రిలయన్స్‌ శంఖారావం

0

*రిలయన్స్‌ శంఖారావం*

*వచ్చే ఏడాదికి స్వదేశీ 5జీ టెక్నాలజీ* *గూగుల్‌తో ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టం*

*అందుబాటు ధరలో 4జీ-5జీ స్మార్ట్‌ఫోన్లు*

*వర్చువల్‌ సమావేశాల కోసం జియో గ్లాస్‌*

*జియోమార్ట్‌తో ఇళ్లకు తాజా కూరలు, పళ్లు*

*ఏజీఎం 48 దేశాల్లోని 550 నగరాల నుంచి 3.2 లక్షల మంది వీక్షణ*

వచ్చే ఏడాదికి పూర్తి స్వదేశీ 5జీ టెక్నాలజీ సొల్యూషన్‌.. గూగుల్‌ భాగస్వామ్యంతో ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, చౌకగా 4జీ-5జీ స్మార్ట్‌ఫోన్లు.. ఇ-కామర్స్‌లో దూకుడు.. ఇవీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఏజీఎంలో ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ వెల్లడించిన విశేషాలు.. వర్చువల్‌ రియాలిటీ సేవలకు జియోగ్లాస్‌.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లన్నీ ఒకే వేదికపైకి తెచ్చే జియో టీవీ+ను ఈశా, ఆకాశ్‌ అంబానీ ఆవిష్కరించారు._

*ముంబయి* పెట్రో రసాయన వ్యాపారం నుంచి అధునాతన ఇంధనమైన డేటా సేవలతో దేశీయ టెలికాం రంగ ముఖచిత్రాన్నే మార్చిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 43వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) బుధవారం దృశ్యమాధ్యమ విధానంలో సరికొత్తగా జరిగింది. ఆర్‌ఐఎల్‌ వ్యవస్థాపకులు ధీరూభాయ్‌ అంబానీ 1985లో, కోపరేజ్‌ ఫుట్‌బాల్‌ మైదానంలో 12,000 వాటాదార్లతో ఏజీఎం నిర్వహించడం సంచలనమే అయ్యింది. ఇప్పుడు కొవిడ్‌-19 నేపథ్యంలో, సంప్రదాయ పద్ధతిలో మదుపర్ల సమావేశం జరపలేకపోయినా, జియో మీట్‌ సాయంతో అంతకన్నా ఘనంగా దశ్యమాధ్యమ విధానంలో తొలిసారిగా నిర్వహించారు. 48 దేశాల్లోని 550 నగరాల నుంచి 3.20 లక్షల మంది వాటాదార్లు ఈ సమావేశాన్ని వీక్షించినట్లు సంస్థ తెలిపింది. ముకేశ్‌ వెల్లడించిన ముఖ్యాంశాలివీ.. ‘ప్రపంచానికి అవసరమైన డిజిటల్‌ ఉత్పత్తులు, సేవలు అందించే కంపెనీ భారత్‌ నుంచే ఆవిర్భవించే సమయం దగ్గరలోనే ఉంది. అత్యుత్తమ సంస్థగా ఘతన సాధించాలి. అంతర్జాతీయంగా ఉన్న అవకాశాలను జియో ప్లాట్‌ఫామ్స్‌ అన్వేషించి, ఆదాయాన్ని ఆర్జించాలి. దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేసేలా, ఎన్నో రంగాలకు అవసరమైన సాంకేతికత, వినూత్న ఆవిష్కరణలను ఆర్‌ఐఎల్‌ రూపొందించింది.

