పదవీ విరమణ రోజే ప్రయోజనాలు

IMG-20200915-WA0012.jpg

*పదవీ విరమణ రోజే ప్రయోజనాలు* *అదే రోజు ఉద్యోగులకు సన్మానం* *ప్రభుత్వ వాహనంలో సగౌరవంగా ఇంటికి* *సింగరేణిలో ఖాళీల ఆధారంగా అర్హత మేరకు ఉద్యోగాలు* *తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌* ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ రోజే అన్ని ప్రయోజనాలను అందించి సగౌరవంగా వారిని సన్మానించి ప్రభుత్వ వాహనంలో ఇంటికి చేర్చేలా ప్రత్యేక విధానం తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. సోమవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం మాట్లాడుతూ ప్రభుత్వశాఖల్లో శాఖాధిపతికి సంక్షేమ అధికారి బాధ్యత అప్పగించనున్నట్లు తెలిపారు. పదవీ విరమణ రోజునాటికి ఉద్యోగి స్కేల్‌ ఎంత, ఆరోజు ఎంత వస్తుంది వంటి లెక్కలు పూర్తయి ఉండాలన్నారు. మంత్రిమండలి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. సుమారు 35 నుంచి 40 ఏళ్లు ప్రజాసేవలో ఉన్న ఉద్యోగిని పదవీ విరమణ అనంతరం గౌరవంగా పంపాలన్నారు. ఐటీ రద్దుపై పార్లమెంట్‌లో లేవనెత్తుతాం సింగరేణి కార్మికులు చీకటి సూర్యులని, గనుల్లో పనిచేసేవారికి దినదిన గండంగా ఉంటుందని సీఎం చెప్పారు. వారికి ఆదాయపుపన్ను రద్దు అంశం కేంద్ర పరిధిలో ఉందన్నారు. యూపీఏ, భాజపా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. దీనిపై ప్రధాన మంత్రితో మాట్లాడినపుడు సింగరేణిలో చేస్తే కోల్‌ఇండియాలో కూడా చేయాల్సి వస్తుందని చెప్పారని సీఎం తెలిపారు. పార్లమెంట్‌లో ఎంపీలు సింగరేణి కార్మికుల ఐటీ రద్దుపై పోరాడతారన్నారు. కారుణ్య నియామకాల్లో జనరల్‌ మజ్దూర్‌గా ఉద్యోగాలు పొందేవారిని వారి అర్హతల మేరకు ఖాళీల ప్రాతిపదికగా సంస్థలోని ఇతర పోస్టుల్లో నియమించనున్నట్లు సీఎం తెలిపారు. *ఆరోగ్యపరంగా నంబర్‌ 1 లక్ష్యం: ఈటల* తెలంగాణను ఆరోగ్యపరంగా నంబర్‌1 రాష్ట్రంగా నిలపడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. మాతా శిశుమరణాలు, నవజాత శిశువుల మరణాల రేటు తగ్గించడంలో, వ్యాక్సినేషన్‌లో రాష్ట్రం ముందుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయని.. సిజేరియన్లు తగ్గాయన్నారు. మూడో ప్రసవానికి కేసీఆర్‌ కిట్‌ అభ్యంతరం వాస్తవమే నని, మూడో బిడ్డ కాన్పు, వ్యాక్సిన్‌ వంటివాటికి అభ్యంతరం లేదన్నారు. ఎమ్మెల్యేలు రేఖానాయక్‌, పద్మాదేవేందర్‌రెడ్డి, గొంగిడి సునీత, ఆనంద్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. అన్ని మండల కేంద్రాల్లో గిడ్డంగులు రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో గిడ్డంగులను, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో ఒక కోల్డ్‌స్టోరేజీని నిర్మించనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్‌లు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ వీలైనంత త్వరగా ఈ నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. ఇటీవల నాబార్డ్‌ ఛైర్మన్‌ కూడా సీఎం కేసీఆర్‌తో భేటీ అయినపుడు గిడ్డంగుల నిర్మాణానికి ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో కాకుండా రుణాలిచ్చేందుకు ముందుకువచ్చారన్నారు. *దరఖాస్తు చేసుకునే తేదీనే ప్రామాణికం* సింగరేణిలో కారుణ్య నియామకాల కోసం నిర్వహించే వైద్యమండలి సమావేశం త్వరలో నిర్వహించనున్నట్లు విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఆరు నెలలుగా సమావేశం జరగకపోవడంతో ఉద్యోగాలు పొందే అర్హత కోల్పోతారనే ఆందోళన వద్దని దరఖాస్తు చేసుకున్న తేదీనే ప్రామాణికంగా తీసుకుంటామన్నారు. దరఖాస్తు చేసుకునేనాటికి 35 ఏళ్లు ఉంటే సరిపోతుందన్నారు. ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, కోరుకంటి చందర్‌, దివాకర్‌రావు, చిన్నయలు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. *ట్రాఫిక్‌ పోలీసులకు 30% అదనపు వేతనం* ట్రాఫిక్‌లో విధులు నిర్వహించే పోలీసులకు 30 శాతం వేతనం అదనంగా ఇవ్వడంతో పాటు వారికి ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుంటోందని హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ శాసనసభలో తెలిపారు. *నాగులు కుటుంబాన్ని ఆదుకోవాలి: సీతక్క* శాసనసభ ముందు ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడి అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందిన నాగులు కుటుంబానికి ప్రభుత్వం సాయం అందించాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క కోరారు. శాసనసభ జీరో అవర్‌లో మాట్లాడారు. కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకోవాలన్నారు. *కొత్త రెవెన్యూ చట్టంతో అన్నివర్గాలకు మేలు: గుత్తా* ఈనాడు, హైదరాబాద్‌: కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అభినందించారు. సోమవారం మండలిలో చట్టం ఏకగ్రీవంగా ఆమోదం పొందిన అనంతరం సభను వాయిదా వేసిన గుత్తా.. సీఎంను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఇది అద్భుతమైన చట్టమనీ, రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేస్తుందనీ అభివర్ణించారు. ఆయన వెంట మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌ ఉన్నారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights