Telangana: హైదరాబాద్‌లోని సమస్యలపై దృష్టిపెట్టిన సీఎం.. వైద్యం, రోడ్డు రవాణా సహా పలు విషయాలపై సమీక్ష

cm-revanth-reddy-3

ఇంతకుముందో లెక్క… ఇప్పుడో లెక్క…! రోజులుమారాయ్…! పాత పద్దతిలో వెళ్తానంటే అస్సలు కుదరదు…! ప్రతిరోజూ అప్‌డేట్‌ అవ్వాల్సిందే…! అందివస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిందే…! స్మార్ట్‌ వర్క్‌తో ముందుకెళ్లాల్సిందే అంటూ… అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. పలు కీలక అంశాలపై రివ్యూ చేసిన ఆయన… టెక్నాలజీని వాడుకుంటూ ప్రజానీకానికి అత్యుత్తమ సేవలందించాలన్నారు.

టీజీ… అంటే టెక్నాలజీ అనేలా ముందుకెళ్లాలన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. రైజింగ్‌ హైదరాబాద్‌ను గ్లోబల్‌ సిటీకి చిరునామాగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మానవ జీవన ప్రమాణాలకు కొలమానమైన విద్య, వైద్యం, రోడ్డు రవాణా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పారిశుద్ధ్యం సహా పలు కీలక అంశాలపై సమీక్ష చేసిన సీఎం… అన్ని విభాగాల ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు.

ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ పోలీసింగ్ విధానం

సిటీలో గంటల కొద్దీ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ స్టడీ జరగాలని, ట్రాఫిక్ నియంత్రణ సమర్థంగా జరిగేందుకు అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు సీఎం. సిటిలో ఉన్న అన్ని జంక్షన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయాలని చెప్పారు. గూగుల్ సహకారంతో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించే ప్రణాళిక వెంటనే అమలు చేయాలని సీఎం పోలీసు విభాగాన్ని ఆదేశించారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలన్నారు. వెంటనే డ్రోన్లను కొనుగోలు చేయాలన్నారు. ఇక సిటీలో వర్షం పడితే ట్రాఫిక్ గంటల కొద్దీ ఆగిపోతుందని, జంక్షన్లలో నీళ్లు నిల్వకుండా వాటర్ హార్వెస్టింగ్ వెల్స్‌ను నిర్మించాలన్నారు.

సిటీలో డ్రైనేజీ, మ్యాన్ హోల్స్ క్లీనింగ్‌కి రోబోలను వాడాలని… యంత్ర పరికరాలతోనే క్లీనింగ్‌ జరగాలని సీఎం ఆదేశించారు. సిటీలో నాలాలు, కుంటలు, చెరువుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలన్న సీఎం… నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను కాపాడేందుకు డిజిటల్ ల్యాండ్ డేటాబేస్ విధానం అమలు చేయాలన్నారు.

పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్‌, స్నాక్స్‌తో పాటు ట్రాన్స్‌పోర్ట్ అందించాలని సూచన

కోర్ అర్బన్ సిటీ డెవలప్‌మెంట్‌లో భాగంగా ప్రాథమిక విద్యను అందరికీ అందించే సంస్కరణలు ముందుగా అమలు చేయాలన్నారు సీఎం. జీహెచ్ఎంసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఉన్న ప్రభుత్వ ప్ర్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, కాలేజీలన్నింటినీ గుర్తించాలన్నారు. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు, 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, 9వ తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ వరకు మూడు కేటగిరీలుగా నాణ్యమైన విద్యను అందరికీ అందించాలన్నారు. అలాగే పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, స్నాక్స్ కూడా స్కూల్లోనే ఇస్తూ… ప్రభుత్వం తరఫున ట్రాన్సోపోర్ట్ అందించాలన్నారు. దీంతో పేద, మధ్యతరగతి తల్లిదండ్రులపై ఫీజుల భారం తగ్గుతుందని, ప్రభుత్వం అందించే నాణ్యమైన విద్య పిల్లల భవితకు దోహదపడుతుందన్నారు.

పార్క్‌లను అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశాలు

సిటీలో ఉన్న పార్కులన్నింటినీ పిల్లలను ఆకట్టుకునేలా, వారికి ఆహ్లాదంగా ఉండేలా అభివృద్ధి చేయాలని సీఎం అన్నారు. ఇప్పుడున్న పార్కులన్నీ సీనియర్ సిటిజన్లకు, వాకర్లకు పనికొచ్చేవిగా మారిపోయాయని అన్నారు. అన్ని పార్కుల్లో చిల్డ్రన్ జోన్ తో పాటు పిల్లల ఆటపాటలకు వీలుగా ఆకట్టుకునే ప్లే జోన్లను అభివృద్ధి చేయాలన్నారు.

మరీ ముఖ్యంగా హైదరాబాద్‌ను డ్రగ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు కఠిన చర్యలు అమలు చేయాలని సీఎం ఆదేశించారు. డ్రగ్స్, గంజాయి సేవించి పట్టుబడితే బాధితులగా చూడవద్దని, కనీసం పది రోజుల పాటు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచాలని సీఎం అన్నారు. చర్లపల్లి జైలు ప్రాంగణంలోనే రీహాబిలిటేషన్ సెంటర్ నిర్మించాలని అన్నారు. సెంటర్ నిర్వహణ, పర్యవేక్షణకు ఎక్స్ మిలిటరీ అధికారుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు సీఎం. మొత్తంగా… టెక్నాలజీని వాడుకుంటూ స్మార్ట్‌ వర్క్‌ చేయాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights