రాజకీయ రుషి.నెహ్రూలా నేపథ్యం లేదు… ఇందిరలా బలం లేదు…

IMG-20200628-WA0005.jpg

*రాజకీయ రుషి* *నెహ్రూలా నేపథ్యం లేదు… ఇందిరలా బలం లేదు…* *రాజీవ్‌లా బలగం లేదు… వారసత్వపు ముద్రల్లేవు…* *కుటుంబాల అండల్లేవు… కూటముల సాయం లేదు…* *తను నమ్మింది కృషి… ఆయనో రాజకీయ రుషి…* _బహుముఖ ప్రజ్ఞాశాలి… ఎన్నో భాషల్లో నిష్ణాతుడు… రాజకీయ సోపానంలో ముఖ్యమంత్రిగా… కేంద్రమంత్రిగా… ప్రధానమంత్రిగా… ఏ పదవి చేపట్టినా… ఆయనది మునీశ్వర తత్వమే. కర్మయోగిలా తన పని చేసుకుంటూ వెళ్లడమే ఆయన నైజం. భారత రాజకీయ యవనికపై తనదైన ముద్రవేసి, ప్రగతి ఫలాల కోసం చెట్లు నాటి మనకు అందించిన దార్శనికుడు. స్వతంత్ర భారతావనిని ఆధునిక ప్రపంచంతో అనుసంధానించి… మార్పులు, సంస్కరణలు తెచ్చిన ప్రగతిశీలవాది పీవీ నరసింహారావు._ *తెలుగు కీర్తి.. పాములపర్తి* కాషాయం ధరించి, మహర్షి కావాలనుకున్న ఆయన… అనూహ్య పరిస్థితుల్లో రాజర్షిగా పంచె బిగించి ప్రధానిగా రంగంలోకి దిగారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక అల్లకల్లోల పరిస్థితుల్లో… దేశం దివాళా అంచుల్లో ఉన్నవేళ గుండె జబ్బును సైతం మరచి… దేశానికి సరికొత్త ఊపిరిలూదారు. ఆయనే స్వతంత్ర భారతానికి ఆర్థిక సంస్కరణల ప్రదాత.. పాములపర్తి వెంకట నరసింహారావు! *భారత జాతిని సగౌరవంగా నిలబెట్టి..* తెలుగుఖ్యాతిని దశదిశలా చాటిన మన మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతి వేడుకల ఆరంభ వేళ… ఈ ఆధునిక ఆర్థిక సంస్కర్తను స్మరించుకోవడం జాతి గౌరవాన్ని ఇనుమడింప చేసుకోవడమే. _72 సంవత్సరాల పీవీ నరసింహారావు భారత దేశపు డెంగ్‌ జియావో పింగ్‌. జీవిత చరమాంకంలో ఉన్న ఓ నాయకుడు పాత ప్రభుత్వాలు నడిపిన ఆర్థిక పద్ధతులను పక్కనబెట్టారు. భారత్‌లో బలంగా అల్లుకుపోయిన స్వార్థపరుల వలయాన్ని ఆయన ఛేదించే ప్రయత్నం చేశారు.- *న్యూయార్క్‌ టైమ్స్‌*_ _భారత ఆర్థిక వ్యవస్థకు ఏది మంచిదో అది చేయటానికి నేను అంగీకరిస్తాను. అయితే నా వల్ల ఒక్క కార్మికుడు కూడా ఉద్యోగం కోల్పోయానని చెప్పనంతవరకు మాత్రమే ఇదంతా!! – *ఐఎంఎఫ్‌ డైరెక్టర్‌తో పీవీ*_ *దొరతనాన్ని వదులుకొని..* స్వతహాగా సంక్రమించిన పిత్రార్జితమే బోలెడు. అందునా దత్తత పోవడం ద్వారా కలిసొచ్చిన భూములు వందల ఎకరాలు.. ఇంకేముంది ఆ ఆస్తినంతా చూసుకుంటూ ఆయన దర్జాగా బతకాలన్నది కుటుంబ పెద్దల అభిమతం. కానీ, ఈ ఆస్తులతోపాటే వచ్చిన ‘దొర’ హోదాను పీవీ ముందు నుంచీ ఆకళింపు చేసుకోలేకపోయారు. ఓ మధ్యతరగతి వ్యక్తిగా జీవితాన్ని సాగించడమే ఆయనకు ఇష్టం. ఆ ధోరణినే జీవితాంతం ప్రదర్శించారు. అందుకే 1200 ఎకరాల ఆసామి అయినా.. ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన తర్వాత భూసంస్కరణలు తీసుకొచ్చి పరిమితికిమించి ఉన్న భూమిని వదులుకున్నారు. పుట్టిపెరిగిన పరిస్థితులకు భిన్నంగా కూడా వ్యక్తులు ఎదుగుతారని.. సంపద ఉన్నా దానిపై వ్యామోహం ప్రదర్శించని పీవీ జీవితాన్ని నిశితంగా గమనిస్తే అర్థమవుతుంది. పీవీకి ఇంగ్లాండ్‌ వెళ్లి ఖగోళశాస్త్రం చదవాలన్న ఆసక్తీ ఉండేది. కానీ, డిగ్రీ పూర్తయ్యాక స్వగ్రామానికి తిరిగిరావాలని.. ఆస్తిపాస్తులు చూసుకోవాలనీ నరసింహారావుపై కుటుంబం నుంచి ఒత్తిడి పెరిగింది. ఎంతో మానసిక సంఘర్షణ తర్వాత పీవీ నాగ్‌పుర్‌లో న్యాయశాస్త్రం చదవడానికే మొగ్గు చూపారు. ఆస్తి ఉన్నా.. తాత్కాలిక ఉద్యోగం చేసి వచ్చేదాంతోనే నెలంతా గడిపేవారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights