ఆన్‌లైన్‌ అయోమయమే

IMG-20200704-WA0038.jpg

*ఆన్‌లైన్‌ అయోమయమే*

*40 శాతం కుటుంబాల్లో స్మార్ట్‌ఫోన్‌ లేదు* *22 శాతం కుటుంబాల్లోనే పిల్లలకు ఫోన్‌ ఇచ్చే వెసులుబాటు*

*ఆన్‌లైన్‌ పాఠాలు అర్థం కావడం లేదన్న 70 శాతం పిల్లలు*

*పాఠశాలలను తెరవాలంటున్న తల్లిదండ్రులు*

*బడుల పునఃప్రారంభం, ఆన్‌లైన్‌ విద్యపై టీఎస్‌యూటీఎఫ్‌ సర్వేలో వెల్లడి* ఈనాడు,

హైదరాబాద్‌: పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిద్దామన్నా రాష్ట్రంలో అందుకు తగిన మౌలిక వసతులు లేవు.

కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్‌లే కాదు…దాదాపు 40 శాతం కుటుంబాల్లో కనీసం ఒక స్మార్ట్‌ఫోన్‌ కూడా లేదు.

అది ఉన్నవారికీ ఇంటర్నెట్‌ కనెక్షన్‌ లేదు. ఒకవేళ ఉన్నా ఆన్‌లైన్‌ తరగతులకు అది సరిపోదు.

ఒకవైపు తల్లిదండ్రులు, పిల్లల పరిస్థితి ఇలాగుంటే…మరోవైపు ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్న వారూ తమకు పాఠాలు అర్థం కావడం లేదు…వాటివల్ల ఉపయోగం నామమాత్రమని తేల్చిచెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌యూటీఎఫ్‌) నిర్వహించిన సర్వేలో తేటతెల్లమైన వాస్తవాలివీ.

కరోనా పరిస్థితుల్లో రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభం, ఆన్‌లైన్‌ విద్యావకాశాలపై విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు విద్యార్థుల అభిప్రాయాలను ఆ సంఘం స్వయంగా సేకరించింది. మొత్తం 93.40 శాతం మంది బడులను పునఃప్రారంభించాలని అభిప్రాయపడగా…

కేవలం 6.60 శాతం తల్లిదండ్రులు మాత్రం ఆన్‌లైన్‌లో బోధించాలని సూచించారు. అదే సమయంలో భౌతిక దూరం పాటించేలా తరగతి గదులు లేవని సుమారు 40 శాతం మంది తెలిపారు. ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్న విద్యార్థుల్లో దాదాపు 69 శాతం మంది తమకు పాఠాలు అర్థం కావడం లేదని చెప్పారు.

*విద్యా సంవత్సరం వృథా కానివ్వొద్దు: యూటీఎఫ్‌*

హైదరాబాద్‌: కరోనా ప్రబలిన కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకొని పాఠశాలలను ప్రారంభించాలని 93 శాతం మంది తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారని, దీనిపై వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీఎస్‌యూటీఎఫ్‌ ప్రభుత్వాన్ని కోరింది. బడుల పునఃప్రారంభం, ఆన్‌లైన్‌ విద్యావకాశాలపై నిర్వహించిన సర్వే నివేదికను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి, సంఘం ప్రతినిధి లక్ష్మారెడ్డి విడుదల చేశారు. దానిని సీఎం కేసీఆర్‌కు పంపారు.

*యూటీఎఫ్‌ సూచనలు:*

భౌతిక దూరం పాటించడానికి వసతి సరిపోని పాఠశాలల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా నడపాలి.

* కరోనా ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆన్‌లైన్‌ బోధనను నిర్వహించాలి.

* ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ట్యాబ్‌లు/స్మార్ట్‌ ఫోన్లు ప్రభుత్వమే అందించాలి.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights