Vizag Google: విశాఖలో దేశంలోనే తొలి గూగుల్ ఎఐ హబ్.. అందరి చూపు వైజాగ్ వైపే

google-ai-hub-visakhapatnam

కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారబోతున్నాయి. రాష్ట్ర భవిష్యత్తును మలుపుతిప్పే అతిపెద్ద ప్రాజెక్టుకు మంగళవారం ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదర్చుకోనుంది. ఈ ఒప్పందంలో భాగంగా విశాఖపట్నంలో దేశంలోనే తొలి కృత్రిమ మేధస్సు (AI) కేంద్రాన్ని “గూగుల్ ఏఐ హబ్” పేరుతో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

విశాఖలో పది బిలియన్ అమెరికన్ డాలర్ల (సుమారు రూ.87,250)తో గూగుల్ 1 గిగావాట్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్‌ ఏర్పాటుకు సంబంధించి మంగళవారం ఢిల్లీలో ఎంఓయుపై సంతకాలు చేయనున్నారు. న్యూఢిల్లీలోని మాన్ సింగ్ హోటల్ లో మంగళవారం ఉదయం 10గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎపి ప్రభుత్వ ప్రతినిధులు, గూగుల్ ఉన్నతస్థాయి బృందం ఎంఓయుపై సంతకాలు చేయనున్నారు.

విశాఖలో 1 గిగావాట్‌ సామర్థ్యంతో ఏర్పాటు కానున్న డేటా సెంటర్‌.. ఆసియాలోనే గూగుల్ సంస్థకు అతిపెద్ద డేటా సెంటర్‌ గా నిలవనుంది. అమెరికా వెలుపల గూగుల్ ఏర్పాటు చేస్తున్న ఈ అతిపెద్ద డేటా సెంటర్, గూగుల్‌ క్లౌడ్, ఏఐ వర్క్, సెర్చ్, యూట్యూబ్ వంటి వాటి కోసం ఉపయోగపనుంది. ఈ డేటా సెంటర్ అందుబాటులోకి వస్తే పరిశ్రమలు, అంకుర పరిశ్రమలు, ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు అందుబాటులో కి రానున్నాయి.

గూగుల్‌తో ప్రభుత్వం చేసుకునే ఈ ఒప్పందం ఏపీని ఏఐ ఆధారిత ఆవిష్కరణలు, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో దేశంలోనే అగ్రగామిగా నిలపడంలో కీలకం కానుంది. గతేడాది అక్టోబరు 31వ తేదీన అమెరికా పర్యటన సందర్భంగా శాన్‌ ఫ్రాన్సిస్కోలో గూగుల్‌ క్లౌడ్‌ సీఈవో థామస్‌ కురియన్‌తో జరిపిన చర్చల్లో డేటా సెంటర్ ప్రాజెక్టును మంత్రి లోకేష్ ప్రతిపాదించారు.

ఈ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖపట్నం ఇకపై AI సిటీగా మారనుంది. డేటా సెంటర్‌ ద్వారా భారత్‌లో ఏఐ ఆధారిత ట్రాన్స్‌ఫర్మేషన్‌ను గూగుల్ సంస్థ వేగవంతం చేయనుంది. గూగుల్‌ గ్లోబల్‌ నెట్‌వర్క్‌తో సముద్ర గర్భ, భూభాగపు కేబుల్‌ కనెక్టివిటీ ద్వారా అనుసంధానించి, క్లీన్‌ ఎనర్జీతో పనిచేసే విధంగా ప్రాజెక్టును రూపకల్పన చేయబడింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అంచనా ప్రకారం, ఈ ప్రాజెక్ట్ 2028–2032 కాలంలో సగటున సంవత్సరానికి రూ.10,518 కోట్ల జీఎస్‌డీపీ వాటాతోపాటు సుమారు 1,88,220 ఉద్యోగాలను సృష్టిస్తుంది. గూగుల్ క్లౌడ్ ఆధారిత ఉత్పత్తుల ద్వారా సంవత్సరానికి రూ.9,553 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుంది. మొత్తం ఐదేళ్ళలో సుమారు రూ.47,720 కోట్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోనుందని అంచనా వేస్తున్నారు.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights