*ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్న అధికారులు

Spread the love

*ఇక పరిష్కార ప్రక్రియ*

*ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్న అధికారులు

* *రుసుం చెల్లింపునకు గడువు జనవరి 31*

హైదరాబాద్‌: రాష్ట్రంలో అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తుల పరిష్కార ప్రక్రియకు పురపాలకశాఖ శ్రీకారం చుడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అంచనాలను మించి 25.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గ్రామ పంచాయతీల్లో 10.8 లక్షలు, పురపాలక సంఘాల్లో 10.6 లక్షలు, నగరపాలక సంస్థల్లో 4.1 లక్షల దరఖాస్తులు వచ్చాయి.  దరఖాస్తుల ఆధారంగా క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టేందుకు ముందు అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. సంబంధిత ప్లాటు లేదా లేఅవుట్‌ నిబంధనల మేరకు ఉందా? లేదా? నిర్ధారించుకుంటారు. నిబంధనల మేరకు ఉంటే ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం నిర్దేశించిన మొత్తాన్ని ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలని దరఖాస్తుదారులకు సమాచారమిస్తారు. రుసుం చెల్లించిన తర్వాత పురపాలక సంఘాల్లో కమిషనర్లు, గ్రామపంచాయతీల్లో కలెక్టర్‌ లేదా అదనపు కలెక్టర్‌ క్రమబద్ధీకరిస్తారు.

క్షేత్రస్థాయి పరిశీలనకు పురపాలక సంఘాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుం చెల్లించేందుకు ప్రభుత్వం వచ్చే ఏడాది జనవరి 31ని ఆఖరు తేదీగా నిర్దేశించింది. *జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కువ దరఖాస్తులు*

కార్పొరేషన్లలో జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,06,891 ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు వచ్చాయి. వరంగల్‌లో 1,01,033, ఖమ్మంలో 51,395, బడంగ్‌పేటలో 46,894, నిజామాబాద్‌లో 33,513 దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో కేవలం 368 దరఖాస్తులు వచ్చాయి. 6 నగరపాలక సంస్థలలో 10వేల కంటే తక్కువ దరఖాస్తులు వచ్చాయి. పురపాలక సంఘాల్లో మొత్తం 10.60 లక్షల దరఖాస్తులు రాగా.. అత్యధికంగా తుర్కయంజాల్‌ పరిధిలో 47,362 దరఖాస్తులు వచ్చాయి. నల్గొండలో 36,025, సూర్యాపేటలో 35,536, సిద్దిపేటలో 32,433, మహబూబ్‌నగర్‌లో 31,533 వనపర్తిలో 28,955, మంచిర్యాలలో 23,369 దరఖాస్తులు వచ్చాయి. గ్రామపంచాయతీల పరిధిలో 10,83,394 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా దరఖాస్తులు రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *