*ప్రభుత్వ ఆదేశాలు పాటించాల్సిందే

Spread the love

*ప్రభుత్వ ఆదేశాలు పాటించాల్సిందే* *సామాజిక మాధ్యమాలకు పార్లమెంటరీ స్థాయీ సంఘం స్పష్టీకరణ*

*హాజరైన ఫేస్‌బుక్‌, గూగుల్‌ ప్రతినిధులు* దిల్లీ: సామాజిక మాధ్యమాలు నూతన ఐటీ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సమాచార సాంకేతిక రంగ పార్లమెంటరీ స్థాయీ సంఘం పేర్కొంది. ప్రభుత్వ ఆదేశాలను, కోర్టు ఉత్తర్వులను తప్పక పాటించాలని స్పష్టం చేసింది. ఫేస్‌బుక్‌, గూగుల్‌ సంస్థల ప్రతినిధులతో మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు ఆదేశించింది.

సామాజిక మాధ్యమాల దుర్వినియోగ వ్యవహారంపై చర్చించేందుకు తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఈ కమిటీ ఫేస్‌బుక్‌, గూగుల్‌ సంస్థలకు ఇటీవల సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్‌ ప్రజా విధానాల ఇండియా డైరెక్టర్‌ శివనాథ్‌ థుక్రల్‌, సంస్థ న్యాయ సలహాదారు నమ్రతా సింగ్‌, గూగుల్‌ భారత అధిపతి (ప్రభుత్వ వ్యవహారాలు, ప్రజా విధానాలు) అమన్‌ జైన్‌, లీగల్‌ డైరెక్టర్‌ గీతాంజలి దుగ్గల్‌ కమిటీతో భేటీ అయ్యారు. పౌరుల హక్కుల పరిరక్షణ, సామాజిక మాధ్యమాలు, ఆన్‌లైన్‌ వార్తా సంస్థల దుర్వినియోగాన్ని అడ్డుకోవడాన్ని ఇందులో ప్రధానంగా చర్చించారు.

వినియోగదారుల సమాచార పరిరక్షణకు, గోప్యతకు సంబంధించి ఆయా సామాజిక మాధ్యమాలు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాల్లో పలు లోపాలున్నట్లు ఈ సందర్భంగా కమిటీ పేర్కొంది.

ముఖ్యంగా మహిళల గోప్యతకు సంబంధించి కమిటీ అధ్యక్షుడు శశిథరూర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ఐటీ, సమాచార శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌, కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ల ట్విటర్‌ ఖాతాలను నిలిపివేసిన ఘటనపై రెండు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కమిటీ ట్విటర్‌ను ఆదేశించింది.

*మరిన్ని చిక్కుల్లో ట్విటర్‌* *సంస్థపై మూడు కేసులు*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *