గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరో సంచలనానికి తెరలేపారు. బీజేపీలోనే నాకు వెన్నుపోటుదారులు ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పెనుదుమారానికే దారితీశాయి. బీజేపీలో చాలా మంది తనను ఎప్పుడు వెన్నుపోటు పొడుద్దామా..? అనే ఆలోచన పెట్టుకున్నారని రాజాసింగ్ అనడం గమనార్హం.
హైదరాబాద్ సిటీ: బీజేపీలో చాలా మంది తనను ఎప్పుడు వెన్నుపోటు పొడుద్దామా..? అనే ఆలోచన పెట్టుకున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(Goshamahal MLA Raja Singh) అన్నారు. గత సర్కారు తనపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపిందని, ఆ సమయంలో కొంతమంది బీజేపీ నేతలు కూడా పోలీసులకు మద్దతుగా నిలిచారని ఆరోపించారు. ‘నీపై పీడీయాక్ట్ పెడుతున్నాం. మీ బీజేపీ(BJP) వాళ్లు కూడా ప్రోత్సహిస్తున్నారు’ అని ఒక పోలీసు అధికారి తనతో చెప్పారని రాజాసింగ్ వెల్లడించారు.
తనను జైలులో పెట్టినప్పడు కార్యకర్తలు అండగా నిలిచారని చెప్పారు. మంగళవారం గోషామహల్ నియోజకవర్గంలోని ఆకాశపురి హనుమాన్ దేవాలయం వద్ద రాజాసింగ్ మాట్లాడారు. పోలీసు శాఖతో పెట్టుకోవద్దని మాజీ మంత్రి కేటీఆర్(KTR)కు సూచించారు. అధికారంలోకి వచ్చాక పదవీ విరమణ చేసిన పోలీసుల మీద కూడా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ అనడం సరికాదని అన్నారు. పోలీసులు అధికారంలో ఉన్న వారి మాట వింటారని.. అయినా న్యాయపరంగానే పనిచేస్తారని అన్నారు.
‘రేవంత్‌రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు మీ ఆదేశంతో పోలీసులు ఆయన ఇంట్లోకి చొరబడ్డారు. బెడ్‌రూమ్‌లోకి చొచ్చుకెళ్లి మరీ రేవంత్‌ను అరెస్టు చేసి జైలుకి పంపించారు. ఆ విషయాన్ని మరిచిపోయారా..?’ అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన్ను గతంలో అరెస్టు చేసిన వారిపై ప్రతీకార చర్యలేమీ తీసుకోలేదన్నారు
Discover more from Telugu Wonders
Subscribe to get the latest posts sent to your email.