February 26, 2026

1000 మంది పురుషులకు 1049 మహిళలు

IMG-20201213-WA0045.jpg

*1000 మంది పురుషులకు 1049 మహిళలు*

*రాష్ట్రంలో ఐదేళ్లలో పెరిగిన లింగ నిష్పత్తి.

*ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పెరిగిన సిజేరియన్లు*

*పెరిగిన ఊబకాయుల శాతం* *జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి*

రాష్ట్రంలో లింగ నిష్పత్తి స్వల్పంగా పెరిగింది. ఐదేళ్ల క్రితం ప్రతి వెయ్యి మంది పురుషులకు 1007 మంది మహిళలు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 1049కు పెరిగింది. రాష్ట్రంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (2019-20) నివేదికను కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ విడుదల చేసింది. 2019 జూన్‌ 30 నుంచి నవంబరు 14 వరకు 27,351 కుటుంబాల్లోని 27,518 మంది మహిళలు, 3,863 మంది పురుషులతో సర్వే నిర్వహించింది. ఆ వివరాలను తాజాగా వెల్లడించింది.

*సర్వేలోని ముఖ్యాంశాలు..*

* 15 ఏళ్లలోపు చిన్నారుల జనాభా 25.1% నుంచి 22.5%నికి తగ్గింది.

*  పురుషుల్లో అక్షరాస్యత 84.8%, మహిళల్లో 66.6%గా ఉంది.

*  57.4% మంది పురుషులు అంతర్జాలం (ఇంటర్నెట్‌) వినియోగిస్తుండగా.. మహిళలు 26.5% మంది ఉన్నారు.

*  మహిళల్లో ఊబకాయుల 2015-16లో 28.6% ఉండగా.. 2019-20లో 30.1%కు పెరిగింది. పురుషుల్లో 24.2 నుంచి 32.3% పెరిగింది.

*  బాలికల వివాహాలు 26.2 నుంచి 23.5 శాతానికి పెరిగాయి.

*  తెలంగాణలో శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. గ్రామీణ ప్రాంతాల్లో సగటు కన్నా ఎక్కువగా 18.8గా నమోదయ్యాయి. అక్కడ ఇంకా ఇళ్లలో ప్రసవాలు జరుగుతున్నాయి.

*  నవజాత శిశు మరణాలు నాలుగేళ్లలో 1000 మందికి 20 నుంచి 16.8కి తగ్గాయి. నాలుగేళ్లలోపు వయసున్న శిశు మరణాలు 31.7 నుంచి 29.4కు తగ్గాయి. నాలుగేళ్లలోపు చిన్నారులకు సరైన పోషకాహారం లభించక ఎత్తు, వయసుకు తగిన బరువు ఉండటం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరునెలల నుంచి నాలుగేళ్లలోపు చిన్నారుల్లో రక్తహీనత ఎక్కువగా ఉంది.

*తీరు మారని ఆస్పత్రులు.*

రాష్ట్రంలో సిజేరియన్‌ ప్రసవాలు గణనీయంగా పెరిగాయి. సుఖ ప్రసవం కోసం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ తీరు మారడం లేదు. గత నాలుగేళ్లలో ప్రైవేటు ఆస్పత్రుల్లో సిజేరియన్‌ ప్రసవాలు 74.5 నుంచి 81.5 శాతానికి పెరిగాయి. ప్రభుత్వ ఆస్పత్రులదీ అదే పరిస్థితి. ఇక్కడ 40.3 నుంచి 44.5 శాతానికి చేరింది. మొత్తం ఆస్పత్రుల సగటు తీసుకుంటే 57.7 నుంచి 60.7 శాతానికి పెరిగింది.

*మాత్రలు వేసుకున్నా తగ్గని మధుమేహం* పురుషులు, మహిళల్లో మధుమేహం ఎక్కువగా ఉంది. 141-160 ఎంజీ/డీఎల్‌ ఉన్నవారిలో మహిళలు 5.8 శాతం మంది, పురుషులు 6.9 శాతం మంది ఉన్నారు. 160 కన్నా ఎక్కువ ఉన్న మహిళలు 7, పురుషులు 9.3 శాతం మంది ఉన్నారు. మాత్రలు వేసుకున్నా 140 కన్నా ఎక్కువ ఉన్న మహిళలు 14.7 శాతం, పురుషులు 18.1 శాతం మంది ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. మందులు వేసుకున్నా మహిళల్లో 26.1 శాతం మందికి, పురుషుల్లో 31.4 శాతం మందికి బీపీ అదుపులోకి రావడం లేదు.  


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading