Trump: 7 నెలల్లో 7 యుద్ధాలను ఆపేసిన .. మరోసారి ట్రంప్ సెల్ఫ్ డబ్బా

భారత్-పాక్ యుద్ధం ఒక్కటే కాదు… కేవలం 7 నెలల్లోనే ఏడు యుద్దాలను ఆపిన ఘనత తనదే అంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు ట్రంప్. గతంలో ఏ దేశ అధ్యక్షుడు, ప్రధాని ఇలాంటి పనిచేయలేదని తనకు తానే కితాబిచ్చుకున్నారు. ఐక్యరాజ్యసమితి చేయాల్సిన పనులు తాను చేస్తునట్టు తెలిపారు.
బిల్డప్ ఇచ్చుకోవడంలో, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తర్వాతే ఎవరైనా.. ఇప్పటికే టారీఫ్‌లతో వివిధ దేశాలపై విరుచుకపడుతున్న ట్రంప్.. ఇండియా పాకిస్థాన్ యుద్ధం తానే ఆపనంటూ ఎన్నోసార్లు చెప్పుకున్నారు. తాజాగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ట్రంప్ మరోసారి ప్రగల్భాలు పలికారు. కేవలం ఏడు నెలల్లోనే తాను ఏడు యుద్ధాలను ముగించానని ప్రపంచ నాయకుల ముందు ప్రకటించారు. ఈ జాబితాలో భారత్ – పాక్ యుద్ధం కూడా ఉందని ఆయన అన్నారు. అయితే ట్రంప్ వాదనలను ఇప్పటికే భారత్ తీవ్రంగా ఖండించింది.
ఆ యుద్దాలు ఇవేనట..
‘‘కేవలం 7 నెలల్లో నేను 7 పెద్ద యుద్ధాలను ముగించాను. వాటిలో కొన్ని 31 నుంచి 36 సంవత్సరాల పాటు కొనసాగాయి. వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఈ యుద్ధాలను ముగించడం నా గొప్ప విజయం’’ అని ట్రంప్ అన్నారు. ఈ సందర్భంగా కంబోడియా-థాయిలాండ్, సెర్బియా, కాంగో-రువాండా, పాకిస్తాన్-భారత్, ఇజ్రాయెల్-ఇరాన్, ఈజిప్ట్-ఇథియోపియా, అర్మేనియా-అజర్‌బైజాన్ ఘర్షణలను ప్రస్తావించారు.
భారత్-పాక్ మధ్యవర్తిత్వ వాదన
నోబెల్ బహుమతి పొందాలనే తన కోరికను పలుమార్లు వ్యక్తం చేసిన ట్రంప్.. మేలో భారత్ – పాక్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడంలో తన కీలక పాత్ర ఉందని అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేయడంతో రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆ సమయంలో మే 10న వాషింగ్టన్ మధ్యవర్తిత్వం తర్వాత కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయని ట్రంప్ ప్రకటించారు. తాజాగా ఐక్యరాజ్యసమితిలో కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు.
భారత్, పాక్ స్పందన
ట్రంప్ వాదనలను భారత్ గట్టిగా ఖండించింది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం విదేశీ ప్రమేయం లేకుండా కేవలం రెండు సైన్యాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ద్వారా కుదిరిందని భారత్ స్పష్టం చేసింది. ఈ నెలలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా భారత్ వైఖరిని సమర్థించారు. ద్వైపాక్షిక సమస్యలపై భారత్ ఎప్పుడూ మూడవ పక్షం మధ్యవర్తిత్వానికి అంగీకరించలేదని ఆయన అన్నారు.
ఐక్యరాజ్యసమితిపై విమర్శలు
ఏడు యుద్ధాలను ముగించానని చెప్పుకున్న ట్రంప్, అదే సమయంలో ఐక్యరాజ్యసమితిపై తీవ్ర విమర్శలు చేశారు. “ఐక్యరాజ్యసమితి చేయాల్సిన పనులు నేను చేయాల్సి రావడం చాలా బాధాకరం. ఈ యుద్ధాలను ముగించడానికి ఐక్యరాజ్యసమితి ఏమాత్రం ప్రయత్నించలేదు. నేను ఏడు యుద్ధాలను ముగించినప్పుడు, ఐక్యరాజ్యసమితి నుండి కనీసం ఒక ఫోన్ కాల్ కూడా రాలేదు” అని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. చర్చలు సులభం కాదని, కాని సమస్యపై దృష్టి పెడితే పరిష్కారం లభిస్తుందన్నారు. ఇంతా చేస్తుంటే తనకు నోబెల్ బహుమతి ఎందుకు ఇవ్వరని ట్రంప్ అంటున్నారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
