రోడ్డు పక్కన చిరుతిళ్లు.. ఇక ఇంటివద్దకే

Spread the love

*రోడ్డు పక్కన చిరుతిళ్లు.. ఇక ఇంటివద్దకే!* *స్విగ్గీతో కేంద్రం ఒప్పందం.. ఇక ఇంటి వద్దకే స్ట్రీట్‌ ఫుడ్‌*

దిల్లీ: కరోనా వైరస్‌ నిబంధనల కారణంగా తమకు ఎంతో ఇష్టమైన చిరుతిళ్లను కోల్పోతున్న వారికి శుభవార్త. కేంద్ర ప్రభుత్వం, ఆన్‌లైన్‌ ఆహార సరఫరాదారు స్విగ్గీతో చేసుకున్న ఓ ఒప్పందం ఫలితంగా వీధుల్లో దొరికే చిరుతిళ్లు (స్ట్రీట్‌ ఫుడ్‌) ప్రజలకు మళ్లీ అందుబాటులోకి రానున్నాయి. బయటకు వెళ్లి, గుంపులో నిలబడి భయంభయంగా తిననవసరం లేకుండా.. అవి వారి ముంగిట్లోకే రానుండటం విశేషం.

ఇందుకోసం పానీపూరీ, ఛాట్‌, వడాపావ్‌ తదితర పదార్థాలను వీధుల్లో విక్రయించే చిరు వ్యాపారులను కేంద్రం ఆన్‌లైన్‌ పరిధిలోకి తీసుకురానుంది. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ సంజయ్‌ కుమార్‌, స్విగ్గీ ముఖ్య ఆర్థిక అధికారి రాహుల్‌ బోత్రా ఓ ఒప్పందంపై సంతకాలు చేశారు. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘ప్రధాన మంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర్‌ నిధి’ పథకం కింద వీధి వ్యాపారులను, వినియోగదారులను ఆన్‌లైన్‌లో అనుసంధానిస్తుంది.

తొలుత ప్రయోగాత్మకంగా ఐదు పట్టణాల్లో 250 మంది వీధి వ్యాపారులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 

అహ్మదాబాద్‌, చెన్నై, దిల్లీ, ఇండోర్‌, వారణాసిలలో అందుబాటులోకి తెచ్చిన అనంతరం ఈ సదుపాయాన్ని త్వరలోనే దేశవ్యాప్తంగా తీసుకువస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకుగాను పురపాలికలు, ఫుడ్ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ), స్విగ్గీ తదితరులతో చర్చించి అవసరమైన మార్గదర్శకాలను రూపొందించినట్టు అధికారులు వెల్లడించారు.

పథకంలో భాగంగా చిరు వ్యాపారులకు నెలసరి వాయిదాల్లో తిరిగి చెల్లించే విధంగా రూ.10,000 వరకు రుణసహాయం అందుతుంది. వారిలో ప్రతి ఒక్కరికీ శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌), ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నమోదు సంఖ్య కేటాయిస్తామని అధికారులు తెలిపారు. వారికి అవసరమైన సాంకేతిక శిక్షణతో పాటు ధరలు, శుభ్రత, ప్యాకింగ్‌ ప్రమాణాలు తదితర విషయాల్లో కూడా తర్ఫీదునిస్తామని అధికారులు వివరించారు.

ఈ పథకం ద్వారా నగరాలు, పట్టణాలు, వాటి పరిసర ప్రాంతాల్లో ఉండే 50 లక్షల మందికి పైగా చిరువ్యాపారులకు ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *