*16 నుంచి ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో అమలు
*ఒక్క సిలిండరు ఉన్న ఐవోసీ వినియోగదారులకే..
*రూ.25 అదనం
హైదరాబాద్: ఇక సామాన్యులకు వంట గ్యాస్ సిలిండరు కష్టాలు తీరనున్నాయి. బుక్ చేసుకున్న రెండు గంటల్లోనే సిలిండరు ఇంటికి చేరనుంది.
ఒకే గ్యాస్ సిలిండర్ ఉండి, తత్కాల్ ప్రాతిపదికన బుక్ చేసుకున్న వినియోగదారులకు ఈ సదుపాయాన్ని కల్పించాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) నిర్ణయించింది. ‘సులభతర జీవనం’ విధానం కింద తెలంగాణలో ప్రయోగాత్మకంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అమలు చేయనుంది. ఈ నెల 16న ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరి 1న దీన్ని ప్రారంభించాలని కేంద్రం తొలుత భావించినా..
పండగ సందర్భంగా శనివారం నుంచి అమలుచేయాలని నిర్ణయానికి వచ్చింది. గ్రేటర్లో అమలు చేసిన తరవాత గుర్తించిన అంశాల ఆధారంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాలని అధికారులు యోచిస్తున్నారు.
తత్కాల్ ప్రాతిపదికన సిలిండరు బుక్ చేసుకున్న వినియోగదారులు సాధారణ ధర కన్నా రూ.25 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. పని దినాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యలో సిలిండరు బుక్ చేసుకున్న వినియోగదారులకు మాత్రమే తత్కాల్ కింద రెండు గంటల వ్యవధిలో డెలివరీ చేసేందుకు డీలర్లను ఐవోసీ సమాయత్తం చేస్తోంది.
అధికారులు ప్రత్యేక యాప్‌నూ సిద్ధం చేస్తున్నారు. రశీదుతో పని లేకుండా ఆన్లైన్ ద్వారానే డెలివరీ చేస్తారు. ఎంత మొత్తం చెల్లించాలన్నది వినియోగదారుడికి సమాచారం అందుతుంది.