బంగారం తాకట్టు పెడతామని షాప్‌కొచ్చిన ముగ్గురు మహిళలు.. ఆపై కాసేపటికే

ఇటీవల బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో బంగారం ఆభరణాలను భద్రంగా దాచుకుంటున్నారు. కొంతమంది మాత్రం ఇదే బంగారం ఆభరణాలను అడ్డం పెట్టుకొని ఈజీగా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో అచ్చం ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ముగ్గురు మహిళలు ఏకంగా నకిలీ బంగారాన్ని తాకట్టుపెట్టే ప్రయత్నం చేశారు.
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం రోజు ఒంటి మీద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టేందుకు ముగ్గురు మహిళలు ఆటోలో బుర్కా ధరించి ఒక జ్యువెలరీ షాప్‌నకు వెళ్లారు. తమ వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టాలనుకుంటున్నామని తమకు డబ్బు ఉన్నపలంగా అవసరం పడిందని షాప్ యజమానిని నమ్మించారు. బంగారం తులం లక్షన్నరకు పైగా ఉండటంతో షాప్ యజమాని రూ. 1,70,000 చెల్లిస్తానని ముగ్గురు మహిళలకు చెప్పాడు. ఒప్పుకున్న మహిళలు ఒంటిమీద ఉన్న బంగారాన్ని తీసి షాప్ యజమానికి ఇచ్చారు.
రూ. 1.70 లక్షలకు బదులు రూ. 1.40 లక్షలు మహిళలకు చెల్లించిన షాప్ యజమాని మరో రూ. 30 వేలు ఆన్లైన్‌లో చెల్లిస్తానని చెప్పాడు. దీంతో ముగ్గురు మహిళలు కలిసి ఒక ఫోన్ పే నెంబర్ షాప్ యజమానికి చెప్పగా ఆ నెంబర్‌కు మరో రూ. 30 వేలను షాప్ యజమాని బదిలీ చేశాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ముగ్గురు మహిళలు షాప్ నుంచి వెళ్లిపోయిన తర్వాత బంగారం నకిలీదిగా తేలడంతో షాప్ యజమాని అవాక్కయ్యాడు.
వెంటనే తాను ఆన్లైన్‌లో రూ. 30 వేలు పంపించిన నెంబర్‌కు ప్రయత్నించగా ఆ నెంబర్ స్విచాఫ్ వచ్చింది. మోసపోయానని గ్రహించిన షాప్ యజమాని వెంటనే రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరా దృశ్యాల ద్వారా ముగ్గురు మహిళలను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. మరోవైపు షాప్ యజమాని డబ్బు పంపిన ఫోన్ పే నెంబర్ కూడా ట్రేస్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
