెలాఖరు నుంచే అమలు* *అనుమతులన్నీ ఆటోమెటిక్* *నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చివేత* ఈనాడు – హైదరాబాద్: రాష్ట్రంలో నగరాలు, పురపాలక పట్టణాల్లో ఇంటి నిర్మాణ అనుమతులు ఇక నుంచి సులభంగా లభించనున్నాయి. ఇందుకు సంబంధించి టీఎస్-బీపాస్ బిల్లును శాసనసభ సోమవారం ఆమోదించింది. ఈ బిల్లును మంత్రి కేటీఆర్ సభలో ప్రవేశపెట్టారు. నెలాఖరు నుంచి ఈ చట్టాన్ని అమలు చేసేందుకు పురపాలకశాఖ సిద్ధమైంది. పరిశ్రమలకు అనుమతుల కోసం తీసుకువచ్చిన ఏక గవాక్ష విధానం టీస్-ఐపాస్ తరహాలºనే టీఎస్-బీపాస్ ఉంటుంది. కొత్త చట్టం ప్రకారం 75 చదరపు గజాల విస్తీర్ణం, ఏడు మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉండే నివాసాలకు ఎలాంటి అనుమతి అవసరంలేదు. 75 చదరపు గజాల కంటే ఎక్కువ 600 చదరపు గజాల లోపు(500 మీటర్ల కంటే తక్కువ), పదిమీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉండే భవన నిర్మాణాలకు స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతి లభిస్తుంది. 600 చదరపు గజాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే నివాస, నివాసేతర భవనాలకు కొత్త చట్టం ప్రకారం 21 రోజుల్లో అనుమతి వస్తుంది. టీఎస్-ఐపాస్ తరహాలో వివిధ శాఖల నుంచి పొందాల్సిన అనుమతులు, నిరభ్యంతర పత్రాల కోసం దరఖాస్తుదారుడు ఇతర శాఖలను సంప్రదించాల్సిన అవసరంలేదు. ఉమ్మడి దరఖాస్తు దాఖలు చేస్తే అగ్నిమాపక, సాగునీటి శాఖ, రెవెన్యూ, పోలీసు, విమానయాన సంస్థల అనుమతికి దరఖాస్తు ఆటోమెటిక్‌గా వెళ్తుంది. సంబంధిత శాఖలు రిమార్కులను వారం నుంచి 15 రోజుల్లో పంపాలి. ఈ నిబంధన కూడా 600 చ.గ.పైబడిన నిర్మాణాలకే. టీఎస్-బీపాస్ భవన నిర్మాణ అనుమతుల్లో సమయపాలన, నిబంధనలు పాటించేందుకు, శాఖల మధ్య సమన్వయం కోసం టీఎస్-బీపాస్ ఛేజింగ్‌సెల్‌ను ఏర్పాటు చేస్తారు. *టీఎస్-బీపాస్ ప్రత్యేకతలు* * భవననిర్మాణ అనుమతులకు ఏక గవాక్ష విధానం. నిర్దిష్ట సమయంలో అనుమతి * మొబైల్ యాప్, టీఎస్- బీపాస్ వెబ్‌సైట్, మీ సేవా కేంద్రాలు, పట్టణ స్థానిక సంస్థలు, కలెక్టరేట్లలోని పౌరసేవాకేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు * తప్పుడు సమాచార మిచ్చినా… మాస్టర్‌ప్లాన్, జోనింగ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం ఉన్నట్లు గుర్తిస్తే అనుమతి పొందిన 21 రోజుల్లో రద్దు చేయవచ్చు. స్వీయ ధ్రువీకరణ ద్వారా అనుమతి పొందిన 21 రోజుల తర్వాత భవన నిర్మాణ పనులు ప్రారంభించాలి. ఈ 21 రోజుల్లో పరిశీలన పూర్తవుతుంది. జిల్లాల్లో కలెక్టర్ అధ్యక్షతన, జీహెచ్‌ఎంసీలో జోనల్ కమిషనర్ ఆధ్వర్యంలో కమిటీ ఈ పరిశీలన జరుగుతుంది. తప్పులను గుర్తిస్తే అనుమతి రద్దు చేస్తారు. * స్వీయ ధ్రువీకరణతో టీఎస్-బీపాస్ ద్వారా అనుమతులు పొందిన అన్ని భవనాల వివరాలు వెబ్‌సైట్‌లో ఉంటాయి. వీటిపై ఎవరికైనా ఆక్షేపణ ఉంటే 21 రోజులలోపు కమిటీ దృష్టికి తీసుకురావాలి. * ఉల్లంఘనలు గుర్తిస్తే కూల్చివేయడం లేదా మూసివేయడం లేదా జరిమానా విధిస్తారు. * దరఖాస్తు సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ఎటువంటి నోటీసు ఇవ్వకుండా కూల్చివేయవచ్చని దరఖాస్తుదారుడు ప్రకటించాలి. * అనుమతి మంజూరులో