*శాంతిని పునరుద్ధరించాలి

0

*శాంతిని పునరుద్ధరించాలి*

*చైనా వేగవంతంగా చర్యలు చేపట్టాలి* *విదేశీ వ్యవహారాల శాఖ*

దిల్లీ: ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా సరిహద్దులో సత్వరం శాంతి, సుహృద్భావాలు నెలకొనేలా చైనా చర్యలు చేపడుతుందని భారత్‌ ఆశాభావం వ్యక్తం చేసింది. పరస్పర సంతృప్తికర స్థాయిలో వివాదాస్పద అంశాలన్నీ పరిష్కృతమయ్యేవరకు సైనిక, దౌత్యవర్గాల స్థాయిలో సమావేశాలు కొనసాగుతాయని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ గురువారం విలేకరులకు తెలిపారు. ఉద్రిక్తతల్ని సడలించేలా చూసేందుకు ఉభయపక్షాలూ కట్టుబడి ఉన్న విషయాన్ని తాజా చర్చలు చెబుతున్నాయన్నారు.

మొత్తం పరిస్థితిని బాధ్యతాయుతంగా చక్కదిద్దుతామని చెప్పారు. బలగాల ఉపసంహరణకు రెండు దేశాలూ చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయన్నారు.

చైనాకు చెందిన 59 యాప్‌లపై నిషేధం విధించడాన్ని ప్రస్తావిస్తూ- డేటా భద్రత, వ్యక్తిగత గోప్యత సహా మన దేశం విధించిన నిబంధనలకు అనుగుణంగానే కంపెనీలన్నీ పని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ‘అంతర్జాల సాంకేతికతలు సహా అన్ని రంగాల్లోనూ విదేశీ పెట్టుబడులను భారత్‌ ఇకపైనా ఆహ్వానిస్తుంది.

మన నియమ నిబంధనలకు అవి కట్టుబడితే చాలు’ అని చెప్పారు. శాంతియుత జీవనం కోసం ఇజ్రాయెల్‌-పాలస్తీనాలు నేరుగా చర్చలు జరపాలని శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. *లద్దాఖ్‌లో రాజ్‌నాథ్‌ పర్యటన వాయిదా* రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారం లద్దాఖ్‌లో నిర్వహించాల్సిన పర్యటన వాయిదా పడింది.

దీనికి కారణాలేమిటనేది వెంటనే వెల్లడికాలేదు. త్వరలోనే ఆయన అక్కడ పర్యటిస్తారని మాత్రం అధికారిక వర్గాలు తెలిపాయి. *యాప్‌ల నిషేధం వివక్షాపూరితం:

చైనా* బీజింగ్‌: తమ దేశానికి చెందిన 59 యాప్‌లపై భారత్‌ నిషేధం విధించడాన్ని చైనా తప్పుపట్టింది. భారత ప్రభుత్వ చర్య వివక్షాపూరితంగా ఉందని విమర్శించింది. యాప్‌లపై నిషేధాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది.

చైనా వాణిజ్య శాఖ అధికార ప్రతినిధి గావో ఫెంగ్‌ గురువారం ఈ మేరకు స్పందించారు. తమ దేశ వ్యాపార సంస్థలపై వివక్షాపూరిత ధోరణులను ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు.

*మయన్మార్‌లో ఉగ్రసంస్థలకు చైనా దన్ను* *భారత్‌కు చిక్కులు తెచ్చిపెట్టాలన్నదే లక్ష్యం!*

చైనా దుర్బుద్ధి మరోసారి బట్టబయలయింది. మయన్మార్‌లో ఉగ్రవాదులకు అధునాతన ఆయుధాలు అందేలా సహకరిస్తున్నట్లు వెల్లడయింది. మయన్మారే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది.

తమ దేశంలో క్రియాశీలంగా ఉన్న ఉగ్రవాద సంస్థలకు కొన్ని బలమైన శక్తులు తోడ్పాటునందిస్తున్నాయని, ఉగ్రవాద సంస్థలను అణచివేయడానికి అంతర్జాతీయసహకారం కావాలని ఇటీవల రష్యా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మయన్మార్‌ సీనియర్‌ జనరల్‌ మిన్‌ ఆంగ్‌ హ్లాయింగ్‌ చెప్పారు.

చైనాను ఉద్దేశించే ఆయన బలమైనశక్తి అన్న పదం వాడారన్నది సుస్పష్టం. మయన్మార్‌ పశ్చిమ ప్రాంతంలో అరాకన్‌ ఆర్మీ (ఏఏ), అరాకన్‌ రోహింగ్యా సాల్వేషన్‌ ఆర్మీ(ఏఆర్‌ఎస్‌ఏ) ఉగ్రవాద సంస్థల ప్రాబల్యం ఎక్కువ. 2019లో సైన్యంపై జరిపిన దాడిలో చైనా తయారీ ఆయుధాలను ఉపయోగించినట్లు మయన్మార్‌ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్‌ జనరల్‌ జా మిన్‌ తున్‌ చెప్పారు.

గత ఏడాది నవంబర్‌లో నిషేధిత తాంగ్‌ నేషనల్‌ లిబరేషన్‌ ఆర్మీ నుంచి భారీ ఎత్తున ఆయుధాలను సైన్యం స్వాధీనం చేసుకుంది. అందులో చైనా తయారీవే ఎక్కువ. అరాకన్‌ ఆర్మీకి చైనా నుంచి భారీ ఎత్తున నిధులు కూడా సమకూరుతున్నట్లు తెలుస్తోంది. పాక్‌ సరిహద్దుల్లో చొరబాటు ఘటనల తరహాలో మయన్మార్‌ సరిహద్దుల్లోనూ చిక్కులు తెచ్చిపెట్టడం ద్వారా భారత్‌ను బలహీనపర్చాలని డ్రాగన్‌ ఎత్తుగడగా కనిపిస్తోంది.-

*అల్‌ బాదర్‌ పునరుద్ధరణను కోరుకుంటున్న చైనా*

దిల్లీ: పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద ముఠా అల్‌ బాదర్‌ను పునరుద్ధరించాలని చైనా సైన్యం కోరుకుంటోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ముఠా.. కశ్మీర్‌, అఫ్గానిస్థాన్‌లో హింసకు పాల్పడుతుండేది. ఇటీవల అల్‌ బాదర్‌ క్యాడర్‌ సభ్యులు.. పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో చైనా అధికారులను కలిశారు. ముఠా పునరుద్ధరణకు అన్ని రకాల సాయాన్ని అందిస్తామని చైనా హామీ ఇచ్చినట్లు ఆ వర్గాలు వివరించాయి.

Leave a Reply