ఇటలీని మించనున్న విలయం

*ఇటలీని మించనున్న విలయం* *2.26 లక్షలు దాటిన బాధితులు* *ప్రపంచంలో ఆరో స్థానం దిశగా..* *దేశంలో కొత్తగా 9,851 కరోనా కేసులు* *24 గంటల్లో 273 మంది మృత్యువాత* *మొత్తం కేసుల విషయంలో ఇటలీని సమీపించినప్పటికీ.. ఆ దేశంతో పోలిస్తే మన దగ్గర మరణాలు 5 రెట్లు తక్కువగా ఉండడం కాస్త ఊరట.* దేశంలో కొవిడ్ విలయ తాండవం కొనసాగుతోంది. రోజురోజుకూ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో ఇటలీ ఒకటి. కానీ ఇప్పుడు రోగుల సంఖ్యలో ఆ దేశాన్ని కూడా మనం దాటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శుక్రవారం నాటికి ఇటలీలో 2.34 లక్షల కేసులు ఉండగా, మన దేశంలో 2.26 లక్షలు దాటాయి. దీంతో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ ఆరో స్థానానికి దగ్గరగా ఉంది. తాజాగా 24 గంటల్లో 9,851 మంది వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులివే. మరోవైపు, మరణాల ఉద్ధృతీ పెరుగుతోంది. తాజాగా 24 గంటల్లో మునుపెన్నడూ లేనంతగా 273 మంది కన్నుమూశారు. రోజువారీగా ఎక్కువ కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో ఇన్నాళ్లూ నాలుగో స్థానంలో ఉన్న భారత్.. తాజాగా రష్యాను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకుంది. అమెరికా, బ్రెజిల్ మాత్రమే మనకంటే ముందున్నాయి. దేశవ్యాప్తంగా 24 గంటల్లో గతంలో ఎన్నడూ లేనంత అధికంగా 5,355 మంది కోలుకున్నారు. తాజాగా ఒక్కరోజులో 1.43 లక్షలకుపైగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం కూడా రికార్డే. *మహారాష్ట్రలో మరణ మృదంగం* మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. 24 గంటల్లో 123 మరణాలు నమోదయ్యాయి. దిల్లీలో 44, గుజరాత్‌లో 33, ఉత్తర్ ప్రదేశ్‌లో 16 మంది కన్నుమూశారు. తాజా మరణాలన్నీ 17 రాష్ట్రాల్లోనే చోటుచేసుకున్నాయి. అందులో మహారాష్ట్ర, దిల్లీ, గుజరాత్, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్‌ల వాటాయే 83.51%. దిల్లీలో కొత్తగా 1,300 మందికిపైగా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. మహారాష్ట్ర తర్వాత ప్రతిరోజు దేశ రాజధానిలోనే ఎక్కువగా కేసులు వెలుగుచూస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో మునుపెన్నడూ లేనంతగా ఒక్కరోజులో 508 కొత్త కేసులొచ్చాయి. కర్ణాటక, హరియాణా, జమ్మూ-కశ్మీర్, అసోంలలో పరిస్థితి నానాటికీ తీవ్రమవుతోంది. అసోంలో 24 గంటల్లో 316 మంది కొవిడ్ పాజిటివ్‌గా తేలారు. త్రిపురలో 176, గోవాలో 87 కొత్త కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. * దిల్లీలో పరీక్షలు చేయించుకుంటున్నవారిలో సగటున ప్రతి నలుగురిలో ఒకరు వైరస్ పాజిటివ్‌గా తేలుతుండటం ఆందోళన కలిగిస్తోంది. * సశస్త్ర సీమ బల్(ఎస్‌ఎస్‌బీ)కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఒకరు కొవిడ్‌తో మృత్యువాతపడ్డారు. ఎస్‌ఎస్‌బీలో కరోనా సంబంధిత తొలి మరణం ఇదే. కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో ఇది తొమ్మిదో మరణం. *తమిళనాట మరో 1,438 కేసులు* తమిళనాట శుక్రవారం మరో 1,438 మందికి వైరస్ సోకింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 28,694కు చేరింది. 12 మంది ప్రాణాలు కోల్పోవడంతో.. మృతుల సంఖ్య 232కు పెరిగింది. *కర్ణాటకలో ఒకే రోజు 515* కర్ణాటకలో శుక్రవారం ఒక్కరోజే 515 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 4,835కు చేరింది. ఇంతవరకు కొవిడ్ బారినపడి 57మంది మృతి చెందారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
