శ్రీనివాస గౌడ: ఉసేన్ బోల్ట్‌ను మించిన వేగంతో ఈ రైతుబిడ్డ పరిగెత్తాడా?

కర్నాటకకు చెందిన శ్రీనివాస గౌడ భవన నిర్మాణ కార్మికుడు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన అథ్లెట్ ఉసేన్ బోల్ట్‌తో ఇప్పుడు ఆయన్ను అందరూ పోల్చుతున్నారు.
దక్షిణ కర్నాటకలో ఏటా కంబళ అనే పోటీ జరుగుతుంది. ఇందులో దున్నపోతులను పరుగెత్తిస్తారు. దున్నలతో పాటు వాటిని తోలుతూ మనుషులు కూడా పరుగెత్తుతారు.
ఇటీవల ఓ కంబళ పోటీలో 142.4 మీటర్ల దూరం పరుగును దున్నలతో కలిసి శ్రీనివాస గౌడ 13.42 సెకన్లలో పూర్తి చేశారు. ఈలెక్కన ఇతను 100 మీటర్ల దూరాన్ని 9.55 సెకన్లలో పరుగెత్తినట్లు, ఉసేన్ బోల్ట్ కంటే 0.3 సెకన్ల వేగంగా పరుగెత్తినట్లు కొన్ని మీడియా కథనాల్లో పేర్కొన్నారు.
100 మీటర్ల పరుగును పూర్తి చేసేందుకు బోల్ట్‌కు పట్టిన సమయం 9.58 సెకన్లు. ప్రస్తుతం ఇదే ప్రపంచ రికార్డు.
దీంతో, శ్రీనివాస గౌడ ప్రదర్శనను బోల్ట్ రికార్డుతో పోల్చుతూ చాలా దినపత్రికలు కథనాలు రాశాయి. చాలా మంది సోషల్ మీడియాలోనూ ఈ తరహా పోస్ట్‌లు పెట్టారు.
కంబళను నిర్వహించే సంస్థ మాత్రం ఈ పోలిక పెట్టొద్దని అంటోంది.
”మేం ఎలాంటి పోలికలకూ పోదల్చుకోలేదు. ఒలింపిక్స్‌లో వేగం కొలిచేందుకు మెరుగైన సాంకేతికత, ఎలక్ట్రానిక్ పరికరాలు వాడుతారు” అని కంబళ అకాడమీ ప్రొఫెసర్ కే.గుణపాల కాదంబ బీబీసీతో చెప్పారు.
ఒక చేత్తో దున్నపోతుల్ని కట్టేసిన తాడును పట్టుకుని, మరొక చేత్తో దున్నల్ని మలేసే కర్ర పట్టుకుని.. దున్నల్ని తోలేవాళ్లు ఈ పోటీలో పాల్గొంటారు. కొందరు దున్నపోతులతో పాటు పరుగెత్తితే, మరికొందరు వాటికి కట్టిన కర్ర పీటపై నిలబడతారు.
శ్రీనివాస గౌడ మాత్రం తాడు, కర్ర పట్టుకుని దున్నలతో పరుగెత్తాడు.
దున్నల వేగం వాటి తాడును పట్టుకుని పరుగెత్తే మనిషికి అదనపు వేగాన్ని ఇస్తుందని కొందరు అంటున్నారు.
అయితే, ఉసేన్ బోల్ట్ లాంటి అథ్లెట్‌లు ఒలింపిక్ స్టేడియంల్లో మన్నికైన ట్రాక్‌లపైన పరుగెత్తితే.. శ్రీనివాస గౌడ బురద, నీళ్లలో పరుగెత్తాడని ఇంకొందరు సమర్థిస్తున్నారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
