శ్రీ పవన్ కళ్యాణ్ గారు కోటి రూపాయలు విరాళం
వరదలు, భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన హైదరాబాద్ ప్రజలకు అండగా ఉండేందుకు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు.
ఈ మేరకు బుధవారం రాత్రి వీడియో సందేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “కరోనా మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలయిపోయి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారీ వర్షాలు, వరదలు తోడయ్యాయి. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల మూలంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఇబ్బందులు పాలవుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా లేనంత వర్షపాతం దేశం మొత్తం చూసింది. తెలంగాణలో దీని తాకిడి మరింత ఎక్కువగా ఉంది.
చాలామంది జీవన విధానం చిన్నాభిన్నం అయింది. హైదరాబాదులో ఇళ్ళలోకి నీళ్ళు వచ్చేసి ఆస్తి నష్టం జరిగింది. గత కొన్ని దశాబ్దాలుగా టౌన్ ప్లానింగ్ సరిగా లేకపోవడం ఒక కారణం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితులను అర్థం చేసుకుని, ప్రజలు పడుతున్న కష్టాలు చూసి… ప్రజలకు సహాయ కార్యక్రమాలు చేస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి నా వంతుగా కోటి రూపాయలు ప్రకటిస్తున్నాను జనసైనికులు, అభిమానులు, నాయకులు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
అందరూ కలిసికట్టుగా ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన సమయం ఇది” అన్నారు.