*భారత్‌పై డ్రాగన్ నిఘా నేత్రం*
*10 వేల మంది భారతీయుల రహస్య సమాచారం సేకరణ*
*జాబితాలో ప్రభుత్వ, ప్రతిపక్ష నేతలు, సైనికాధికారులు*
*ప్రభుత్వాన్ని నిలదీసిన కాంగ్రెస్*
*పార్లమెంటులో వాయిదా తీర్మానానికి నోటీసు*
దిల్లీ: చైనా కుయుక్తులు మరోసారి బట్టబయలయ్యాయి. వివిధ వెబ్సైట్లు, సంస్థల ద్వారా భారత్‌లో 10 వేల మందికిపైగా ప్రముఖులపై నిఘా పెట్టినట్లు వెల్లడైంది. వారికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు రహస్యంగా సేకరిస్తున్నట్లు తేలింది. డ్రాగన్ కన్ను పడినవారిలో రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కీలక విపక్ష నేతలు, క్యాబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులు, జడ్జీలు, రాజకీయ నాయకులు, సైనికాధికారులు, శాస్త్రవేత్తలు, నిఘా సంస్థల అధికారులు, బ్యూరోక్రాట్లు, పాత్రికేయులు, పారిశ్రామికవేత్తలు, నటులు, క్రీడాకారులు, మతపెద్దలు ఉన్నారు. సమాజంలో ఏ వర్గాన్నీ డ్రాగన్ వదిలిపెట్టలేదని తేలింది. ఈ వార్త కలకలం సృష్టించింది. *ప్రముఖులందరిపైనా..* డ్రాగన్ నిఘా బాగోతాన్ని ఓ ఆంగ్ల పత్రిక తాజాగా బయటపెట్టింది. చైనా నిఘా నేత్రంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, వారి కుటుంబ సభ్యులు, ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అశోక్ గహ్లోత్, అమరీందర్ సింగ్, ఉద్ధవ్ ఠాక్రే, నవీన్ పట్నాయక్, శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, రవిశంకర్ ప్రసాద్, స్మృతీ ఇరానీ, పీయూష్ గోయెల్, త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్, 15 మంది మాజీ సైనిక, నౌకాదళ, వైమానిక దళ అధిపతులు, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్, లోక్‌పాల్ జస్టిస్ పి.సి.ఘోష్, కాగ్ జి.సి.ముర్ము, పారిశ్రామికవేత్తలు రతన్ టాటా, గౌతమ్ అదానీ తదితరులు ఉన్నారు. మాజీ ప్రధాన మంత్రులు మన్మోహన్ సింగ్, వాజ్‌పేయీ, దేవెగౌడ, పి.వి.నరసింహారావు, రాజీవ్ గాంధీ, 24 మంది మాజీ ముఖ్యమంత్రులు, వివిధ పార్టీలకు చెందిన 350 మంది ఎంపీలపై కూడా చైనా కన్నేసింది. వీరే కాదు 70 మంది మేయర్లు, డిప్యూటీ మేయర్లు, సర్పంచులపైనా నిఘా పెట్టింది. మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్, సినీ దర్శకుడు శ్యామ్ బెనెగల్, నృత్యకారిణి సోనాల్ మాన్సింగ్ తదితరుల వివరాలనూ సేకరిస్తోంది. వీరే కాదు.. ఆర్థిక నేరాలు, అవినీతి, ఉగ్రవాదం; మాదకద్రవ్యాలు, బంగారం, ఆయుధాలు, వన్యప్రాణుల అక్రమ రవాణాలో నిందితులుగా ఉన్న వందల మంది నేరగాళ్లనూ డ్రాగన్ నిఘా నేత్రంలో ఉంచింది. *సైబర్ భద్రత పెంచండి: కాంగ్రెస్* ఝెన్హువా వ్యవహారం చాలా ఆందోళనకర అంశమని కాంగ్రెస్ పేర్కొంది. చైనా కార్యకలాపాలను ఎదుర్కొనేందుకు సైబర్ భద్రతను మరింత ముమ్మరం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ‘‘రెండేళ్ల కిందట ఏర్పడిన ఈ కంపెనీ.. ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేసిందా? దీనిపై ప్రభుత్వం దర్యాప్తు చేసి, జాతికి భరోసా ఇవ్వగలదా’’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ట్విటర్లో పేర్కొన్నారు. చైనా నిఘా వ్యవహారాల గురించి మోదీ ప్రభుత్వానికి తెలుసా అని ప్రశ్నించారు. ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీలు లోక్‌సభలో వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చారు. ‘‘ఇది చాలా తీవ్రమైన అంశం. ఒకవైపు చైనా సైన్యం మన భూభాగంలో అతిక్రమణలకు పాల్పడుతోంది. మరోవైపు 10వేల మంది భారతీయుల వివరాలను సేకరిస్తోంది’’ అని వారు ‘ఈటీవీ భారత్’తో పేర్కొన్నారు. ఈ వార్త నిజమైతే చైనా రాయబారిని పిలిచి మాట్లాడాలన్నారు. దీనిపై పార్లమెంటులో కూడా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. *డ్రాగన్ వ్యవహారాలు తెలుసు..* చైనా ‘హైబ్రిడ్ యుద్ధం’ వార్తలపై తామేమీ ఆశ్చర్యానికి లోను కాలేదని భారత అధికారులు పేర్కొన్నారు. చైనా కంపెనీలు డేటా చౌర్యానికి పాల్పడుతున్నాయని, ఆ డేటాను చైనా ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం చేస్తున్న విషయం భారత ప్రభుత్వానికి తెలుసని చెప్పారు. ఇలాంటివాటిని అరికట్టడానికే ఆ దేశానికి చెందిన అనేక యాప్‌లను నిషేధించామని తెలిపారు. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వంటి వారిపై ఒపెన్ సోర్సు నుంచి సేకరించిన సమాచారాన్నీ పొరుగు దేశం దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందన్నారు. *మాజీ ముఖ్యమంత్రులపైనా..* ఆంధ్ర]ప్రదేశ్ మాజీ సీఎంలు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కిరణ్‌కుమార్ రెడ్డి, ఇతర రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, ములాయం సింగ్ యాదవ్, లాలు ప్రసాద్ యాదవ్, ఎస్.ఆర్.బొమ్మై, జ్యోతి బసు, మనోహర్ పారికర్, సిద్ధరామయ్య తదితరులు లేదా వారి బంధువులు కూడా డ్రాగన్ జాబితాలో ఉన్నారు. రాజకీయాల్లో ఉన్న గాంధీ, పవార్, సింధియా, సంగ్మా, బాదల్ తదితర ప్రముఖ కుటుంబాలపైనా కన్నేశారు. మేయర్లు, సర్పంచులనూ వదిలిపెట్టకపోవడం గమనార్హం. తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. హైబ్రిడ్ యుద్ధం, చైనా పునరుత్థానమే లక్ష్యంగా పెట్టుకొన్న ఝెన్హువా డేటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ నిఘా కార్యకలపాలకు పాల్పడుతోంది. ఈ సంస్థకు చైనా ప్రభుత్వంతోను, అక్కడి అధికార కమ్యూనిస్టు పార్టీతోను సంబంధాలు ఉన్నాయి. ‘బిగ్ డేటా’ సాధనాలను ఉపయోగించి, ఝెన్హువా కార్యకలాపాలకు సంబంధించిన మెటా డేటాను ఓ ఆంగ్ల పత్రిక విశ్లేషించింది. తద్వారా ‘ఓవర్సీస్ కీ ఇన్ఫర్మేషన్ డేటాబేస్’ (ఓకేఐడీబీ) నుంచి భారత వివరాలను వెలికి తీసింది. ఈ డేటాబేస్‌లో అమెరికా, బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, యూఏఈ తదితర దేశాల వివరాలు ఉన్నాయి. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా 24 లక్షల మంది వివరాలు ఉన్నాయి. ఇందులో ఒక్క అమెరికాకు చెందిన 50 వేల మంది డేటా ఉంది. *ఏమిటీ హైబ్రిడ్ యుద్ధం?* సైనికేతర సాధనాల ద్వారా ఆయా దేశాలపై పట్టు సాధించడం, ప్రభావం చూపడం వంటివాటితో కూడిన ‘హైబ్రిడ్ యుద్ధం’ కోసం ఈ డేటాను ఝెన్హువా ఉపయోగిస్తోంది. సమాచారాన్ని వక్రీకరించడం, ప్రజల భావనలను అనుకూలంగా మలుచుకోవడం వంటివి ఉన్నాయి. ఈ సంస్థ నుంచి సేవలు పొందుతున్నవారిలో చైనా ప్రభుత్వం కూడా ఉంది. *ఝెన్హువా ఏం చేస్తోంది?* లక్షిత వ్యక్తులు, సంస్థలకు సంబంధించి వార్తలు, వివిధ వేదికలు, పత్రాలు, పేటెంట్లు, సామాజిక మాధ్యమాల్లో ఉన్న సమాచారాన్ని సేకరించి, ఒక సమాచార లైబ్రరీని ఝెన్హువా నిర్వహిస్తోంది. వారితో సంబంధమున్న సంస్థలు, వ్యక్తులకు సంబంధించిన ‘రిలేషనల్ డేటాబేస్’నూ సేకరిస్తోంది. తద్వారా లక్షిత వ్యక్తుల తీరుతెన్నులపై నిఘా వేస్తోంది.