Telangana: ఘరానా దొంగ బిర్యానీ పాషా అరెస్ట్.. 50 చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు గుర్తింపు

thief-biryani-pasha-arrested

బిర్యానీ పాషా… కేరాఫ్ చోరీల బాద్షా. తాళం వేసి ఉన్న ఇళ్లు కనపడిందా అంతే సంగతలు. కన్నం వేయడం అందినకాడికి దోచుకోవడం తాపీగా కొన్నాళ్లు ఎంజాయ్ చేయడం ఆయనకు ఓ హాబీ. ఆ సొత్తు అయిపోయిందా మళ్లీ ఇంకో ఇంటికి కన్నం వేయడం ఘరానా దొంగ నైజం. ఇప్పటికే అనేక మార్లు జైలుకు వెళ్లివచ్చినా… చోరకళను మాత్రం వీడడం లేదు. ఈ చోరీల బాద్షాకు బిర్యానీ అంటే మహా ఇష్టం… మూడు పూటల పెట్టిన వద్దనకుండా లాగించేస్తాడు. అందుకే పోలీసులు సైతం బిర్యానీ పెట్టే పాషా నుంచి నిజాలు కక్కిస్తారట.

పాలమూరు జిల్లా పోలీసులు ఎట్టకేలకు ఓ గజదొంగ ఆట కట్టించారు. వరుస చోరీలకు పాల్పడుతూ ఖాకీల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న బిర్యానీ పాషా అలియాస్ చోరీల బాద్షా ను అరెస్టు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన ఈ ఘరానా దొంగ బిర్యానీ పాషా అసలు పేరు మహమూద్ పాషా. ఇతగాడికి ఇద్దరు భార్యలు, వృత్తి కారు డ్రైవర్… ప్రవృత్తి రాత్రిళ్లు చోరీలు చేయడం. ఇలా సుమారు 50 చోరీ కేసుల్లో నిందితుడుగా ఉన్నట్లు పోలీసుల సమాచారం.

గత నెల 29న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం బాలాజీనగర్ లోని ఓ నివాసంలో చోరీ జరిగింది. 4 కిలోల వెండి, రూ. 20వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. కేసును సవాల్ గా తీసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలు పరిశీలించగా దొంగ కారులో వచ్చి చోరీ చేసినట్లు గుర్తించారు. అలెర్ట్ అయిన పోలీసులు అనుమానాస్పదంగా తిరిగే కార్లు, వ్యక్తులపై నిఘా పెట్టారు. అందులో భాగంగా ఈ నెల 9వ తేదిన జిల్లా కేంద్రంలోని ట్యాంక్ బండ్ పై ఓ కారు స్థానికులకు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో వన్ టౌన్ పీఎస్ కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు కారు వద్దకు చేరుకున్నారు. ఇంతలోనే పోలీసుల రాకను గమనించిన కారులో ఉన్న బిర్యానీ పాషా పారిపోయే ప్రయత్నం చేశాడు. అలెర్ట్ అయిన ఖాకీలు బిర్యానీ పాషా ను పట్టుకున్నారు.

అనంతరం కారులో మొత్తం సోదాలు చేయగా… పెద్ద మొత్తంలో వెండి వస్తువులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత పీఎస్ కు తరలించి విచారించగా మహబూబ్ నగర్ రూరల్ పీఎస్ పరిధిలో 5, వన్ టౌన్ పరిధిలో 1, టూటౌన్ పరిధిలో 2, దేవరకద్ర పరిధిలో 2 కేసుల్లో నిందితుడిగా తేల్చారు. నిందితుడు బిర్యానీ పాషా వద్ద నుంచి 7కిలోల వెండి వస్తువులు, 43గ్రాముల బంగారు అభరణాలు, రూ.26,600 నగదు, చోరీలకు ఉపయోగించే కారును స్వాధీనం చేసుకున్నారు.

అలాగే గతంలో బిర్యానీ పాషాపై 40 కేసులు ఉన్నట్లు తెలిసింది. ఆ మధ్య ఓ రోడ్డు ప్రమాదంలో కాలుకు గాయం కావడంతో కొన్నాళ్ల పాటు చోరీలకు చిన్న విరామం ప్రకటించాడు. ఇటీవలే గాయం నుంచి కోలుకోవడంతో మళ్లీ చోరీల బాట పట్టాడు. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ జిల్లాలో ప్రాంతాల్లో రాత్రిళ్లు తాళం వేసిన ఇళ్లకు కన్నం వేసి చోరీలకు పాల్పడుతున్నాడు. చోరీ చేసిన సొత్తున ఉదయం వ్యాపారులకు అమ్మి జల్సాలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలింది. అయితే చోరీ చేసిన సొత్తును అమ్మేందుకు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి వచ్చి పోలీసులకు బుక్ అయ్యాడు బిర్యానీ పాషా.

బిర్యానీ అంటే ఈ ఘరాన దొంగకు చాల ఇష్టం. మూడు పూటల బిర్యానీ తింటాడట. అందుకే మహమూద్ పాషా కాస్త బిర్యానీ పాషా అయ్యాడట. అంతేకాదు తాజగా పోలీసులకు చిక్కే కంటే ముందు జిల్లా కేంద్రంలోని ఓ హోటల్ లో బిర్యానీ లాగించి… ట్యాంక్ బండ్ పై కారు నిలిపి నిద్రించాడట. అనేక చోరీ కేసుల్లో పట్టుబడినప్పుడు పాషా కు బిర్యానీ తినిపించి చోరీల నిజాలు కక్కించేవారట పోలీసులు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights