Jagadeka Veerudu Athiloka Sundari: జగదేకవీరుడు అతిలోక సుందరి రీరిలీజ్.. 3D ప్రింట్ కోసం అంత కష్టపడ్డారా..?

మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో జగదేకవీరుడు అతిలోక సుందరి ఒకటి. అప్పట్లో థియేటర్లలో సంచలనం సృష్టించిన సినిమా. చిరు కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిన సినిమా ఇది. ఇందులో దివంగత హీరోయిన్ శ్రీదేవి కథానాయికగా నటించగా.. ఈ చిత్రంలోని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ సినిమాను మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.
టాలీవుడ్ నుంచి వచ్చి అతి పెద్ద సక్సెస్ సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచిన చిత్రం ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిన సినిమా ఇది. 1990వ సంవత్సరం మే నెల 9వ తేదీన విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనమే. అయితే ఈ ఏడాది ఈ సినిమా 35వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మే 9న మళ్లీ థియేటర్లలో విడుదలకు సిద్ధం చేశారు. అది కూడా 2D అండ్ 3D ఫార్మాట్లలో. ఈ సోషియో-ఫాంటసీ డ్రామాకు విజనరీ దర్శకుడు కే. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా.. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ నిర్మించారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్‌కి ఒక గేమ్‌చేంజర్‌గా ఆయన ఇప్పటికీ భావిస్తుంటారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జోడిగా శ్రీదేవి నటించి ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. అమ్రిష్ పురి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రామిరెడ్డి, బేబీ శాలిని, బేబీ షామ్లీ వంటి ప్రతిభావంతులైన నటీనటులు కీలక పాత్రలు పోషించారు.
అయితే ఈ క్లాసిక్ చిత్రాన్ని లేటెస్ట్ ప్రింట్ తో నేటితరం ప్రేక్షకుల ముందు పెట్టాలనే సవాలుతో చిత్ర బృందం ఎంతో కష్టపడింది. మూడు సంవత్సరాల పాటు ఎన్నో చోట్ల, ఎంత వెతికినా కూడా అసలైన నెగటివ్ దొరకలేదు. చివరికి దొరికిన కాపీ కూడా చాలా దెబ్బతిని ఉంది. అయినప్పటికీ, ప్రసాద్ కార్పొరేషన్ సహకారంతో చిత్రబృందం అవిశ్రాంతంగా శ్రమించి ప్రైమ్ ఫోకస్ సాయంతో 3D రూపానికి తీసుకురావడంలో విజయవంతమయ్యారు.
2018లో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ నెగటివ్ రీల్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రతి మూలకు ఫోన్ చేసి, చిన్న థియేటర్లలోనూ ఉపయోగపడే రీల్ ఉందేమో అడిగి తెలుసుకుంది చిత్రబృందం. అయితే కొన్నిచోట్ల రీల్స్ పూర్తిగా డికంపోజ్ కాగా, చివరకు 2021లో విజయవాడలోని అప్పారావు అనే వ్యక్తి వద్ద ఉపయోగపడే ప్రింట్ రీల్ ఒకటి దొరికిందని చిత్రబృందం చెబుతోంది. అదికూడా దుమ్ము దూళితో నిండిపోయి మసకబడిపోయిన స్థితిలో ఉండగా.. చిత్రయూనిట్ అంతా ఎంతో కష్టపడి పునరుద్ధరణ ప్రారంభిచారట. రీల్ ఎక్కడ ఎక్కడ కట్ అయిందో అక్కడ దానికి మరమ్మతు చేసి, జాగ్రత్తగా స్కాన్ చేశారు. ఫ్రేమ్ వారీగా ఉన్న డిజిటల్ స్క్రాచెస్‌ను తొలగించారు. తర్వాత చిత్రాన్ని 8K రెజల్యూషన్‌లో డిజిటైజ్ చేసి, 4K అవుట్‌పుట్‌గా మార్చారు. భారతీయ సినిమాలో ఇప్పటివరకు ఎవరూ ప్రయత్నించని విధంగా, చిత్రాన్ని 3D రూపంలోకి మార్చే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.
Discover more from TeluguWonders
Subscribe to get the latest posts sent to your email.