జాప్యం జరిగితే సంబంధిత అధికారిపై క్రమశిక్షణ చర్యతో పాటు అవసరమైతే జరిమానా విధిస్తారు. _‘600 గజాలు దాటిన నిర్మాణాలకు 21 రోజుల్లో అనుమతి ఇవ్వకపోతే 22వ రోజు పట్టణ ప్రణాళిక అధికారి, మున్సిపల్ కమిషనర్ రాజముద్రతో అనుమతి వస్తుంది. తెలంగాణ రాష్ట్ర భవన అనుమతి ఆమోదం, స్వీయ ధ్రువీకరణ విధాన (టీఎస్-బీపాస్) చట్టాన్ని తెచ్చేముందు సమీక్షించాం. అందులో 95 శాతం దరఖాస్తులు 600 గజాల లోపు స్థలంలో నిర్మాణాలకు సంబంధించినవే. అంటే ఈ చట్టం వల్ల 95 శాతం మందికి భవన నిర్మాణ తిప్పలుండవు. ఇళ్లు నిర్మించుకోవాలనుకునే వారికి ఆనందాన్నిచ్చే బిల్లు ఇది’ – *కేటీఆర్*_ _తెలంగాణలో పట్టణాలు, నగరాల్లో 61.4 శాతం పైగా భవన నిర్మాణాలు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే జరుగుతున్నాయి. గత మూడేళ్లలో భవన నిర్మాణ అనుమతులను పురపాలకశాఖ విశ్లేషించింది._ *దేశంలో ఎక్కడా ఇలాంటి చట్టం లేదు: మంత్రి కేటీఆర్* ఈనాడు, హైదరాబాద్: గతంలో ఇంటి అనుమతి కోసం దరఖాస్తు చేస్తే అనుమతుల కోసం ఎదురుచూడాల్సి వచ్చేదని.. ఆ ఇబ్బందులను తప్పిస్తూ తెలంగాణ రాష్ట్ర భవన అనుమతి ఆమోదం, స్వీయ ధ్రువీకరణ విధాన(టీఎస్-బీపాస్) బిల్లును శాసనసభలో ప్రవేశపెడుతున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. దేశంలో ఎక్కడా ఇలాంటి చట్టం లేదన్నారు. బిల్లును సోమవారం సభలో ప్రవేశపెట్టి ఆయన మాట్లాడారు. ప్రభుత్వ స్థలాలు, చెరువుల్లో కడితే మాత్రం నోటీసు లేకుండా కూల్చివేసేలా బిల్లులో నిబంధన పెట్టామన్నారు. 21 రోజల నిబంధన అన్నందున ఏమైనా లోపాలుంటే 10 రోజులలోపు తెలపాలన్న నిబంధన కూడా ఉందని తెలిపారు. జిల్లాల్లో కలెక్టర్ ఛైర్మన్‌గా పర్యవేక్షణ విభాగాలను పెడుతున్నామని, జీహెచ్‌ఎంసీలో మాత్రం జోనల్ కమిషనర్ ఆ బాధ్యతలు చూస్తారని చెప్పారు. రాష్ట్రస్థాయిలో ఛేజింగ్ విభాగం పనిచేస్తుందన్నారు. *నోటీసు ఇవ్వకుండా కూల్చడం మంచిది కాదు: భట్టి* దరఖాస్తు చేసుకున్న తర్వాత 21 రోజుల్లో అనుమతి ఇవ్వనందున 22వ రోజు నుంచి అనుమతి వచ్చినట్లుగా భావించి భవన నిర్మాణం ప్రారంభించిన తర్వాత అధికారులొచ్చి నోటీసు ఇవ్వకుండా కూల్చివేస్తామని చెబితే ఎలా అని కాంగ్రెస్ సభాపక్షనేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఒక అవకాశం ఇవ్వడం ప్రాథమిక హక్కు కదా? దాన్ని లేకుండా చేస్తారా అని ప్రశ్నించారు. కనీసం 5-7 రోజుల సమయం ఇచ్చి చూడాలన్నారు. దానిపై మంత్రి కేటీఆర్ సమాధానమిస్తూ అధికారులపైనా జరిమానా విధింపు లాంటి చర్యలుంటాయన్నారు. ప్రజలపై విశ్వాసం ఉంచి అనుమతులను సరళతరం చేసినప్పుడు నిబంధనల ఉల్లంఘనపై కూడా కఠినంగా వ్యవహరిస్తామన్నారు. *వన్‌టైమ్ సెటిల్‌మెంట్‌కు మరో 45 రోజుల గడువు పెంపు* నోటరీ ద్వారా స్థలాలున్న వారికి కూడా అనుమతులివ్వాలని కొందరు సభ్యులు కోరారని, దానిపై వన్ టైమ్ రిలీఫ్ ఇవ్వాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని కేటీఆర్ చెప్పారు. ఇంటి పన్నులు, నీటి బిల్లులకు సంబంధించి కూడా వన్ టైమ్ సెటిల్‌మెంట్‌కు మరో 45 రోజుల గడువు పెంచుతామని, అక్టోబరు 31వ తేదీ వరకు అవకాశం ఇస్తామని వెల్లడించారు.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.