*Nobel Peace Prize: సాహస పాత్రికేయులకు ‘శాంతి’ నోబెల్*
*మరియా, దిమిత్రిలకు పురస్కారం*
*వేధింపులకు వెరవక అక్రమాలను వెలుగులోకి తెచ్చారంటూ ఎంపిక కమిటీ కితాబు
* ఓస్లో: భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం కలం సాయంతో పోరు సాగించిన పాత్రికేయులు మరియా రెస్సా, దిమిత్రి మురాతోవ్‌లు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. విలేకరులు నిరంతర దాడులు, వేధింపులు, హత్యలు ఎదుర్కొనే దేశాల్లో వీరు వాక్ స్వాతంత్య్రం కోసం శ్రమించారని ఎంపిక కమిటీ కొనియాడింది. ప్రజాస్వామ్యం, పాత్రికేయ స్వేచ్ఛకు ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో భావ వ్యక్తీకరణ హక్కు కోసం ధైర్యంగా నిలబడ్డ విలేకరులకు వీరు ప్రతినిధులని పేర్కొంది. శాంతిని పెంపొందించడానికి ఈ స్వేచ్ఛ చాలా ముఖ్యమని తెలిపింది. మరియాది ఫిలిప్పీన్స్ కాగా దిమిత్రి స్వస్థలం రష్యా. ఈ పాత్రికేయుల నోరు నొక్కేయడానికి ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు చేయని ప్రయత్నమంటూ లేదు. ఫిలిప్పీన్స్‌వాసి ఒకరు నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక కావడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది ఇప్పటివరకూ ప్రకటించిన నోబెల్ పురస్కారాల్లో చోటు దక్కించుకున్న తొలి మహిళ మరియానే కావడం విశేషం. ఈ బహుమతి కింద దక్కే 11.4 లక్షల డాలర్లను విజేతలిద్దరికీ సమానంగా పంచుతారు. భావవ్యక్తీకరణ, పత్రికాస్వేచ్ఛ లేకుంటే దేశాల మధ్య సోదరభావాన్ని పెంపొందించలేమని.. నిరాయుధీకరణ, మెరుగైన ప్రపంచక్రమానుగతిని సాధించలేమని నార్వేజియన్ నోబెల్ కమిటీ ఛైర్మన్ బెరిట్ రెయిస్ ఆండర్సన్ పేర్కొన్నారు.
*రాప్లర్ పేరుతో..* మరియా రెస్సా.. పరిశోధనాత్మక జర్నలిజం కోసం 2012లో ‘రాప్లర్’ పేరుతో ఒక వార్తా వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అధికార ఒత్తిళ్లను ఎదుర్కొంటూ ఎన్నో సంచలనాత్మక కథనాలను ధైర్యంగా ప్రచురించారు. అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్తె తెచ్చిన వివాదాస్పద ‘యాంటీ డ్రగ్’ కార్యక్రమంపై ఆమె సాహసోపేతంగా విమర్శనాత్మక కథనాలు రాశారు. డ్రగ్ మాఫియా సభ్యులుగా పేర్కొంటూ వేల మందిని అంతమొందించిన తీరును వెలుగులోకి తెచ్చారు. తనకు నోబెల్ రావడం వల్ల ఫిలిప్పీన్స్ ప్రభుత్వం కచ్చితంగా అసంతృప్తికి గురై ఉంటుందని మరియా వ్యాఖ్యానించారు.
‘‘ఈ వార్త తెలిసి మొదట నేను షాక్‌కు గురయ్యా. ఇవి నాకు ఉద్వేగభరిత క్షణాలు. మేం ఎదుర్కొంటున్న పరిస్థితులను గుర్తించిన నోబెల్ ఎంపిక కమిటీకి కృతజ్ఞతలు’’ అని చెప్పారు. ‘‘ఫిలిప్పీన్స్‌లో నేను, నా సహచర పాత్రికేయులు నిరంతరం వేధింపులు, బెదిరింపులు ఎదుర్కొన్నాం. ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులకు, పాత్రికేయ స్వేచ్ఛకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులకు ఇది ప్రబల ఉదాహరణ’’ అని పేర్కొన్నారు. ఫేస్‌బుక్ వంటి సామాజిక మీడియా దిగ్గజాలు విద్వేషంతో చేసే అసత్య ప్రచారాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయని విమర్శించారు.
*దశాబ్దాలుగా పోరాటం..* 1993లో రష్యాలో ప్రారంభమైన ‘నవోయా గజెటా’ దినపత్రిక వ్యవస్థాపకుల్లో దిమిత్రి మురాతోవ్ ఒకరు. ఇది.. రష్యాలో అత్యంత స్వతంత్ర పత్రిక. వాస్తవ ఆధారిత పాత్రికేయం, వృత్తిపరమైన నిబద్ధతను చాటింది. దేశంలో పేరుకుపోయిన అవినీతి, విధానపరమైన హింస, చట్ట వ్యతిరేక అరెస్టులు, ఎన్నికల్లో మోసాలు వంటి ఎన్నో సంచలనాత్మక కథనాలను ‘నవోయా గజెటా’ ప్రచురించింది. దీంతో ఎన్నోసార్లు ఈ పత్రికకు బెదిరింపులు వచ్చాయి. ఇప్పటివరకూ ఈ సంస్థకు చెందిన ఆరుగురు జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. చెచెన్యాలో రష్యా సాగించిన పోరుపై కథనాలు రాసిన అన్నా పొలిటికోవోస్కయా కూడా వీరిలో ఉన్నారు. అయినప్పటికీ మురాతోవ్ వెనకడుగు వేయకుండా తన సిద్ధాంతాలను కొనసాగిస్తూ వచ్చారు. మీడియా స్వేచ్ఛ కోసం దశాబ్దాలుగా పోరాటం సాగిస్తున్నారు. 1990లో నోబెల్ శాంతి బహుమతి గెల్చుకున్న నాటి సోవియట్ యూనియన్ నాయకుడు మిఖాయిల్ గోర్బచేవ్.. తన బహుమతి మొత్తంలో కొంత భాగాన్ని ‘నవోయా గజెటా’ సంస్థకు కార్యాలయ ఉపకరణాలు, కంప్యూటర్ల కొనుగోలుకు వెచ్చించారు. గతంలోనూ పాత్రికేయులకు నోబెల్ శాంతి బహుమతి దక్కింది. 1907లో ఇటలీకి చెందిన ఎర్నెస్టో టియోడొరో మోనెటో, 1935లో జర్మనీకి చెందిన కార్ల్ వోన్‌ను ఈ పురస్కారాలు వరించాయి. పాత్రికేయులకు నోబెల్ శాంతి బహుమతి రావడంపై పలు మీడియా హక్కుల సంస్థలు హర్షం వ్యక్తంచేశాయి. _