బంగారు కొండ దిగుతోంది

0

*బంగారు కొండ దిగుతోంది* *మేలిమిబంగారం 10 గ్రాములు రూ.54,600*

*రూ.67,000 కిందకు కిలో వెండి* *రష్యా కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఆవిష్కరణతోనే మార్పు*

*ఇతర వ్యాక్సిన్లు విజయవంతమైతే మరింత క్షీణతే*

*వ్యాపారుల అంచనా*

ఆకాశమే హద్దుగా చెలరేగిన బంగారం ధరలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ అడ్డుగా నిలిచింది. రష్యాలో తొలి వ్యాక్సిన్‌ను మంగళవారం విడుదల చేయడంతో పాటు అధ్యక్షుడి కుమార్తెకే చేశారన్న వార్తలతో అంతర్జాతీయంగా భారీ ఊరట లభించింది. ఫలితంగా హైదరాబాద్‌ బులియన్‌ విపణిలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.54,600కు దిగి వచ్చింది. ఇటీవల కాలంతో ఇది గరిష్ఠంగా రూ.58250కు చేరడం గమనార్హం. ఇదేవిధంగా కిలో వెండి ధర కూడా ఇటీవలి గరిష్ఠమైన రూ.76000 నుంచి రూ.67,000 కిందకు పరిమితమవుతోంది. ఆక్స్‌ఫర్డ్‌, భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్లు కూడా విజయవంతమైతే, బంగారం-వెండి ధరల్లో మరింత భారీ దిద్దుబాటు ఉండొచ్చనే అంచనాను ట్రేడర్లు వ్యక్తం చేస్తున్నారు._

వాణిజ్య విభాగం: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితికి తోడు, కొవిడ్‌ కేసులు అంతకంతకూ తీవ్రమవ్వడంతో, ఆందోళన చెందిన పెట్టుబడిదారులంతా సురక్షిత పెట్టుబడి సాధనమైన పసిడిపైకి దృష్టి సారించడంతో, ఇటీవల కాలంలో ఔన్సు (31.10 గ్రాములు) బంగారం గరిష్ఠంగా 2061 డాలర్లకు వెళ్లింది. వ్యాక్సిన్‌ విజయవంతమైతే, సాధారణ ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి. భిన్న రంగాలకు పెట్టుబడులు అవసరం. స్టాక్‌మార్కెట్లలోకీ నిధుల ప్రవాహం ఉంటుంది. ఫలితమే బంగారంలో ‘లాభాల స్వీకరణ’కు పెట్టుబడిదార్లు దిగారు. అందువల్లే అంతర్జాతీయ విపణిలో మంగళవారం రాత్రి 11 గంటల సమయానికి ఔన్సు బంగారం ధర 1939 డాలర్లకు చేరింది.

అంటే ఔన్సుకు 122 డాలర్లు (రూ.9100), గ్రాముకు 3.72 డాలర్ల (రూ.290)చొప్పున దిగి వచ్చింది. అంతర్జాతీయ విపణిలో ఔన్సు బంగారానికి 1875 డాలర్ల వద్ద గట్టి మద్దతు ఉందని, అంతకన్నా దిగితే, అంచనాలు చెప్పలేమంటున్నారు. *దుబాయ్‌లో గ్రాము రూ.4650*

బంగారం కోసం పూర్తిగా దిగుమతులపైనే మన దేశం ఆధారపడి ఉంది. కస్టమ్స్‌ సుంకం 12.5 శాతం, జీఎస్‌టీ 3 శాతం, నిర్వహణ ఖర్చులు కలిపి.. అంతర్జాతీయ విపణితో పోలిస్తే మొత్తం 16 శాతం అదనంగా ధర ఉంటుంది. మంగళవారం సాయంత్రం చూస్తే, దుబాయిలో మేలిమి బంగారం గ్రాము ధర మన రూపాయల్లో 4650 ఉంది. అదే మన మనదగ్గర గ్రాము రూ.5500 సమీపాన ఉంది. పన్ను భారమే రూ.750 అవుతోంది.

* దేశీయంగా మేలిమి (999 స్వచ్ఛత) బంగారం గ్రాము గరిష్ఠ ధర రూ.5825 * మంగళవారం రాత్రి గ్రాము రూ.5460 * కిలో లెక్కన చూసుకుంటే, కిలో బంగారం ధర గరిష్ఠస్థాయిల కంటే రూ.3 లక్షలకు పైగా తగ్గింది.

*వ్యాక్సిన్లు పూర్తిగా విజయవంతమైతే* అంతర్జాతీయంగా కొవిడ్‌ వ్యాక్సిన్లు ఎన్ని అభివృద్ధి చెందుతున్నా, ప్రధాన దృష్టి ఆక్స్‌ఫర్డ్‌, భారత్‌ బయోటెక్‌ ఉత్పత్తులపై కేంద్రీకృతమైంది. క్లినికల్‌ పరీక్షల అనంతరం ఆగస్టు చివరకు ఉత్పత్తి ప్రారంభించి, డిసెంబరులోగా విడుదల చేయగలమని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పేర్కొంది. ఎంత ఒత్తిడి ఎదురైనా, అత్యుత్తమ నాణ్యతతో, అందుబాటు ధరలో తెస్తామని భారత్‌ బయోటెక్‌ తెలిపింది. ఇవి పూర్తిగా విజయవంతమైతే, 10 గ్రాముల మేలిమి బంగారం మళ్లీ రూ.50,000-అంతకన్నా దిగువకు చేరొచ్చనీ భావిస్తున్నారు. అయితే ధర మరీ కిందకు రానీయరనే అంచనాలూ ఉన్నాయి.

Leave a Reply