*ఎక్కాల్సిన రైలు ఇక లేటుకాదు..!*
* *త్వరలో కొత్త టైమ్‌టేబుల్ విధానం*
* *భారీ ఆలస్యాలకు చెక్* ఇంటర్నెట్‌డెస్క్: రైల్వేశాఖ సరకు రవాణా, ప్రయాణికుల రైళ్లలో ఆలస్యాలకు స్వస్తి చెప్పేందుకు సరికొత్త టైం టేబుల్‌ను తీసుకొస్తోంది.
దీనిపై రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ మాట్లాడుతూ ‘‘రైల్వేలో అమల్లోకి రానున్న ‘జీరో బేస్డ్ టైం టేబుల్’తో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. తగ్గే సమయం కనీసం 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు వుంది.
దీనిలో ప్రత్యేకమైన కారిడార్లు సరకు రవాణా రైళ్ల ప్రయాణాలను మరింత సులువు చేస్తాయి. దీంతో వ్యాపారం చేయడం సులభం అవుతుంది’’ అన్నారు. *కొత్త టైంటేబుల్ ఏమిటీ..*
ఈ విధానంలో పలు విషయాలపై రైల్వేశాఖ దృష్టిపెట్టింది. శాస్త్రీయ పద్దతిలో రైళ్ల షెడ్యూళ్లను వేయనున్నారు. వీటి నిర్వహణకు తగినన్ని కారిడార్ బ్లాక్స్‌ను సిద్ధం చేయడం, రవాణా చేసే సరకు మొత్తాన్ని పెంచడం, కచ్చితమైన సమయానికి రైళ్లు నడిచేలా చూడటం ద్వారా నాణ్యమైన సేవలను అందిచడం దీని లక్ష్యం.
అంతేకాదు వాణిజ్య, ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని స్టాప్‌లను నిర్ణయించనున్నారు. ‘‘రైల్వేల్లో ఆక్యూపెన్సీ మొత్తాన్ని పెంచడానికి, డిమాండ్ ఉన్న రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఒక్కసారి ఇది అమల్లోకి వస్తే సుదూర ప్రాంతాలకు ప్రయాణ సమయం అరగంట నుంచి ఆరు గంటల వరకు తగ్గుతుంది. రైళ్ల వేగాన్ని కూడా గణనీయంగా పెంచేందుకు వీలవుతుంది’ అని వీకే యాదవ్ తెలిపారు.