*కొత్త చట్టం.. ప్రజల చుట్టం..* *ఏజెన్సీ ఏరియా భూముల్లో జోక్యం చేసుకోబోం* *ఏడాదిలోగా భూముల సర్వే పూర్తి* *రెవెన్యూ బిల్లుపై మండలిలో సీఎం కేసీఆర్*
రాష్ట్రంలో 95 శాతం భూములు ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీల వద్దే ఉన్నాయి. భూస్వాముల్లేరు.. ఆసాముల్లేరు. సామాన్యులైన పేద తెలంగాణ రైతులే ఉన్నారు. మట్టిని నమ్ముకున్న రైతుల రక్షణ కోసం కొత్త రెవెన్యూ చట్టం బిల్లు తీసుకువచ్చాం. పేదలను ఇబ్బందులు పెడుతున్న వారినుంచి రక్షించి ప్రభుత్వం తరపున కచ్చితమైన హక్కు పత్రాలు అందిస్తాం._ రికార్డుల్లో కౌలుదార్ల విషయాన్ని పట్టించుకోం. కౌలు అంశం కౌలుదారులు, రైతుల మధ్య జరిగే ప్రైవేటు ఒప్పందం. జాగీర్దార్లు, జాగీర్ల సమయంలో కష్టం చేసిన రైతును కాపాడేందుకు అప్పట్లో రక్షిత కౌలుదారు చట్టం కింద హక్కు పత్రాలిచ్చారు. ఇప్పుడు 98 శాతం మంది రైతుల వద్ద 10 ఎకరాల్లోపు భూములున్నాయి. రికార్డుల్లో అనుభవదారు గడి పెట్టి, అందులో పేరు రాసిన వ్యక్తి కోర్టు నుంచి ఇంజక్షన్ ఉత్తర్వులు తీసుకువచ్చి రైతులను ఇబ్బందులు పెట్టే పరిస్థితి రానీయం. _ఏజెన్సీ ప్రాంతాల్లోని భూముల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. అవన్నీ కేంద్ర చట్టం 1/70 కింద నమోదై ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితి కొనసాగిస్తాం. అయితే అక్కడి రైతులకు రైతుబీమా, రైతుబంధు మంజూరు చేస్తాం. మిగతా భూములన్నీ ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. ఏడాదిలోగా భూములన్నీ సర్వే చేసి.. పకడ్బందీగా మ్యాపులను ధరణి పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తాం. – *సీఎం కేసీఆర్*_
హైదరాబాద్: ప్రభుత్వం తీసుకురానున్న నూతన రెవెన్యూ చట్టంతో ప్రజలకు అవినీతి రహిత సేవలతో పాటు చట్టబద్ధమైన రక్షణలు లభిస్తాయని, ఎవరికీ అన్యాయం జరగదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నూరు శాతం పారదర్శకంగా రైతుల వివరాలు ధరణి పోర్టల్‌లో ఉంటాయని, ఈ డేటాను ఎవరూ మార్చడానికి వీల్లేకుండా సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన రక్షణాత్మక చర్యలు చేస్తామని పేర్కొన్నారు. ధరణి పోర్టల్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి, సూచనలు సలహాలతో అవసరమైన మార్పులు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో భూముల సర్వేతో ప్రభుత్వ, ప్రైవేటు భూముల వివరాలు తెలిసిపోతాయని, ఏడాదిలోగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తామని వెల్లడించారు. అవసరమైన చోట గ్రామానికో వీఆర్‌ఏను పెట్టి, మిగతావారిని నీటిపారుదల శాఖలో లష్కర్ పోస్టుల్లో సర్దుబాటు చేస్తామన్నారు. ఎన్‌ఆర్‌ఐల భూములను పరిరక్షించేందుకు ఆధార్ కార్డు స్ధానంలో పాస్‌పోర్టు, ఇతర పత్రాల సాయంతో రక్షణ కల్పిస్తామని చెప్పారు. సోమవారం శాసనమండలిలో నూతన రెవెన్యూ చట్టం, గ్రామ రెవెన్యూ అధికారి పదవుల రద్దు, పురపాలక, పంచాయతీరాజ్ బిల్లులను మండలి ఆమోదించింది. అంతకుముందు రెవెన్యూ బిల్లు, వీఆర్‌వో పదవుల రద్దు బిల్లులను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ మాట్లాడారు. ‘‘కేంద్రం ఒక్కమాట చెప్పకుండా దుర్మార్గంగా ఏడు రెవెన్యూ మండలాల్ని ఆంధ్రాలో కలిపేసింది. విద్యుత్తు కష్టాల్లో ఉన్నపుడు 440 మెగావాట్ల సీలేరు విద్యుత్తు కేంద్రాన్ని ఏపీకి ఇచ్చేశారు. ఇప్పుడైతే విద్యుత్తు సరఫరాలో దేశంలోనే నంబర్ వన్‌గా ఉన్నాం’’ అని పేర్కొన్నారు. *భూముల వివరాలు కంప్యూటరీకరించాం* ‘‘తెలంగాణ వచ్చాక భూముల ధరలు పెరగడంతో భూమాఫియా, వివాదాల సృష్టికర్తలు ఎక్కువ కావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో 2.75 కోట్ల ఎకరాల భూములుంటే… వీటిలో 1.5-1.6 కోట్ల ఎకరాలు వ్యవసాయ భూములు. అర్హత కలిగిన రైతులకు పాసుపుస్తకాలు మంజూరు చేసి రైతుబంధు ఇచ్చాం. వానాకాలం రైతుబంధు పొందిన 60.95 లక్షల మంది రైతులకు 1.50 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. వీఆర్‌వో వ్యవస్థను మూడేళ్ల క్రితమే రద్దుచేసే ప్రణాళిక చేసుకున్నాం. ముందస్తు ఎన్నికలు, కరోనా కారణంగా ఆలస్యమైంది. శిస్తు వసూలు చేసే అధికారం వీఆర్‌వోది. కానీ, శిస్తు వసూలు ఎప్పుడో నిలిచిపోయింది. ప్రభుత్వమే ఎకరాకు రూ.10 వేల నగదు ఇస్తోంది. రికార్డుల కంప్యూటరీకరణతోవాస్తవానికి వీఆర్‌వో వ్యవస్థ రద్దయింది. రికార్డుల్లో ఎవరిది పడితే వారి పేరు రాసే పద్ధతి పోయింది. వీఆర్‌వో వ్యవస్థ రద్దుతో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. 95% భూములు పేదల వద్దే ఉంటే.. వీఆర్‌వో, ఇతరత్రా వారు చేసే దుర్మార్గాలతో పేదరైతులు ఇబ్బందులు పడ్డారు. *జీడీపీ 2-3 శాతం పెరిగే అవకాశం* వివాదాల్లేకుండా.. పారదర్శకంగా భూరికార్డుల నిర్వహణతో జీడీపీ 2-3 శాతం పెరుగుతుందని అభివృద్ధి చెందిన దేశాల్లో రుజువైంది. వ్యవసాయేతర భూములను సబ్‌రిజిస్ట్రార్లు రిజిస్టర్ చేస్తారు. ఈ భూములకు ముదురు ఎరుపు రంగు పాస్‌బుక్‌లు అందిస్తాం. భూముల సర్వేను జిల్లాకో ఏజెన్సీకి అప్పగిస్తాం.పెండింగ్‌లో ఉన్న 16,137 రెవెన్యూ వివాదాల పరిష్కారానికి కాలపరిమితితో కూడిన ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేస్తాం. వివాదాలు పరిష్కారమైన తరువాత ట్రైబ్యునళ్లు ఉండవు. నిజమైన స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చిన భూములను రక్షిస్తాం. వక్ఫ్, దేవాదాయ భూములు రిజిస్ట్రేషన్ కాకుండా అడ్డుకుంటాం. క్రిస్టియన్ మైనార్టీ భూముల పరిరక్షణ ప్రభుత్వ పరిధిలో లేదు. ఆ మతపెద్దలు ఒక బోర్డు కావాలని కోరితే ఏర్పాటు చేస్తాం’ అని సీఎం వివరించారు. *అరగంటలో మ్యుటేషన్* నూతన చట్టంతో ఒక్క రూపాయి లంచం లేకుండా మ్యుటేషన్ జరుగుతుంది. అమ్మకందారు, కొనుగోలుదారు ఇద్దరూ కలిసి ఆన్‌లైన్లో వివరాలు సమర్పించి, దరఖాస్తు చేసి ఫీజులు చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ స్లాట్ బుక్ అవుతుంది. కేవలం అరగంటలో రిజిస్ట్రేషన్ పూర్తయి మ్యుటేషన్‌తో పాటు పాసుపుస్తకంలో వివరాలు ప్రింట్ అవుతాయి. ఇవన్నీ ఆన్‌లైన్లో జరిగిపోతాయి. ఆధార్, ఐరిస్, వేలిముద్రలు తీసుకుంటారు. ధరణి పోర్టల్ డేటాను ట్యాంపర్ చేసే అవకాశమే ఉండదు
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.