*5జీ*

దేశీయంగానే 5జీ టెక్నాలజీని జియో సంపూర్ణంగా రూపొందిస్తోంది. 5జీ స్పెక్ట్రమ్‌ కేటాయించగానే, ప్రయోగాత్మక సేవలకు శ్రీకారం చుడతాం. జియో 4జీ నెట్‌వర్క్‌ను వెంటనే 5జీకి మార్చుకునేలానే నిర్మించాం. మాకు మేధోహక్కులు కలిగిన 5జీ సొల్యూషన్‌ను అంతర్జాతీయంగా ఎగుమతి చేసే అవకాశాలున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ నినాదమైన ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’కు ఈ సొల్యూషన్‌ను అంకితమిస్తున్నాం. రాబోయే మూడేళ్లలో 50 కోట్ల మంది చందాదార్లు రిలయన్స్‌ జియోకు ఉంటారు. 5 కోట్లమంది ఇళ్లకు వ్యాపార సేవలు కూడా అందిస్తుంది. మీడియా, ఆర్థికసేవలు, వాణిజ్యం, విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, నవీననగరాలు వంటి వాటికి ఇది ఉపయోగ పడుతుంది.

*జియోబ్రాడ్‌బ్యాండ్‌*

చిన్న వ్యాపారాలు, వాణిజ్య సంస్థలకు కూడా బ్రాడ్‌బ్యాండ్‌ సదుపాయం కల్పించబోతున్నాం. నారోబ్యాండ్‌ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ సేవలు అందిస్తాం. డెన్‌, హాత్‌వే కేబుల్‌ సంస్థలు నెట్‌వర్క్‌ 18చ టీవీ18లో విలీనమయ్యాయి. మైక్రోసాఫ్ట్‌తో కలిసి అజూర్‌ క్లౌడ్‌ భాగస్వామ్య సేవలు అందిస్తున్నాం.

*జియోమార్ట్‌*

ఆన్‌లైన్‌ షాపింగ్‌ పోర్టల్‌ అయిన జియోమార్ట్‌, వాట్సాప్‌ కలిసి ప్రతి ఒక్కరి ‘ఇంటి పక్కన ఉండే దుకాణాల’ తీరునే మార్చేయబోతున్నాయి. సంప్రదాయ దుకాణాలన్నీ ఆన్‌లైన్‌ ద్వారా అందుబాటులో ఉండటమే కాక, సరకును సత్వరం చేరవేయనున్నాయి. 200 నగరాల్లో రోజుకు 2.5 లక్షల ఆర్డర్లు ప్రస్తుతం లభిస్తున్నాయి. రైతులతో కూడా ఒప్పందం చేసుకుని, నేరుగా తాజా కూరలు, పళ్లు వినియోగదారుల ఇళ్లకు చేర్చాలన్నది లక్ష్యం.

*జియోటీవీ+* ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు అయిన నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌, హాట్‌స్టార్‌ వంటి వాటిని ఒకే యాప్‌లోకి తీసుకు వచ్చేందుకు జియో టీవీ+ సహకరిస్తుంది. వాయిస్‌ ఆధారితంగా కావాల్సిన సినిమా, వీడియోను వెతుక్కోవచ్చు.

*జియోగ్లాస్‌* వర్చువల్‌ రియాలిటీ సేవలకు ఉపయోగపడే ఈ కాన్సెప్ట్‌ను కొన్నేళ్ల క్రితం గూగుల్‌ ప్రతిపాదించగా, ఆ సంస్థతో ఒప్పందం కుదిరినప్పుడే జియో ఈ పరికరాన్ని ఆవిష్కరించడం గమనార్హం. 75 గ్రాముల బరువు మాత్రమే ఉండే ఈ రియాలిటీ హెడ్‌సెట్‌ ద్వారా హాలోగ్రాఫిక్‌ వీడియో కాలింగ్‌, 3డీ సేవలు పొందొచ్చు. 25 యాప్‌లు కలిగిన దీన్ని, కేబుల్‌ ద్వారా ఫోన్‌కు అనుసంధానించడం వల్ల ఇంటర్నెట్‌కు చేరొచ్చు. ఆడియో సిస్టం కూడా ఇందులో మిళితమై ఉంటుంది. కొవిడ్‌ నేపథ్యంలో, ఇంటి నుంచి పనిచేస్తున్నవారు కూడా కార్యాలయంలో జరుగుతున్న సమావేశానికి వర్చువల్‌గా హాజరు కావచ్చు. సహ ఉద్యోగులతో చాట్‌ చేస్తూనే, ప్రజెంటేషన్‌ కూడా ఇవ్వొచ్చు. 3డీ వర్చువల్‌ గదుల్లో హాలోగ్రామ్‌ తరగతులను టీచర్లు నిర్వహించేందుకూ ఉపయోగ పడుతుంది. ఇలాంటి పరికరాల ధరలు రూ.37,000-40,000 శ్రేణిలో ఉంటాయి. *మిగులు నిధులు*

