అమరావతి స్టీల్ బ్రిడ్జిపై ఫేక్ ప్రచారం.. అసలు నిజం బయటపెట్టిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న స్టీల్ బ్రిడ్జి గురించి ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. బకింగ్ హామ్ కెనాల్‌పై నిర్మిస్తున్న ఈ వంతెన గడ్డర్లు ఒరిగిపోయాయని, నిర్మాణంలో లోపాలు ఉన్నాయని కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే ఈ ప్రచారంపై అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ADCL) స్పష్టమైన వివరణ ఇచ్చింది. స్టీల్ బ్రిడ్జి పూర్తిగా సురక్షితంగానే ఉందని, ఒరిగిపోయిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అధికారులు వెల్లడించారు.
అమరావతిని జాతీయ రహదారి-16తో అనుసంధానించేందుకు ఈ స్టీల్ బ్రిడ్జిని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడం, కనెక్టివిటీ మెరుగుపరచడం లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ కొనసాగుతోంది. మొదట ఈ బ్రిడ్జిని ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని భావించినప్పటికీ, కొన్ని సాంకేతిక కారణాలతో పనులు ఆలస్యమయ్యాయి. అయినప్పటికీ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
ఇదే సమయంలో సోషల్ మీడియాలో “స్టీల్ బ్రిడ్జి ఒరిగిపోయింది”, “గడ్డర్లు వంకరగా మారాయి” అనే వార్తలు విస్తృతంగా ప్రచారం అయ్యాయి. రెండో వంతెన భాగంలో అమర్చిన భారీ గడ్డర్లు సాధారణ స్థాయికి మించి వంగిపోయాయని కొందరు ఆరోపించారు. కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ కావడంతో ప్రజల్లో సందేహాలు మొదలయ్యాయి.
ఈ అంశంపై స్పందించిన ADCL అధికారులు.. స్టీల్ బ్రిడ్జిల నిర్మాణంలో ఉపయోగించే పొడవైన గడ్డర్లను ప్రత్యేక సాంకేతిక పద్ధతుల్లో తయారు చేసి, తర్వాత వాటిని జాయింట్ చేస్తారని వివరించారు. నిర్మాణ సమయంలో మిల్లీమీటర్ల స్థాయిలో ఖచ్చితత్వంతో గడ్డర్లను బేరింగ్‌లపై అమర్చాల్సి ఉంటుందని చెప్పారు. ఈ ప్రక్రియలో చిన్నచిన్న సవరణలు సాధారణమేనని, వాటిని “బ్రిడ్జి ఒరిగిపోయింది”గా ప్రచారం చేయడం పూర్తిగా తప్పుదారి పట్టించడమేనని స్పష్టం చేశారు.
భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని కూడా అధికారులు పేర్కొన్నారు. ప్రతి దశలో ఇంజినీరింగ్ ప్రమాణాలు పాటిస్తూ నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. తప్పుడు ప్రచారం వల్ల ప్రజల్లో అనవసర భయాందోళనలు కలుగుతున్నాయని, అలాంటి ఫేక్ ప్రచారాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. గడ్డర్లు ఒరిగిపోయాయనే వార్తల్లో నిజం లేదని, నిర్మాణంలో భాగంగా జరిగే సాంకేతిక సర్దుబాట్లనే కొందరు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. స్టీల్ బ్రిడ్జి బలంగా, సురక్షితంగా ఉందని స్పష్టం చేసింది.
ఇక మరోవైపు మంగళగిరి ఎయిమ్స్ సమీపంలో కొండలను అక్రమంగా తవ్వుతున్నారనే ప్రచారంపైనా ప్రభుత్వం స్పందించింది. అక్కడ జరుగుతున్న పనులు అక్రమ తవ్వకాలు కాదని, అమరావతి-మంగళగిరి కనెక్టివిటీ కోసం నిర్మిస్తున్న E13 రహదారి ప్రాజెక్టులో భాగమేనని వివరించింది. ట్రాఫిక్ సమస్యలు తగ్గించేందుకు, ప్రయాణాన్ని సులభతరం చేయడానికి అధికారిక అనుమతులతోనే హిల్ కట్టింగ్ పనులు చేపట్టినట్లు తెలిపింది.
ఈ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని పర్యావరణ అనుమతులు ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొందరు సోషల్ మీడియాలో తప్పుదారి పట్టించే విధంగా పోస్టులు పెడుతున్నారని, ప్రజలు అలాంటి ప్రచారాలను నమ్మవద్దని అధికారులు సూచించారు. అమరావతి అభివృద్ధి పనులు పారదర్శకంగా, భద్రతా ప్రమాణాలతోనే కొనసాగుతున్నాయని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
