*కోవిఫర్ పేరుతో కవిడ్ చికిత్సకు మార్కెట్లోకి తీసుకరనున్న హెటిరో*

IMG-20200621-WA0064.jpg

*కోవిఫర్ పేరుతో కవిడ్ చికిత్సకు మార్కెట్లోకి తీసుకరనున్న హెటిరో* న్యూదిల్లీ: కరోనా బాధితులకు మరో ఊరట. ఇప్పటికే గ్లెన్‌మార్క్‌ ‘ఫ్యావిపిరవిర్‌’కు డీసీజీఐ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా, కొవిడ్‌- 19తో బాధపడుతున్న వారికి కొంత ఉపశమనం కలిగిస్తోందని భావిస్తున్న పరిశోధనాత్మక ఔషధం (ఇన్వెస్టిగేషనల్‌ డ్రగ్‌) ‘రెమ్‌డెసివిర్‌’ తయారీకి జనరిక్‌ ఔషధ తయారీ సంస్థ హెటిరోకు డీసీజీఐ(డ్రగ్‌ కంట్రోల్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా) అనుమతి ఇచ్చింది. దీంతో గిలీడ్‌ సైన్సెస్‌ జనరిక్‌ వెర్షన్‌ రెమ్‌డెసివిర్‌ను హెటిరో ల్యాబ్స్‌ తయారు చేయనుంది. ‘కొవిఫర్‌’ పేరుతో దీన్ని భారత్‌లోకి తీసుకురానున్నట్లు హెటిరో ల్యాబ్స్‌ తెలిపింది. హైదరాబాద్‌లోనే దీనిని ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే గిలీడ్‌ సైన్సెస్‌ మనదేశానికి చెందిన కొన్ని జనరిక్‌ ఫార్మా కంపెనీలతో లైసెన్సింగ్‌ ఒప్పందాలు కుదుర్చుకుంది. తొలుత సిప్లా, జుబిలెంట్‌ లైఫ్ ‌సైన్సెస్‌, హెటెరో ల్యాబ్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, జైడస్‌ క్యాడిలాతో గిలీడ్‌ ఒప్పందాలు కుదిరాయి. ఇప్పుడు హెటిరో ల్యాబ్స్‌కు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా హెటిరో గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ పార్థసారథి మాట్లాడుతూ.. ‘దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ‘కొవిఫర్‌’(రెమ్‌డెసివిర్) తయారీకి అనుమతి లభించడం సంతోషం. ఈ ఔషధం గేమ్‌ ఛేంజర్‌ అవుతుందని భావిస్తున్నాం. దీనిని వెంటనే కొవిడ్‌ బాధితులకు అందుబాటులోకి తీసుకొస్తాం. సరిపడినంత స్టాక్‌ను తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. కొవిడ్‌-19తో బాధపడుతున్న పెద్దలు, చిన్నారులు ఎవరైనా దీనిని వినియోగించవచ్చని డీసీజీఐ ఇచ్చిన అనుమతిలో తెలిపింది. సమస్య తీవ్రంగా ఉన్న వారిపైనా ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని వెల్లడించింది. ‘కొవిఫర్‌’ 100ఎంజీ వయల్‌(ఇంజెక్షన్‌ రూపంలో)లభించనుంది. దీని ధర రూ.5వేల నుంచి రూ.6వేల మధ్య ఉండనుంది. ప్రపంచ వ్యాప్తంగా 127 దేశాల్లో ఈ ఔషధాన్ని విక్రయించే అవకాశం వివిధ కంపెనీలకు లభించింది. అంతేగాకుండా ఔషధ తయారీకి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం కూడా గిలీడ్‌ నుంచి ఈ కంపెనీలకు బదిలీ అయింది. నెలాఖరు నాటికి ఈ ఔషధాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. *కొవిడ్‌- 19 పాజిటివ్‌ బాధితులకే…* యాంటీ- వైరల్‌ ఔషధమైన ‘రెమ్‌డెసివిర్‌’, కొవిడ్‌- 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిన బాధితులు త్వరగా కోలుకునేందుకు వీలుకల్పిస్తుందని ప్రయోగ ఫలితాల్లో తేలింది. కరోనా వైరస్‌ ఒక వ్యక్తి శరీరంలో ప్రవేశించిన తర్వాత ఎంతో త్వరగా విస్తరిస్తుంది. తొలుత ఊపిరితిత్తుల్లోకి, తదుపరి ఉదర భాగంలోకి వెళ్లి స్థిరపడుతుంది. దీంతో రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడి ఇతర జబ్బులు దాడి చేసే అవకాశం ఏర్పడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ‘రెమ్‌డెసివిర్‌’ ఔషధాన్ని ఇస్తే…శరీరంలోని ‘వైరస్‌ లోడ్‌’ తగ్గి బాధితుడు త్వరగా కోలుకోవచ్చు. ‘రెమ్‌డెసివిర్‌’ 100 ఎంజీ ఇంజక్షన్‌ పౌడర్‌ను ఐవీ ఫ్లూయిడ్‌ ద్వారా ఆస్పత్రిలో వైద్యుల సమక్షంలో బాధితులకు ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి రోజు రెండు డోసులు, ఆ తర్వాత నాలుగు రోజుల పాటు ఒక్కో డోసు చొప్పున ఇస్తే ఫలితం ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. కొవిడ్‌- 19 తీవ్రత మరీ ఎక్కువగా ఉన్న బాధితులకు మాత్రం 10 రోజుల వరకూ ఈ మందుతో చికిత్స చేయాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. ‘ఇన్వెస్టిగేషనల్‌ డ్రగ్‌’ కాబట్టి ఈ మందును రోగిపై తప్పనిసరి అయితేనే వాడాలనే నిబంధన ఉంది. అంతేగాక ఈ మందు ఇచ్చిన తర్వాత రోగి ఏవిధంగా కోలుకున్నాడు, ఎటువంటి ప్రభావం చూపింది… అనే పూర్తి సమాచారాన్ని సేకరించి భద్రపరచాల్సి ఉంటుంది.


Discover more from TeluguWonders

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Discover more from TeluguWonders

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Verified by MonsterInsights