గత ఏజీఎంలో చెప్పినట్లే ఆర్‌ఐఎల్‌ రుణ రహిత కంపెనీగా మారుతోంది. పెట్రో రసాయనాలు, రిటైల్‌ వ్యాపారాల్లోకి భారీ వ్యూహాత్మక పెట్టుబడులు తరలివచ్చాయి. 3 నెలల వ్యవధిలోనే జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి రూ.1.52 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. ఇందులో రూ.73,636.43 కోట్లు ఇప్పటికే వచ్చేశాయి. ఆర్‌ఐఎల్‌ రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.53,124 కోట్లు, పెట్రో రిటైల్‌ వ్యాపారంలో 49 శాతం వాటాను బీపీకి విక్రయించడం ద్వారా రూ.7,629 కోట్లు సమీకరించాం. మొత్తంమీద రూ.2,12,809 కోట్లు సమీకరిస్తున్నాం. ఆర్‌ఐఎల్‌ నికరరుణం రూ.1,61,035 కోట్ల కంటే ఇవి ఎంతో ఎక్కువ. లక్ష్యం కంటే ముందుగానే ఈ ఘనత సాధించాం. రాబోయే కొన్ని త్రైమాసికాల వరకు రిలయన్స్‌ రిటైల్‌లోకి మరిందరు అంతర్జాతీయ భాగస్వాములను, పెట్టుబడిదారులను ఆహ్వానిస్తాం.

*ఆరామ్‌కో* చమురు, రసాయనాల (ఓ2సి) విభాగంలో 20 శాతం వాటాను 1500 కోట్ల డాలర్లకు సౌదీ దిగ్గజం ఆరామ్‌కోకు విక్రయించడం ఒక్కటే అనుకున్న సమయంలో జరగలేదు. ఆ సంస్థలో 2 దశాబ్దాల అనుబంధం ఉంది. దీర్ఘకాల భాగస్వామిగా కొనసాగుతాం. ఓ2సి విభాగాన్ని ప్రత్యేక అనుబంధ సంస్థగా గుర్తించాలని కోరుతూ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)ని ఆశ్రయిస్తాం. అయితే ఆరామ్‌కో ఒప్పందం ముందుకు వెళ్తుందో, లేదో స్పష్టత నివ్వలేదు.

*ప్రపంచ అగ్రగామి 60 కంపెనీల్లో చోటు* 15000 కోట్ల డాలర్ల (రూ.12 లక్షల కోట్లకు పైగా) మార్కెట్‌ విలువ సాధించిన తొలి దేశీయ కంపెనీగా ఆర్‌ఐఎల్‌ నిలిచింది. విలువ పరంగా ప్రపంచంలోని అగ్రశ్రేణి 60 కంపెనీల్లో ఘనంగా స్థానం పొందింది. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ), వ్యాట్‌ రూపేణ అత్యధికంగా రూ.21,660 కోట్లు చెల్లించాం. *రూ.45,000 కోట్లు తగ్గిన మార్కెట్‌ విలువ*

