February 15, 2026

‘రష్యా-ఉక్రెయిన్‌ కాల్పుల విరమణకు అంగీకరించాయ్.. ఇదంతా నేనే చేశా’ మళ్లీ అదే రాగం అందుకున్న ట్రంప్‌ అంకుల్

trump-putin-phone-call

Trump-Putin Phone Call: ఉక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గించేలా ట్రంప్‌ చర్చలు జరిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో రెండు గంటల పాటు ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్‌.. రష్యా, ఉక్రెయిన్ వెంటనే కాల్పుల విరమణ కోసం చర్చలు వెంటనే ప్రారంభమవెతాయని ప్రకటించారు. ఈ మేరకు ట్రంప్‌ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు..

 

వాషింగ్టన్, మే 20: భారత్, పాక్‌ మధ్య వేలు పెట్టి అబాసుపాలైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్, రష్యా మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గించేలా ట్రంప్‌ చర్చలు జరిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో రెండు గంటల పాటు ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్‌.. రష్యా, ఉక్రెయిన్ వెంటనే కాల్పుల విరమణ కోసం చర్చలు వెంటనే ప్రారంభమవెతాయని ప్రకటించారు. ఈ మేరకు ట్రంప్‌ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో తన సంభాషణ చాలా బాగా సాగిందని ట్రంప్‌ అభివర్ణించారు. పుతిన్‌తోసాగిన చర్చలు ‘యుద్ధం ముగింపు’కు ఓ ముఖ్యమైన ముందడుగుగా చెప్పుకొచ్చారు. ద్వైపాక్షిక చర్చలు జరిపామని, రెండు పార్టీల మధ్య నేరుగా కాల్పుల విరమణ దిశగా చర్చలు సాగినట్లు ట్రంప్‌ చెప్పారు. ఇదే ముందుకు వెళ్ళే ఏకైక మార్గం అని ఆయన అన్నారు.

సోమవారం (మే 19) పుతిన్‌తో 2 గంటల ఫోన్‌లో మాట్లాడిన తర్వాత.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ, యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్‌లతో ట్రంప్‌ కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు వెంటనే ప్రారంభమవుతాయని ఈ కాన్ఫరెన్స్ కాల్‌ ద్వారా యూరోపియన్ నాయకులతో ట్రంప్ అన్నారు. వాటికన్ సైతం చర్చలను నిర్వహించడానికి ఆసక్తి చూపుతున్నట్లు ట్రంప్‌ తెలిపారు. పుతిన్‌ ఫోన్ కాల్‌ మాట్లాడిన తీరుకు ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు.

భౌగోళిక రాజకీయాలన్నింటిలోకి వాణిజ్యాన్ని తీసుకువస్తానని గొప్పలు చెప్పుకుంటున్న డొనాల్డ్ ట్రంప్.. మరోమారు ఈ విషయాన్ని ప్రస్తావించడానికి రష్యా-ఉక్రెయిన్‌ సీస్‌ఫైర్‌ను వాడేసుకున్నారు. ఈ యుద్ధంకు ముగింపు పలకడం ద్వారా రష్యా అమెరికాతో పెద్ద ఎత్తున వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తుందని తాను బావిస్తున్నట్లు ట్రంప్‌ అన్నారు. యుద్ధ వ్యయం, దానిపై విధించిన ఆంక్షల నుంచి ఉత్పన్నమయ్యే ఆర్థిక వనరులను కోల్పోయిన రష్యాకు.. దేశంలో భారీ మొత్తంలో ఉద్యోగాలు, సంపదను సృష్టించడానికి ఆహ్వానం పలుకుతున్నట్లు ఆయన అన్నారు. అమెరికా-రష్యా వాణిజ్యానికి ఉన్న అవకాశాలు అపరిమితమని ఆయన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇక ఉక్రెయిన్ గురించి కూడా ట్రంప్‌ సరిగ్గా ఇదే విధమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉక్రెయిన్ తన దేశాన్ని పునర్నిర్మించే ప్రక్రియలో వాణిజ్యంలో గొప్ప లబ్ధిదారుడిగా ఉంటుందని ట్రంప్‌ చెప్పుకొచ్చారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading