పత్రికా ప్రకటనలపైనే ఎక్కువ నమ్మకం!

Spread the love

*పత్రికా ప్రకటనలపైనే ఎక్కువ నమ్మకం!* *తాజా సర్వేలో వెల్లడి*

దిల్లీ: డిజిటల్‌ మీడియా దూకుడుతో సంప్రదాయ మీడియా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. అయితే, ప్రకటనల నమ్మకాన్ని చూరగొనడంలో మాత్రం పత్రికలు ముందంజలో ఉన్నాయి.

సంప్రదాయ మీడియాలోని ప్రకటనలపైనే భారతీయులు నమ్మకాన్ని కలిగివున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది.

అడ్వర్టైజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ASCI), ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ అడ్వర్టైజర్స్‌(ISA) ఆధ్వర్యంలో నీల్సన్‌ జరిపిన తాజా అధ్యయనం ఈ విషయాలు తెలియజేసింది.

అత్యధికంగా పత్రికలు (86శాతం), టీవీ (83శాతం), రేడియో (83శాతం)లలో వచ్చే ప్రకటనపైనే భారతీయులకు ఎక్కువ నమ్మకాన్ని వెలిబుచ్చారు. వీటి తర్వాత సామాజిక మాధ్యమాల ప్రకటనలకు వినియోగదారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక మెసేజ్‌ రూపంలో చేసే ప్రకటనలకు అత్యంత తక్కువ ఆదరణ ఉంది.

వీటిపై కేవలం 52శాతం మాత్రమే విశ్వాసం కలిగివున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. ప్రధానంగా విద్యాసంస్థలకు చెందిన ప్రకటనలపైనే ఎక్కువ విశ్వాసాన్ని కనబరిచినట్లు తాజా అధ్యయనం పేర్కొంది. వీటి తర్వాత గృహోపకరణాలు, బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, ఆరోగ్య ఉత్పత్తులు, ఈ కామర్స్‌ రంగాలు ఉన్నాయి. ఇక రియల్‌ ఎస్టేట్‌ ప్రకటనలపై మాత్రం తక్కువ నమ్మకాన్నే కలిగివున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది.

ఇక సెలబ్రిటీలు ఇచ్చే ప్రకటనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు  ఈ నివేదిక అభిప్రాయపడింది. టెలివిజన్‌ వంటి మాధ్యమంతో పోలిస్తే ప్రజలు పత్రికల్లో వచ్చే ప్రకటనలకే ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఎక్కువ మందిని ప్రకటన చేరుకోవడంలో టీవీలు దోహదపడగా, ప్రకటనల్లో వచ్చే ఉత్పత్తుల నమ్మకాన్ని పెంపొందించడంలో మాత్రం పత్రికలు దోహదం చేస్తాయని ఐఎస్‌ఏ ఛైర్మన్‌ సునిల్‌ కటారియా అభిప్రాయపడ్డారు. ఇదిలాఉంటే, కరోనా విజృంభణ వేళ.. ఏప్రిల్‌తో పోలిస్తే సెప్టెంబర్‌ నాటికి ప్రింట్‌ మీడియా ప్రకటనలు కాస్త కోలుకున్నట్లు మీడియా పరిశోధన సంస్థలు వెల్లడిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *