ఖమ్మం ఆర్టీసీ కార్మికుడి అంత్య క్రియలు ముగియక ముందే హైదరాబాద్‌లో మరో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. మెదక్‌లో మరో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మరింత ఉద్ధృతమవుతోంది. శనివారం ఖమ్మంలో ఆత్మహత్యాయత్నం చేసిన డ్రైవర్ శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. ఆయన తుదిశ్వాస విడిచిన కొద్ది గంటల్లోనే ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో కండక్టర్ సురేందర్‌గౌడ్ తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాణిగంజ్ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న సురేందర్ గౌడ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమ్మెకు జ్వరం కారణంగా వారం రోజులు సెలవులో ఉన్న సురేందర్.. గత నాలుగు రోజులుగా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. డ్రైవర్ శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యాయత్నం విషయం తెలిసి తీవ్రంగా కలతచెందారు.
ఏడాది కిందట కుమార్తెకు వివాహం చేసిన సురేందర్‌గౌడ్.. ఇందుకు స్టేట్ బ్యాంక్ నుంచి రూ.10 లక్షలు రుణం తీసుకున్నాడు. ప్రతినెల వచ్చిన జీతంతో వాయిదాలు చెల్లిస్తుండగా, సెప్టెంబరు మాసం వేతనం ప్రభుత్వం చెల్లించకపోవడంతో చెక్కు బౌన్స్ అయ్యింది. ఈ మేరకు బ్యాంకు నుంచి మెసేజ్ వచ్చిందని, రుణం ఎలా తీర్చాలనే ఆందోళనకు గురైనట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సురేందర్‌గౌడ్ ఉద్యోగం పోయింది. దీంతో మనస్తాపం చెందిన సురేందర్‌గౌడ్ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
మెదక్ జిల్లా నర్సంపేటలో ఒక డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. తోటి కార్మికులు, పోలీసులు ఆయనను నిలువరించారు. శ్రీనివాసరెడ్డి మరణంతో ఖమ్మం రీజియన్‌లో ఒక్క బస్సూ తిరగలేదు. సమ్మె చేస్తున్న కార్మికులకు వేతనాలు ఇచ్చే వరకు తాము కూడా జీతాలు తీసుకోవద్దని నల్గొండ, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్లలోని ఆర్టీసీ అధికారులు, భద్రత సిబ్బంది నిర్ణయం తీసుకున్నారు.
వారి నిర్ణయంపై ఆర్టీసీ ఐకాస హర్షం వ్యక్తం చేసింది. తమకు గొప్ప మద్దతు ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపింది. సమ్మెకు పలు రెవెన్యూ సంఘాలూ మద్దతు ప్రకటించాయి. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఆదివారం ఏపీఎస్ ఆర్టీసీ ఐకాస ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని డిపోల వద్ద ధర్నా నిర్వహించారు. దీంతో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏ పరిస్థితులకు దారి తీస్తుందోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.