Telangana: రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. భారీగా నిధుల విడుదల.. ఏకంగా ఒకేసారి..

తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. తెలంగాణ రైజింగ్ విజన్ 2027లో భాగంగా పట్టణాలను గ్రోత్ హబ్‌లుగా మార్చే లక్ష్యంతో ఈ నిధులను కేటాయించారు. కొత్త మున్సిపాలిటీలకు రూ.15 కోట్లు, విలీన గ్రామాలున్న మున్సిపాలిటీలకు రూ. 20 కోట్లు చొప్పున ఇవ్వనున్నారు. మొత్తం 2,432 పనులను మార్చి 2026 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. పట్టణాల అభివృద్ధికి రేవంత్ సర్కార్ భారీగా నిధులు కేటాయించింది. పట్టణాభివృద్ధికి ప్రోత్సాహం ఇచ్చే విధంగా ప్రభుత్వం ఏకంగా రూ. 2,780 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో పట్టణాలు, నగరాల్లో పౌర మౌలిక సదుపాయాలను బలోపేతం చేసి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా 2,432 అభివృద్ధి పనులను చేపట్టనున్నారు.
నిధుల కేటాయింపులో ప్రాధాన్యత
ఈ నిధుల కేటాయింపులో ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీలు, విలీన గ్రామాలు ఉన్న ప్రాంతాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. కేటాయింపుల వివరాలు ఇలా ఉన్నాయి..
- ప్రతి కొత్త మున్సిపాలిటీకి: రూ. 15 కోట్లు
- విలీన గ్రామాలతో ఉన్న మున్సిపాలిటీలకు: రూ. 20 కోట్లు
- పాత మున్సిపాలిటీలకు: రూ. 15 కోట్లు
- కొత్త కార్పొరేషన్లకు: రూ. 30 కోట్లు
- యూఐడీఎఫ్ నగరాభివృద్ధి నిధుల నుంచి ఈ ఆర్థిక సాయం మున్సిపాలిటీలకు అందనుంది.
విజన్ 2027
తెలంగాణ రైజింగ్ విజన్ 2027లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్‌కు బయట ఉన్న పట్టణాలు, గ్రోత్ హబ్‌లుగా మార్చడానికి ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక ప్రణాళికను రూపొందించింది. ఈ ప్రాంతాల్లో వేగవంతమైన పట్టణీకరణ, పెరుగుతున్న జనాభా డిమాండ్‌లను దృష్టిలో ఉంచుకుని పనులను చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నిధులను తక్షణమే విడుదల చేయాలని, ఆలస్యం లేకుండా టెండర్ ప్రక్రియను ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. అయితే ఈ నిధుల కేటాయింపు నుంచి గ్రేటర్ హైదరాబాద్ కోర్ అర్బన్ సిటీని మినహాయించారు. ఈ పనులన్నింటినీ 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని గడువు విధించారు.
విడుదలైన నిధులను పట్టణ ప్రాంతాల్లోని కీలక మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించనున్నారు. వాటిలో ప్రధానంగా..
- పట్టణాల్లో రోడ్ల నిర్మాణం
- డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల
- పార్కులు, కల్వర్టుల నిర్మాణం
- డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రాంతాల్లో నివసించేవారికి ప్రాథమిక సదుపాయాల ఏర్పాటుకు నిధులు కేటాయించారు.
మున్సిపల్ శాఖ ఈ నిధుల వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రాధాన్యత క్రమంలో రూపొందిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్టణ ప్రాంతాల అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడానికి దోహదపడుతుందని ఆశిస్తున్నారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