ఆర్‌ఐఎల్‌ షేరు బీఎస్‌ఈలో ఇంట్రాడేలో గరిష్ఠమైన రూ.1978.50కు చేరింది. తదుపరి, ముకేశ్‌ అంబానీ ఇన్ని భారీ ప్రకటనలు చేసినా, లాభాలు స్వీకరించేందుకు మదుపర్లు ప్రయత్నించారు. ఫలితంగా బీఎస్‌ఈలో షేరు 3.71 శాతం నష్టపోయి రూ.1845.60 వద్ద స్థిరపడింది. సంస్థ మార్కెట్‌ విలువ రూ.45,014.51 కోట్లు తగ్గి, రూ.11,70,000.49 కోట్లుగా నిలిచింది. _వ్యూహాత్మక పెట్టుబడిదారుగా గూగుల్‌ను జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి ఆహ్వానిస్తున్నాం. దేశంలో కోట్ల మందికి కావాల్సిన సమాచారాన్ని అందించడంలో గూగుల్‌ పాత్ర ఎనలేనిది. మార్పు, వినూత్నతకు జియో దర్పణం. ఈ రెండూ కలిసి ముందుకు సాగుతాయి. జియో ప్లాట్‌పామ్స్‌లో 7.7 శాతం వాటాకు రూ.33,737 కోట్లు చెల్లించేందుకు గూగుల్‌ అంగీకరించింది. –

*ముకేశ్‌ అంబానీ, ఆర్‌ఐఎల్‌ ఛైర్మన్‌*_ *జియోలో గూగుల్‌*

*7.7 శాతం వాటాకు రూ.33,737 కోట్లు* అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజం గూగుల్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) భాగస్వాములుగా మారుతున్నాయి. ఆర్‌ఐఎల్‌ టెక్నాలజీ విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో 7.7 శాతం వాటాను రూ.33,737 కోట్లకు కొనుగోలు చేసేందుకు గూగుల్‌ అంగీకరించింది. గత ఏప్రిల్‌ నుంచి చూస్తే, ఇది 13వ పెట్టుబడి. తాజా పెట్టుబడితో కలిపి జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి వస్తున్న మొత్తం రూ.1.52 లక్షల కోట్లకు చేరింది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 9.99 శాతం వాటాను కొనుగోలు చేయడం ద్వారా ఫేస్‌బుక్‌ ఈ పెట్టుబడుల ప్రక్రియకు శ్రీకారం చుట్టగా, చిప్‌ తయారీ సంస్థ ఇంటెల్‌ కార్పొరేషన్‌, క్వాల్‌కామ్‌ కూడా పెట్టుబడులు పెట్టాయి. దీనితో కలిపి మొత్తం జియో ప్లాట్‌ఫామ్స్‌లో 32.84 శాతం వాటా విక్రయం ద్వారా రూ.1,52,055.45 కోట్లను ఆర్‌ఐఎల్‌ సమీకరిస్తున్నట్లు అయ్యింది.

* ప్రతి భారతీయుడి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉండాలనే లక్ష్యంతో గూగుల్‌, జియో చేతులు కలిపాయి. స్మార్ట్‌ఫోన్లకు ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టంతో పాటు, అందుబాటు ధరలో 4జీ, 5జీ స్మార్ట్‌ఫోన్లు ఆవిష్కరిస్తారు. ప్రస్తుత ధరలతో పోలిస్తే బాగా తక్కువకే అందిస్తారు.

*రిలయన్స్‌ శంఖారావం* భారత్‌కు గూగుల్‌ ప్రకటించిన 1000 కోట్ల డాలర్ల పెట్టుబడిలో తొలిగా 450 కోట్ల డాలర్లు జియోలో పెడుతున్నాం. భారతదేశ డిజిటలీకరణ ప్రక్రియలో గూగుల్‌, జియో ఎంతో పాటుపడుతున్నాయి. ఇరు సంస్థల సామర్థ్యాలను మరింత బాగా వినియోగించడం ద్వారా, దేశానికి కావాల్సిన ఉత్పత్తులు తయారు చేస్తాం. మరిన్ని కోట్ల మందికి స్మార్ట్‌ఫోన్‌ను చేరువ చేసేందుకు, మొబైల్‌ అనుభవాన్ని మెరుగుపరచేందుకు మా భాగస్వామ్యం కృషి చేస్తుంది. మరో 100 కోట్లకి ఇంట్నెట్‌ను చేరువ చేయాలన్న గూగుల్‌ లక్ష్యంలో భారత్‌ కేంద్రస్థానంలో ఉంది. – *సుందర్‌ పిచాయ్‌, గూగుల్‌ సీఈఓ*

Leave a Reply