ఎయిరిండియా రేసులో టాటా గ్రూప్‌

0

*ఎయిరిండియా రేసులో టాటా గ్రూప్‌* దిల్లీ: నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్‌ ముందుకొచ్చింది.

ఎయిరిండియా కొనుగోలుకు ఆసక్తికర వ్యక్తీకరణ (ఈవోఐ) బిడ్‌ను దాఖలు చేసింది.

ఈవోఐకు సోమవారం సాయంత్రం 5 గంటల వరకు గడువు నిర్దేశించిన నేపథ్యంలో చివరి రోజున టాటా సన్స్‌ ఈవోఐను దాఖలు చేసింది.

బిడ్‌ అర్హత సాధిస్తే రానున్న 15 రోజుల్లో ఫైనాన్షియల్‌ బిడ్‌ను సమర్పించే అవకాశం ఉంది.  ఇప్పటికే సింగపూర్‌తో కలిసి విస్తారాను, మలేసియాకు చెందిన ఎయిరేషియా భాగస్వామ్యంతో ఎయిరేషియా ఇండియా విమానాలను టాటా గ్రూప్‌ నడుపుతోంది. ఈ నేపథ్యంలో ఎయిరిండియా కొనుగోలుకు ఒంటరిగానే వెళుతుందా..? భాగస్వామితో కలిసి కొనుగోలు చేస్తుందా? అనే విషయం తెలియరాలేదు.

దీనిపై స్పందించేందుకు టాటా ప్రతినిధులు నిరాకరించారు.

ప్రస్తుత ఎయిరిండియాను 1932లో టాటా ఎయిర్‌లైన్స్‌ పేరిట టాటా గ్రూప్‌ నెలకొల్పింది.

1946లో అది ఎయిరిండియాగా మారింది. 1953లో ప్రభుత్వపరం అయ్యింది. సరిగ్గా 67 ఏళ్ల తర్వాత మళ్లీ అదే ఎయిర్‌లైన్స్‌ను టాటా సన్స్‌ కొనుగోలుకు ముందుకు రావడం గమనార్హం. 

మరోవైపు ఎయిరిండియా బిడ్డింగ్‌ చివరి రోజు కావడంతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకొంటున్నాయి. ఎయిరిండియాకు చెందిన 209 మంది ఉద్యోగుల గ్రూప్‌ 51శాతం వాటాను కొనుగోలు చేయడానికి తన ఆసక్తిని వ్యక్తం చేసింది.

ఈ బిడ్‌కు ప్రస్తుత ఎయిరిండియా కమర్షియల్‌ డైరెక్టర్‌ మీనాక్షీ మల్లిక్‌ నేతృత్వం వహిస్తున్నారు.

ఈ విషయాన్ని ఆమె ధ్రువీకరించారు. ఎయిరిండియాను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రం..

2018లో ఓసారి బిడ్లు ఆహ్వానించినప్పటికీ ఒక్క కంపెనీ కూడా ముందుకు రాలేదు. దీంతో తాజాగా మరోసారి ఆసక్తి వ్యక్తీకరణకు ఆహ్వానించారు.

Leave a Reply