బొమ్మ పడింది..!

0

*బొమ్మ పడింది..!*

*తొమ్మిది నెలల తరువాత థియేటర్లలో సినిమా సందడి*

*తరలివచ్చిన ప్రేక్షకులు.. అన్ని చోట్లా తొలిరోజు హౌస్‌ఫుల్‌*

గాంధీనగర్‌(కాకినాడ): కరోనా నేపథ్యంలో మూత పడిన సినిమా థియేటర్లలో దాదాపు తొమ్మిది నెలల విరామం తరువాత కొత్త బొమ్మ పడింది. సాయిధరమ్‌ తేజ్‌ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. కరోనా దృష్ట్యా సినిమాహాళ్లకు జనం వస్తారా రారా..

అన్న సందేహాలను పటాపంచలు చేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని చోట్లా తొలిరోజు అన్ని ఆటలూ హౌస్‌ఫుల్‌ అయ్యాయి. అక్టోబరు 15 నాటికే థియేటర్లకు కొవిడ్‌ నిబంధనలు సడలించినప్పటికీ కొన్ని డబ్డింగ్‌ సినిమాలు తప్ప పూర్తిస్థాయి తెలుగు సినిమా విడుదల కాలేదు. ఎట్టకేలకు సినిమాహాళ్ల వద్ద కోలాహలం కనిపించింది.

*కొవిడ్‌ నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు..* _కొవిడ్‌ నేపథ్యంలో ప్రతి థియేటర్‌లోనూ.. మాస్క్‌ ధరించిన వారినే.. థర్మల్‌ స్కానింగ్‌ చేసి, శానిటైజర్‌ ఇచ్చాక లోపలకి పంపిస్తున్నారు.

షో ముగిసిన వెంటనే సీట్లకు డిస్‌-ఇన్ఫెక్షన్‌ స్ప్రే చేయిస్తున్నారు. ఆక్యుపెన్సీ 50 శాతమేననే నిబంధన ఉండటంతో సీటు పక్కన సీటును ఖాళీ వదిలి కూర్చోపెడుతున్నారు.

ఒక థియేటర్‌లో 500 సిటింగ్‌ కెపాసిటీ ఉంటే 250 మందికి మాత్రమే సీట్లు కేటాయిస్తారు. ఆ మేరకే థియేటర్లకు సంబంధించిన టికెట్ల బుకింగ్‌ సాఫ్ట్‌వేర్లను సైతం రూపొందించారు.

సినిమాహాళ్ల నిర్వాహకులు సీటు వదిలి సీటులో కూర్చోవాలని నిర్దేశించినా.. కొంతమంది ప్రేక్షకులు దగ్గరగా కూర్చొంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

* విశాఖ నగర పరిధిలోని గాజువాక, మధురవాడ, గోపాలపట్నం, మద్దిలపాలెం వంటి ప్రాంతాల్లో 20 వరకు థియేటర్లు తెరుచుకున్నాయి. శుక్రవారం ఆయా థియేటర్ల వద్ద పెద్దఎత్తున అభిమానుల సందడి కనిపించింది. పలువురు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. తొలిరోజు అన్ని షోలకు హౌస్‌ఫుల్‌ అయ్యిందని నిర్వాహకులు చెప్పారు.

* కాకినాడ నగరంలో సినిమా విడుదలైన అన్ని థియేటర్లలో తొలిరోజు టికెట్లన్నీ ఆన్‌లైన్‌లోనే క్షణాల్లో బుక్కయిపోయాయని నిర్వాహకులు చెప్పారు. చాలా కాలం తరువాత థియేటర్‌కు వచ్చి సినిమా చూస్తున్నామంటూ కొందరు యువకులు స్నేహితులతో కలిసి సెల్ఫీ తీసుకుని సామాజిక మాధ్యమాల్లో ఉంచుతూ ఆనందించారు.

*థియేటర్‌లో సినిమా చూస్తే ఆ ఆనందమే వేరు…*

చరణ్‌, సర్పవరం, కాకినాడ _ఆటవిడుపుగా స్నేహితులతో కలిసి సినిమా చూద్దామన్నా థియేటర్లు తెరుచుకోకపోవడంతో ఇబ్బంది పడ్డాం. ఇన్నాళ్లకు అందరం కలిసి సినిమాకు రావడం ఆనందంగా ఉంది. ఎన్ని ఓటీటీ వేదికలున్నా.. స్నేహితులతో కలిసి సరదాగా పెద్ద తెరపై, సౌండ్‌ ఎఫెక్ట్స్‌తో సినిమా చూస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం.

*ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు*

శ్రీరామ్‌, యజమాని, అన్నపూర్ణ థియేటర్‌, విజయవాడ*

థియేటర్లకు వచ్చేందుకు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఉన్నారు. చాలా మందికి టికెట్లు ఇవ్వలేకపోయాం. నాలుగు ఆటలకూ హౌస్‌ఫుల్‌ అయిపోయింది.. *ఊపిరొచ్చినట్లయింది..*

శ్రీనివాస్‌ సింగ్‌, విజయవాడలోని ఓ థియేటర్‌లో గేట్‌ మ్యాన్‌*

దాదాపు ఎనిమిది నెలలు ఉపాధి లేక అల్లాడిపోయాం. మా యాజమాన్యం కొంత సాయం చేసినా పూర్తి స్థాయిలో మాకు వేతనాలు ఇవ్వలేకపోయింది. ఇన్నాళ్లకు థియేటర్‌ తెరుచుకోవడంతో మాకు ఊపిరొచ్చినట్లయింది._

Leave a Reply